చిత్రం: నేనోరకం
తారాగణం: రామ్ శంకర్, రేష్మి మీనన్, శరత్‌కుమార్, కాశీ విశ్వనాథ్, ఎమ్మెస్ నారాయణ, గిరి
నిర్మాణం: భవ్య ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: మహిత్ నారాయణ్
దర్శకత్వం: సుదర్శన్ సలేంద్ర
నిర్మాత: శ్రీకాంత్ రెడ్డి
విడుదల తేదీ: 17 మార్చి 2017
క్లుప్తంగా చెప్పాలంటే
ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ గౌతమ్ (రాం శంకర్) తొలి చూపులోనే, స్వేచ్ఛ (రేష్మి మీనన)ని ప్రేమిస్తాడు. ఆమెను తన ప్రేమలో పడేస్తాడు. అంతలోనే స్వేచ్ఛని ఎవరో కిడ్నాప్ చేస్తారు. స్వేచ్ఛను కిడ్నాప్ చేసిన వ్యక్తి నుంచి గౌతమ్‌కి ఫోన్ వస్తుంది. 'నేను చెప్పినట్లు చేయకపోతే నీ స్వేచ్ఛ నీకు దక్కదు' అని కిడ్నాపర్, గౌతమ్‌కి చెప్తాడు. ఆ కిడ్నాపర్ ఎవరు? కిడ్నాపర్ ఏ ఉద్దేశ్యంతో స్వేచ్ఛని కిడ్నాప్ చేశాడు? కిడ్నాపర్ చెప్పినట్టు గౌతమ్ చేశాడా? స్వేచ్ఛని కిడ్నాపర్ నుంచి ఎలా గౌతమ్ రక్షించాడు? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.
మొత్తంగా చెప్పాలంటే
రాం శంకర్ బాగానే చేశాడు. పూరి జగన్నాథ్ తమ్ముడైన సాయిరాం శంకర్ పేరు మార్చుకుని రాం శంకర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. డాన్సుల్లో బాగా చేశాడు. ఫైట్స్‌లో ఆకట్టుకుంటాడు. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోవడానికి బాగా కష్టపడ్డాడు. నటన విషయంలో సినిమా సినిమాకీ మెచ్యూరిటీ సంపాదిస్తున్నా, ఇంకా చాలా మెచ్యూరిటీ అతనికి కావాల్సి ఉంది. రేష్మి నేచురల్ బ్యూటీ. నటనతోనూ ఆకట్టుకుంది.
సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర శరత్‌కుమార్‌ది. సీనియర్ నటుడు శరత్‌కుమార్, తన పాత్రకు ప్రాణం పోసేశాడు. ఎమ్మెస్ నారాయణ నటించిన సినిమాల్లో ఇదొకటి. అయితే, ఆయన జీవించి లేకపోవడంతో ఆయన పాత్రకు ఇంకొకరితో డబ్బింగ్ చెప్పారు. ఎమ్మెస్ నారాయణకి ఆయన వాయిస్సే పెద్ద ప్లస్. దాంతో ఆయన పాత్ర కామెడీ పండించినా, దాన్ని అంతగా ఆస్వాదించలేం. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
దర్శకుడు కొత్త కథతో ముందుకొచ్చాడు. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, వీరి ప్రేమకు అడ్డంకిగా ఓ కిడ్నాపర్. సింపుల్‌గా చెప్పాలంటే ప్రేమ కథకి థ్రిల్లర్‌ని జోడించాడు దర్శకుడు. కాసిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమాని ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దుదామనే ప్రయత్నమైతే చేశాడు. కథ ఓకే, కథనం కూడా ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా సినిమా స్లో అయినట్లు, ఒక్కోసారి ఓవర్ ది బోర్డ్ వెళ్ళినట్లూ అనిపిస్తుంది. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్‌నెస్ తెచ్చింది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఆర్ట్, కాస్ట్యూమ్స్ జస్ట్ ఓకే.
ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. లవ్ ట్రాక్, కాస్తంత ఎంటర్టైన్మెంట్తో సినిమా అలా అలా జరిగిపోతుంటుంది. ఎప్పుడైతే హీరోయిన్ కిడ్నాప్ అవుతుందో, అప్పుడు సినిమా రసవత్తరంగా మారుతుంది. అయితే సస్పెన్స్ క్రియేట్ చేయాల్సిన చోట, ఇంకొంచెం థ్రిల్లింగ్ సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతే, సినిమాకి అంత వేగంగా కనెక్ట్ కాలేరు ప్రేక్షకులు. ఈ ఒక్కటీ చిన్న మైనస్‌గా అన్పిస్తుంది. శరత్‌కుమార్ పాత్ర ఎంట్రీతో సినిమాలో వేగం పెరుగుతుంది. దర్శకుడి ప్రయత్నానికి, నటీనటులు చూపించిన ఎఫర్ట్స్కీ ప్రశంసలు దక్కుతాయి. ఓవరాల్‌గా ఓ మంచి ప్రయత్నం చేశారనుకోవచ్చు. చివర్లో సినిమా ఉత్కంఠ భరితంగా సాగడం పెద్ద ప్లస్ పాయింట్.
ఒక్క మాటలో చెప్పాలంటే
నేనోరకం - ఓ మోస్తరు రకం
అంకెల్లో చెప్పాలంటే: 3/5
|