రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'మగధీర' సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని వసూళ్లని సాధించి, రికార్డులకెక్కింది. తాజాగా బాలీవుడ్‌లో 'రాబ్తా' టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకీ, మగధీరకీ సంబంధం ఏంటనుకుంటున్నారా? ఈ సినిమాని మక్కీకి మక్కీ 'మగధీర' నుంచి కాపీ కొట్టేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'మగధీర' సినిమాని అచ్చంగా కాపీ కొట్టేశారని ఆరోపిస్తూ నిర్మాతలైన అల్లు అరవింద్, బి.వి.ఎస్.ఎస్.ప్రసాద్ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతిసనన్ జంటగా నటించిన ఈ సినిమాను దినేష్ విజన్ తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమైపోతోంది. అది అచ్చంగా రాజమౌళి సినిమా 'మగధీర'ని పోలి ఉందని..సినిమా కథ, కథనం విషయంలోనూ 'మగధీర' సినిమాతో పోలికలు ఉన్నాయని తెలియవస్తోంది. కాపీ రైట్స్ నిబంధనల ప్రకారం ఇది విరుధ్దమని భావిస్తూ మగధీర నిర్మాతలు హైద్రాబాద్ సిటీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు. ఈ సినిమా విడుదలని నిలిపివేయాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో 'రాబ్తా' విడుదలపై నిర్ణయాన్ని న్యాయస్థానం జూన్ 1న వెలువరించనుందని మగధీర నిర్మాతలు తెలిపారు.
|