పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' విడుదలకు సిద్ధమైంది. మార్చి 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మార్చి 18న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు. ఆడియో ఫంక్షన్ల స్థానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు సరికొత్తగా అభిమానుల్ని అలరిస్తుండడం ట్రెండ్‌గా మారిందిప్పుడు. ఇప్పటికే యూ ట్యూబ్ ద్వారా 'కాటమరాయుడు' సినిమాకి సంబంధించిన ఆడియో సింగిల్స్‌ని విడుదల చేస్తూ వస్తున్నారు. ఒక్కో పాటా యూ ట్యూబ్‌లో హిట్స్, లైక్స్ పరంగా దూసుకెళుతున్నాయి. 'మిరా మిరా' సాంగ్ ఇప్పటిదాకా విడుదలైనవాటిల్లో హైలైట్‌గా చెప్పవచ్చు. దేనికదే అన్నట్లుగా ఆడియో సింగిల్స్ రూపొందాయి.
ఇంకో వైపున ఇది తమిళ సినిమా 'వీరం'కి రీమేక్. 'వీరం' సినిమా తెలుగులోకి 'వీరుడొక్కడే' పేరుతో డబ్ అయినప్పటికీ అది టెలివిజన్లలో పదే పదే ప్రసారమవుతున్నప్పటికీ కూడా పవన్‌కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమాపై ఏమాత్రం అంచనాలు తగ్గలేదు. పవన్‌కళ్యాణ్ స్టామినాకి, అతని స్టార్‌డమ్‌కి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 'నార్త్‌స్టార్' పతాకంపై పవన్‌కళ్యాణ్ స్నేహితుడు శరద్‌మరార్ ఈ 'కాటమరాయుడు' చిత్రాన్ని నిర్మిస్తుండగా, పవన్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, 'గోపాల గోపాల' ఫేం డాలీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చేయనున్నాడు 'కాటమరాయుడు'. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేయడం విశేషంగా పరిగణించాలి.
|