ఏదీ ప్లాన్ చేయను.. నచ్చిందంటే వదలను - రకుల్ ప్రీత్ సింగ్
ఇది వరకు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే టక్కున ఒకరి పేరు తడుముకోకుండా చెప్పేసేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. ఆ స్థానానికి అందరి నుంచీ పోటీ ఉంది. అందరికీ.. రకుల్ నుంచి ఎక్కువ పోటీ ఎదురవుతోంది. స్పీడు స్పీడుగా ఎదిగేసిన కథానాయికల్లో రకుల్ ముందు వరుసలో ఉంటుంది. చేతిలో ఎప్పుడూ నాలుగైదు సినిమాల్ని ఉంచుకొంటుంది రకుల్. ఈ యేడాది ఏకంగా మూడు హిట్లు కొట్టింది. 2017లోనూ తన కాలెండర్ ఇయర్ ఇలానే స్పీడు స్పీడుగా హిట్ల మీద హిట్లు కొడుతూ సాగిపోతుందని బలంగా నమ్ముతోంది రకుల్. ఇటీవలే ధృవతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్న రకుల్‌తో జరిపిన చిన్ని చిన్ని ముచ్చట్లివి...
* హాయ్.. రకుల్
- హాయండీ...
* 2016 ఎలా గడిచింది?
- చూస్తూనే ఉన్నారు కదా..? మంచి పాత్రలు చేతికి దక్కాయి. చేసిన ప్రతీ సినిమాకీ తగిన ఫలితం దక్కింది. చివర్లో వచ్చిన ధృవ కూడా హిట్టే. ఇదే ఆనందం, ఇదే ఉత్సాహం 2017లోనూ ఉండాలని కోరుకొంటున్నా. నా న్యూ ఇయర్ సంబరాలు ధృవతోనే మొదలయ్యాయి. అప్పుడే పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయా.
* తని ఒరువన్ చూశారా?
- చూశా. చాలా బాగా నచ్చింది. ఆ సినిమాని రీమేక్ చేస్తున్నారు.. అందులో హీరోయిన్ నువ్వే అనేసరికి... చాలా హ్యాపీగా అనిపించింది. తని ఒరువన్‌లో కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. ఆ మాటకొస్తే.. ధృవలోనే నా క్యారెక్టర్ లెంగ్త్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో నేను డబుల్ హ్యాపీ.
* కాకపోతే సినిమా అంతా హీరో, విలన్‌ల చుట్టూనే తిరుగుతుంది కదా?
- అవును. అసలు కథలో ఉన్న గొప్పదనమే అది. ఇలాంటి సినిమాల్లో నాకు నటించే అవకాశం రాలేదు అని కంప్లైంట్ చేయకూడదు. అసలు ఛాన్స్‌రావడమే గొప్ప. మేరీకోమ్ జీవిత కథతో సినిమా తీస్తున్నారనుకోండి.. అందులో మేరీకోమ్ పాత్రలకు నటించే ఛాన్స్ ఇవ్వకపోవడం అన్యాయం. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కొంచెం తక్కువగానే ఉంటాయి. నాకూ కొంత భాగం ఉంటే సరిపోతుంది. హీరోకి సమానంగా నా రోల్ ఉండాలి అనుకోవడం అత్యాశ.
* ఓ పాటలో హాట్ హాట్‌గా అందాలు ఆరేసి ఆ కొరత తీర్చుకొన్నారా?
- మీరు దాన్ని హాట్ పాట అంటున్నారు.. నేను గ్లామర్ సాంగ్ అంటాను. ఈ సినిమాలో ఇలాంటి పాట ఉండాలి.. అంటూ సురేందర్ రెడ్డిగారు డిజైన్ చేశారు. ఆయన ఏం చెబితే నేను అది ఫాలో అయ్యానంతే. ఈ పాట గ్లామర్‌గా ఉంటుంది గానీ, వల్గర్‌గా ఉండదు. అలా ఉంటే నేను ఎంకరేజ్ చేయను.
* అటు చరణ్‌తో, ఇటు సురేందర్ రెడ్డితో మీకిది రెండో సినిమా..
- అవును.. చరణ్‌తో ఇది వరకు చేసిన బ్రూస్లీ సరిగా ఆడలేదు. సూరితో చేసిన కిక్ 2 కూడా అంతే. అందుకే వీరిద్దరితో కలసి చేస్తున్న ఈ సినిమామ ఎలాగైనా హిట్ అవ్వాలని దేవుడ్ని కోరుకొన్నా. ఇప్పుడు అదే జరిగింది.
* ఈ సమయంలో ఇలాంటి కథ చేయాలి, ఇలాంటి పాత్రలో కనిపించాలి అని ఎప్పుడైనా అనుకొంటారా?
- లేదండీ. నేనేదీ ప్లాన్ చేసుకోను. నచ్చిన పాత్ర వస్తే వదులుకోను. ధృవ సినిమానే తీసుకోండి. `ఈ కథని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలకూడదు.. డేట్లు కాస్త అటూ ఇటూ అడ్జస్ట్ చేసైనా చేస్తా` అని ముందే బలంగా ఫిక్సయ్యా.
* మీరు నమ్మేది కథనా, లేదంటే మీ పాత్రనా.. ఇవి రెండూ కాకుండా కాంబినేషన్లనా?
- దర్శకుడ్ని. అవును.. రాజమౌళి లాంటి దర్శకుడు పిలిచి అవకాశం ఇస్తానంటే.. కథ గురించి కాంబినేషన్ల గురించి ఆలోచిస్తామా?
* మురుగదాస్ సినిమా ఎంత వరకూ వచ్చింది?
- నాకు ఇష్టమైన దర్శకుడు.. ఇష్టమైన హీరో వీళ్లిద్దరితో చేస్తున్న సినిమా అది. నా కెరీర్‌లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. షూటింగ్ పూర్తి కావొచ్చింది. మురుగదాస్ చాలా ఫాస్ట్ ఫాస్ట్‌గా సినిమా పూర్తి చేస్తున్నారు.
* 2017లోనూ ఇదే జోరు చూపిస్తారన్న నమ్మకం ఉందా?
- చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఆ కథలు, అందులోని నా పాత్రలూ బలంగా ఉన్నాయి. కాబట్టి విజయపరంపర కొనసాగుతుందనే అనుకొంటున్నా.
* ధృవకి డబ్బింగ్ చెప్పుకోలేదు.. కారణం ఏమిటి?
- నిజంగా ఈ సినిమాకి నేనే డబ్బింగ్ చెప్పుకొందామనుకొన్నా. కానీ సమయం సరిపోలేదు. చేతిలో సినిమాలున్నాయి. సగం రోజు ప్రయాణాలకే సరిపోతుంది. నా కోసం చిత్రబృందం కూడా వెయిట్ చేసింది. నేనూ నా గొంతు వినిపిద్దామనే అనుకొన్నా.
* ఫిట్‌నెస్ సెంటర్‌ని పెట్టారు.. ఇతరత్రా వ్యాపారాలూ చేయాలని ఉందా?
- లేదండీ. నాకు ఫిట్ నెస్ అంటే ఇష్టం. అందుకే జిమ్ సెంటర్‌ని పెట్టా. వ్యాపారాలపై పెద్దగా ఆసక్తి లేదు.
* చాలా తక్కువ సమయంలోనే కథానాయికగా ఎంతో ఎత్తుకు ఎదిగారు.. ఆ రహస్యం ఏమిటి?
- నా దర్శకులే. వాళ్లేం చెబితే నేను అదే చేశా. ఇలాంటి కెరీర్ ఏ కొద్దిమందికో సాధ్యం అవుతుంది. నాకన్నీ కలిసొచ్చాయి.
* న్యూ ఇయర్ సంబరాలు ఎక్కడ?
- స్నేహితులతో కలసి సరదాగా గోవాకి వెళ్తున్నాను. పార్టీ అక్కడే.
* ఓకే.. ఎంజాయ్...
- థ్యాంక్యూ వెరీ మచ్.
-కాత్యాయని