నటన కావొచ్చు, సేవా కార్యక్రమాలు కావొచ్చు. సమంత ఆలోచనలు ఎందులో అయినా చాలా భిన్నంగా ఉంటాయి. మంచి సినిమాల్ని ఎంచుకోవడంలో సమంత టాలెంట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుంది. అందుకే ఆమె నుంచి విలక్షణమైన చిత్రాలు రావడం చూస్తున్నాం. గ్లామరస్ తారగానే కాదు, మంచి నటిగా కూడా సమంత పేరు తెచ్చుకుంది. సినిమాల్లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాల కోసం తగిన సమయం కేటాయించడం సమంత ప్రత్యేకత. సేవా కార్యక్రమాల్లో హాజరయ్యేటప్పుడు సమంత మన పక్కింటమ్మాయిలా అనిపిస్తుంటుంది. సమాజానికి ఎంతో కొంత చేద్దామనే తపనని ఆమెలో చూడొచ్చు.
అదే ఆమెను మిగతా హీరోయిన్లకన్నా భిన్నంగా మార్చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయిన సమంత, ఆ రంగంలోనూ కసరత్తులు ముమ్మరం చేసింది. చేనేత కార్మికులతో సమావేశమవుతూ, వారి సమస్యల్ని తెలుసుకుంటూ, వాటిని విశ్లేషించి ఆ రంగంలో రాణించడమెలాగో వారికి సలహాలు ఇస్తూ సమంత తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చేనేత అనేది ఓ కళ. కొంచెం సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు చేయగలరు చేనేత కార్మికులు. అందుకే సినీ రంగంలో ఫ్యాషన్ పట్ల తనకున్న అవగాహనతో చేనేత కార్మికులకు సలహాలు ఇస్తోంది. సమంత ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉన్నాయంటూ ఆమెతో మాట్లాడిన చేనేత కార్మికులు చెప్పడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో సమంతని ప్రతి ఒక్కరూ అభినందించితీరాలి. ఆమె డెడికేషన్‌కి హ్యాట్సాఫ్.
|