కొన్ని సినిమాలు నిర్మాణానికి ముందే ఆసక్తిని కలిగిస్తాయి. కొన్ని సినిమాలు ఎలాంటి సందడీ లేకుండా నిర్మాణం పూర్తి చేసేసుకుంటాయి. రెండో కోవలోకి చెందుతుంది 'నరుడా డోనరుడా' సినిమా. ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలియదు, సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వచ్చేసాయి. పాటలు కూడా విడుదలైపోయాయి.
నవంబర్ 4న సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని స్వయంగా హీరో సుమంత్ తీసుకున్నాడు. ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఆయన ఈ పని చేయలేడు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'విక్కీడోనర్' సినిమానే తెలుగులో 'నరుడా డోనరుడా' పేరుతో రీమేక్ చేశారు. ట్రైలర్ వచ్చిన తరువాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొదటి లుక్ స్టిల్ చూడగానే కొంచెం అభ్యంతరకరంగా అనిపించినప్పటికీ, ట్రైలర్‌లో తనికెళ్ళ భరణి డైలాగ్ మాడ్యులేషన్ సినిమాకి 'ఫన్' టచ్‌ని ఇచ్చింది. స్పెర్మ్ డోనర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ఆలోచనాత్మకంగానే కాక, ఎడ్యుకేట్ చేసేలా ఉండబోతోంది. సున్నితమైన ఇలాంటి అంశాలకు ఎంత ఫన్ జోడిస్తే కాన్సెప్ట్ అంతగా వర్కవుట్ అవుతుందని నమ్మి 'నరుడా డోనరుడా' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇంతలా కష్టపడ్డాక ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ కాకుండా ఉంటుందా? చూడాలిక.
|