నాగార్జున తాజా చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' ఆయన కెరీర్‌లోనే చాలా స్పెషల్ సినిమా అంటున్నారు. గతంలో 'అన్నమయ్య' సినిమా చేశారు ఆయన అదే జోనర్‌లో. అయినా కానీ ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అంటున్నారు. నాగార్జున అంటే రొమాంటిక్ హీరోనే. అమ్మాయిలకి పిచ్చ క్రేజ్ ఆయన సినిమాలంటే. అయినా కానీ భక్తిరస చిత్రాల్లో కూడా ఆయన ధిట్ట. ఈ తరహా చిత్రాలు చేయడం నాగ్‌కి కొత్తేమీ కాదు. ఒక్కటేమిటి నాగ్ 'అన్నమయ్య' తర్వాత 'శ్రీరామదాసు', షిరిడీ సాయి' వంటి చిత్రాలతో మెప్పించారు. తాజాగా 'నమో వేంకటేశాయ'లో హథీరామ్ బాబాగా అలరించనున్నారు. హథీరామ్ ఓ గిరిజన భక్తుడు. శ్రీనివాసుడంటే అమితమైన భక్తి. కానీ ఈయన చరిత్ర ఇంతవరకూ ఎవ్వరికీ తెలియదు. అన్నమయ్య చరిత్ర చాలా మందికి తెలుసు అప్పటికే. అయితే దానికి దృశ్య రూపం ఇచ్చి అద్భుతంగా మలిచారు. కానీ హథీరామ్ బాబా చరిత్ర అలా కాదు.
ఇది ఎవ్వరికీ తెలియని చరిత్ర. ఈ చరిత్రను తెలుసుకోవడానికి చిత్ర యూనిట్ చాలా కష్టపడింది. బోలెడంత రీసెర్చ్ చేసి వాటన్నింటినీ కొంచెం మోడిఫై చేసి, దానికి కొంత కల్పితం చేర్చి తెరకెక్కించారట ఈ సినిమాని. అందుకే ఈ సినిమా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అలాగే ఈ సినిమాలోని ప్రతీ పాత్ర కూడా చాలా అపురూపంగా తీర్చి దిద్దారు దర్శకేంద్రుడు. అందులో వేంకటేశ్వరస్వామిగా బాలీవుడ్ నటుడు సౌరభ్ బాగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే అనుష్క ఈశ్వరమ్మగా చాలా బాగా సెట్ అయ్యింది. ఇకపోతే ప్రగ్యా తన అందంతో తన పాత్రకి మరింత అందం తీసుకొచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
|