నాగార్జున ఓ ట్రెండ్ సెట్టర్. 'శివ' సినిమాతో ప్రూవ్ చేశారాయన. అలాంటి ఓ సబ్జెక్టు ను టేకప్ చేయడమే ఓ పెద్ద ఛాలెంజ్. ముందు దాన్ని బలంగా నమ్మాలి. చట్రం నుండి బయటికిరావాలి. అప్పుడే శివ లాంటి అద్భుతాలు వస్తాయి. ఈ విషయంలో ఆయన్ని ఎంత మెచ్చుకున్న తక్కువే. శివ తర్వాత కూడా ఆయన సినీ ప్రయాణం వైవిధ్యంగా సాగింది. ఇలాంటి సినిమాలే చేయాలి అనే రూల్స్ ను ఎప్పుడో బ్రేక్ చేశారాయన. ఇటీవల ఆయన నుండి వస్తున్న సినిమాలు మరింత వైవిధ్యంగా వుంటున్నాయి. మనం, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి.. ఇలా ఒకదానితో ఒకటి పోలికలేని చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు నాగార్జున. ఇప్పుడు భక్తిరస చిత్రం `ఓం నమో వేంకటేశాయ`. ఈనెల10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను ముచ్చటించారు నాగార్జున.
‘ఓం నమోవేంకటేశాయ’ ఎలా మొదలైయింది ?
ఇదివరకే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ‘అన్నమయ్య’గా కనిపించా. అద్భుతమైన చిత్రంగా నిలిచింపొయింది అన్నమయ్య. ఇప్పుడు మళ్ళీ స్వామీ భక్తుడి పాత్ర (హధీరామ్ బాబా)అన్నారు. మొదట్లో చిన్న సందేహం. అన్నమయ్య కంటే గొప్ప కధ ఉంటుందా అని. అయితే డైరెక్టర్ గారు ఒకసారి కథ విను అన్నారు. కథ విన్న వెంటనే మరో మాట లేకుండా ఓకే చెప్పేశా. అంతలా ఎక్సైట్ చేసింది హధీరామ్ జీవిత చరిత్ర.
హధీరామ్ బాబా పాత్ర గురించి ?
అద్భుతమైన పాత్రది. ఆ పాత్ర గురించి విన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా. చేస్తున్నప్పుడూ అంతే. హధీరామ్ బాబా ఎమోషనల్ క్యారెక్టర్. స్వామివారికీ, హధీరామ్ బాబాకి మధ్య జరిగేవి చాలా ఆసక్తికరంగా వుంటాయి. ముఖ్యంగా చిత్రం క్లైమాక్స్ విపరీతంగా ఆకట్టుకుటుంది. అన్ని వర్గాల వారికీ ఈ సినిమా నచ్చుతుంది.
కధ కోసం అన్వేషణ చేశారా ?
చేశాం. హధీరామ్ బాబా గురించి తక్కువ సమాచారం అందుబాటులో వుంది. హాథీరాం గురించి మరింత సమాచారం కోసం చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ఉన్న మఠాలన్నీ తిరిగింది. తెలిసినంత వరకు ఈ సినిమాలో చూపించబోతున్నాం.
ప్రగ్యా జైస్వాల్, అనుష్క ల గురించి ?
ప్రగ్యా జైస్వాల్, హధీరామ్ బాబా మరదలి పాత్రలో కనిపించనుంది. అనుష్క ది స్వామి వారి భక్తురాలి పాత్ర. తను చిన్నప్పటి నుంచి ఆ స్వామినే సర్వస్వంగా భావిస్తుంటుంది.
ప్రస్తుత ట్రెండ్ లో భక్తి సినిమాలు రిస్క్ ఏమో ?
రిస్క్ అన్నీ జోనర్స్ లోనూ వుటుంది. కమర్షియల్ సినిమా కూడా రిస్కే. వాటితో పోలిస్తేఇలాంటి భక్తిరస చిత్రాలకు రిస్క్ తక్కువే. అన్నమయ్య , శ్రీరామ దాసు అద్భుతమైన విజయాలు సాధించిన చిత్రాలు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే ప్రేక్షక బలం అందుతుందన్న కాన్ఫిడెన్స్ వుంది.
దర్శకులు రాఘవేంద్రరావు ఆఖరి సినిమా ఇదే అంటున్నారు ?
ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇదే నా ఆఖరి సినిమా అన్నారు. అయితే ఇది అబద్ధం కావాలి చెప్పాను( నవ్వుతూ)
ఈ సంక్రాంతి సినిమాలపై మీ కామెంట్ ?
ఎన్ని సినిమాలు వచ్చినా మంచి కంటెంట్ వుంటే ఆదరించే సీజన్ అది. రెండు పెద్ద సినిమాల మధ్య శతమానం భవతి మంచి విజయం సాధించింది కదా. దిల్ రాజు గారు పక్కగా ప్లాన్ చేశారు. మా 'సోగ్గాడే చిన్ని నాయనా' విషయంలో కూడా అదే జరిగింది.
సెంచరీకి దగ్గరౌతున్నారు కదా ?
అభిమానుల లెక్కల ప్రకారం అయితే 100వ సినిమాకి దగ్గరల్లో ఉన్నాను. అయితే గెస్ట్ రోల్ చేసిన సినిమాలను కూడా నా సినిమాగా లెక్కేయడం కరెక్ట్ కాదు. నాకంటూ ఓ లెక్క ఉంది. ఆ లెక్క సెంచరీకి దగ్గర్లో నేనే చెబుతా.
అఖిల్, చైతు సినిమాలు గురించి ?
చైతు, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నిన్నే పెళ్లాడతా తరహా ఉండే సినిమా ఇది. అఖిల్ కోసం విక్రమ్ కుమార్ ఓ కధ చెప్పాడు. కొంత వర్క్ జరిగింది. అయితే ముందుకు కదల్లేదు. ఈలోగా మరో లైన్ చెప్పాడు. ఇది అద్భుతంగా వుంది. ఓ ట్రెండ్ సెట్ మూవీ అవుతుంది. శివ సినిమా నన్ను ఎలాంటి మలపు తిప్పిందో అఖిల్ కూడా విక్రమ్ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిస్తుంది. ఏప్రిల్ లో సెట్ పైకి వెళ్ళే ఛాన్స్ వుంది.
మీ కొత్త సినిమాలు ?
రాజుగారి గది2 షూటింగ్ కి వెళ్ళాలి. తర్వాత ''బంగార్రాజు'' ప్రీక్వెల్ అనుకుంటున్నాం. చందు ఓ కధ చెప్పాడు. బావుంది. చర్చలు నడుస్తున్నాయి.
ఓకె అల్ ది బెస్ట్
థాంక్యూ
-కాత్యాయని