Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with nagarjuna

ఈ సంచికలో >> సినిమా >>

ఓం నమో వెంకటేశాయ చిత్ర సమీక్ష

om namo venkatesaya movie review

చిత్రం: ఓం నమో వేంకటేశాయ 
తారాగణం: నాగార్జున, సౌరభ్‌జైన్‌, అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌, జగపతిబాబు, విమలారామన్‌, అస్మిత, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు 
నిర్మాణం: ఎ.ఎం.ఆర్‌.సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. 
నిర్మాత: మహేష్‌ రెడ్డి 
సినిమాటోగ్రఫీ: ఎస్‌. గోపాల్‌ రెడ్డి 
సంగీతం: ఎం.ఎం. కీరవాణి 
దర్శకత్వం: రాఘవేంద్రరావు 
విడుదల తేదీ: ఫిబ్రవరి 10, 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 
రాజస్తాన్‌ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ (నాగార్జున) చిన్నప్పటినుంచీ దేవుడ్ని చూడాలనే కోరికతో ఉంటాడు. దేవుడ్ని చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఇల్లు విడిచి వెళతాడు రామ. అలా ఇల్లు విడిచి వెళ్ళిన రామ అనుభవానంద స్వామి (సాయికుమార్‌) దగ్గర శిష్యరికం చేస్తాడు. ఓంకార జపం చేస్తూ కఠోర తపస్సు చేసే రామ భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు, వటపత్రసాయిగా బాలుడి రూపంలో వచ్చి రామ తపస్సుని భంగం చేస్తాడు. వచ్చింది తాను పూజించే దేవుడేనని తెలియక, ఆ బాలుడ్ని వెళ్ళిపోవాల్సిందిగా శాసిస్తాడు రామ. ఇంకో వైపున మరదలు భవాని (ప్రగ్యా జైస్వాల్‌)తో వివాహం కుదుర్చుతారు రామకి పెద్దలు. అయితే భగవంతుడి దర్శనమే తన జీవితాశయమని భవానికి చెప్పి, ఆ దేవదేవుడి కోసం వెళ్ళిపోతాడు. తాను వెళ్ళిపోమన్న ఆ బాలుడే దేవదేవుడన్న విషయం గురువు ద్వారా తెలుసుకుని, తిరుమల కొండపైకి పయనమవుతాడు. అదే సమయంలో కృష్ణమ్మ (అనుష్క) సాయంతో వెంకటేశ్వరుని సొమ్ముని దోచుకుంటున్న గోవిందరాజులు (రావు రమేష్‌)తో గొడవపడతాడు. ఈ క్రమంలో రామ హథీరామ్‌బాబాగా మారతాడు. ఇంతకీ స్వామిని స్వయంగా చూడాలనుకున్న రామ కోరిక నెరవేరిందా? లేదా? అనేది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
నాగార్జున నట విశ్వరూపం ఈ సినిమాలో చూడొచ్చు. ఆధ్మాత్మిక చిత్రాల్లో నాగార్జున చెయ్యడమేంటి? అని అనుమానపడ్డవారికి 'అన్నమయ్య' గట్టి సమాధానమే చెప్పింది. ఆ తర్వాత 'భక్తరామదాసు' సినిమాలోనూ తనదైన నటనతో మెప్పించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు నాగార్జున. ఈ సినిమాతో అయితే నాగార్జున నటనా ప్రతిభకు ఎవరైనాసరే హేట్సాఫ్‌ చెప్పవలసిందే. హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ అద్భుతం. ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేకుండాపోయింది. హథీరామ్‌ బాబా పాత్రలో నాగార్జున ఒదిగిపోయారు. 
అనుష్క చాలా అందంగా కనిపించింది. ఆమె నటన ఇంకా బాగుంది. సినిమాలో ఆమె ప్రెజెన్స్‌కి విజిల్స్‌ పడతాయి. ప్రగ్యా జైస్వాల్‌ గ్లామరస్‌గా ఉంది. దేవుడి పాత్రలో సౌరభ్‌ జైన్‌ అందంగా ఉన్నాడు. వెంకటేశ్వరస్వామి పాత్రకు నిండుదనం తెచ్చాడు. మిగతా పాత్రధారుల్లో రావు రమేష్‌ బాగా చేశాడు. సంపత్‌ రాజ్‌, రఘుబాబు, సాయికుమార్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 

'అన్నమయ్య', 'భక్తరామదాసు' అందరికీ తెలిసిన కథలే. 'హథీరామ్‌బాబా' కథ చాలామందికి తెలియనిది. దాంతో, సినిమాలో ఏముందోననే ఆసక్తి అయితే అందరిలోనూ కలుగుతుంది. సినిమా కోసం చేసిన రీసెర్చ్‌కి ప్రశంసలు దక్కుతాయి. కథనం బాగుంది. మాటలు ఆకట్టుకుంటాయి. సినిమాకి సంగీతమే ప్రాణం. నేపథ్య సంగీతం అద్భుతం. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. అక్కడక్కడా ఎడిగింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. ఓవరాల్‌గా ఓకే. సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. ఈ తరహా సినిమాలకి కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ పనితీరు చాలా కీలకం. ఆ రెండూ బాగా కుదిరాయి. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాని రిచ్‌గా తెరకెక్కించారు. 

దేవుడి సినిమాలంటే ఎక్కువగా అందరికీ తెలిసిన కథలే ఉంటాయి. పెద్దగా ఎవరికీ తెలియని కథతో దర్శకేంద్రుడు పెద్ద సాహసమే చేశారు. దేవుడే ఈ సినిమా టీమ్‌ని నడిపించాడేమో అన్పిస్తుంది. ఎక్కడా రాజీపడని నిర్మాతలు, ఆధ్మాత్మిక అద్భుతాన్ని చూపించాలనే దర్శకుడి ఆలోచన. సినిమాలో లీనమైపోవాలన్న నటీనటుల తాపత్రయం ఇవన్నీ సినిమాకి బాగా కుదిరాయి. ఫస్టాఫ్‌, సెండాఫ్‌ అలా అలా సాగిపోతూ, ప్రేక్షకుల్ని ఆధ్మాత్మికత వైపుకు మళ్ళిస్తాయి. ఆలయ స్థలపురాణం, వరాహమూర్తి దర్శనం, స్వామివారికి చేసే సేవల విశిష్టత ఇవన్నీ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సంపూర్ణమైన ఆధ్మాత్మిక చిత్రం. ప్రతి ఒక్కరూ చూసి తరించాల్సిన చిత్రమిది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
'ఓం నమో వేంకటేశాయ' అద్భుతః 
అంకెల్లో చెప్పాలంటే: 3.5/5

మరిన్ని సినిమా కబుర్లు
winner is comming