ఇటీవలే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతో మంచి విజయం అందుకున్న బాలయ్య తాజాగా ఓ సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అదే స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించబోతున్నానని ప్రకటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ పేర్లు ఇంకా తెలియదనీ, ఎన్టీఆర్ పాత్రలో మాత్రం నేనే నటిస్తానని మాత్రం ఆయన చెప్పారు. ఎన్టీఆర్ సినిమా రంగానికి చేసిన కృషి, అలాగే ఆయన రాజకీయ జీవితం.. తెలుగు దేశం పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే సీఎంగా ఎలా ఎదిగారు అనే అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారట. అందుకోసం బాలయ్య ఓ స్పెషల్ టీమ్‌ని నియమించారట. ప్రముఖ జర్నలిస్టులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ టీమ్‌లో ఉన్నారట. కథపై కూలంకషంగా చర్చలు జరుపుతున్నారనీ బాలయ్య తెలిపారు.
ఎన్టీఆర్ కోసం జనానికి తెలిసినవి, తెలియనివి అనేక ఆశక్తికరమైన అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీఆర్. పౌరణిక, సాంఘిక పాత్రల్లో ఆయన నటించి మెప్పించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు దేవుడంటే ఇలాగే ఉంటాడు అనేది ఆయన నటించిన కృష్ణుడు, రాముడు పాత్రల ద్వారానే తెలుగు ప్రజలు తెలుసుకున్నారంటే కూడా నమ్మి తీరాల్సిందే. అదీ ఆయన నటనలోని గాంభీర్యం, ఆహార్యం, హుందాతనం. అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ప్రజలకు అపారమైన సేవలు అందించారు. ఇంత గొప్ప వ్యక్తి చరిత్రని సినిమాగా మలచాలనే ఆలోచన వచ్చినందుకు బాలయ్యను అభినందించకుండా ఉండలేం.
|