చిత్రం: నేను లోకల్
తారాగణం: నాని, కీర్తి సురేష్, నవీన్ చంద్ర, పోసాని కృష్ణమురళి, ఈశ్వరరావు, సచిన్ ఖేడేఖర్, రావు రమేష్, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్ తదితరులు.
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
దర్శకత్వం: నక్కిన త్రినాధరావు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
విడుదల తేదీ: ఫిబ్రవరి 03, 2017
క్లుప్తంగా చెప్పాలంటే
ఇంజనీరింగ్ పూర్తి చేసేసి, సరదా సరదాగా టైమ్ పాస్ చేసేస్తున్న ఈ తరం కుర్రాడు బాబు (నాని). తొలి చూపులోనే కీర్తి (కీర్తి సురేష్)తో బాబు ప్రేమలో పడ్తాడు. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడితే, కాదంటుంది. ఎట్టకేలకు కీర్తి, తన ప్రేమలో పడ్డాక, తన జీవితంలోకి మరో ప్రాబ్లమ్ వచ్చిపడ్తుంది బాబుకి. అది కూడా కీర్తిని ప్రేమించే పెద్ద పోలీస్ ఆఫీసర్ సిద్దార్ధ వర్మ (నవీన్‌చంద్ర) రూపంలో. నానా తంటాలూ పడి, కీర్తిని తన ప్రేమలో పడేసిన బాబు, కీర్తిని ప్రేమిస్తోన్న పోలీస్ ఆఫీసర్ సిద్దార్ధ వర్మతో తలపడ్డాడా? తన ప్రేమని బాబు ఎలా గెలిపించుకున్నాడు? అసలు సిద్దార్ధ వర్మ ప్రేమ కథ సంగేతంటి? అన్నది తెరపైనే చూడాలి.
మొత్తంగా చెప్పాలంటే
నటుడిగా నాని సినిమా సినిమాకీ ఓ మెట్టు పైకెక్కుతూనే ఉంటాడు. నటించడం కాదు, జీవించేస్తాడనేంత గొప్ప పేరు తెచ్చుకున్నా, నటనలో ఈజ్‌ని మెరుగుపరుచుకుంటూ వెళ్ళడం నానికే చెల్లింది. ఈ సినిమాతోనూ అంతే. సరదాగా తిరిగే కుర్రాడిలా, ప్రేమికుడిలా, కొడుకులా సన్నివేశానికి తగ్గట్టుగా తనను తాను మలచుకున్నాడు. మన పక్కింటి కుర్రాడే అన్పించడం నాని ప్రత్యేకత. తన నటనా ప్రతిభతో సినిమాని ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళాడు నాని.
హీరోయిన్ కీర్తి సురేష్ నేచురల్ గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. తొలి సినిమా 'నేను శైలజ'తో పోల్చితే ఈ సినిమాలో ఇంకా అందంగా ఉంది. నటనతోనూ ఆకట్టుకుంది. పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు ఈమెలో సుస్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ దిశగా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి కూడా.
నాని తల్లిదండ్రుల పాత్రల్లో పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు నటించారు. నాని, పోసాని, ఈశ్వరిరావు మధ్య నడిచే సన్నివేశాలు మంచి వినోదాన్ని పండించాయి. నవీన్ చంద్ర పోలీస్ అధికారి పాత్రలో ఆకట్టుకుంటాడు. మిగతా పాత్రధారులంతా సినిమాకి అవసరమైన మేర ఉపయోగపడ్డారు.
ఇలాంటి కథలు తెలుగు తెరపై చాలానే చూశాం. సినిమాని ఎంటర్‌టైనింగ్ వేలో తీర్చిదిద్దడంలో దర్శకుడి ప్రతిభ కన్పిస్తుంది. మాటలు బాగున్నాయి. కథనం కూడా ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా స్లో నెరేషన్ అన్పిస్తుంటుంది. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ అక్కడక్కడా అవసరమన్పిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ తమ వర్క్‌ని బాగా చేశాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది.
ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. ప్రేమించిన అమ్మాయి కోసం నాని వేసే సరదా వేషాలు అలరిస్తాయి. కామెడీ, కాస్తంత రొమాన్స్ ఇలా సరదాగా సాగిపోయే సెకెండాఫ్, సెకెండాఫ్‌కి వచ్చేసరికి అక్కడక్కడా కొంచెం నమ్మదించినట్లనిపిస్తుంది. ఎక్కడా ఉత్కంఠ లేకపోవడంతో సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేయొచ్చు. ఓవరాల్‌గా ఇది నాని మార్క్ సినిమా. ఈ తరహా సినిమాలతో నాని సంచలనాలు సృష్టించేసిన దరిమిలా, మంచి ప్రమోషన్ తోడై మంచి విజయాన్ని అందుకునే అవకాశముంది.
ఒక్క మాటలో చెప్పాలంటే
'నేను లోకల్' పక్కా పైసా వసూల్
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5
|