Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
magadeera fighting

ఈ సంచికలో >> సినిమా >>

మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ‌ తో ఇంటర్వ్యూ

interview with  manisarma

వంశీ గారితో సినిమా చేసే అదృష్టం ఇన్ని రోజులు రాలేదు  -మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ‌

మ‌ధుర ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై వంశీ డైర‌క్ష‌న్ లో, మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ఫ్యాష‌న్ డిజైన‌ర్ s/o లేడీస్ టైల‌ర్ చిత్రం జూన 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బాణీలు స‌మ‌కూర్చారు.30 ఏళ్ల క్రితం విడుద‌లై సంచ‌ల‌న విజయం సాధించిన లేడీస్ టైల‌ర్ సినిమాకు సీక్వెల్ గా దీన్ని తెర‌కెక్కి్౦చారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర పాట‌లకు ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్బంగా మ‌ణిశ‌ర్మ చెప్పిన సంగ‌తులు..

ప్ర‌శ్నః మీ సంగీతంలో ఫ్యాష‌న్ ఎలా చూపించ‌బోతున్నారు?
మ‌ణిశ‌ర్మః ఏ పీరియ‌డ్ కి ఆ ఫ్యాష‌న్. నేను ఇప్ప‌టివ‌ర‌కు 80-90 మంది డైర‌క్ట‌ర్ల‌తో క‌లిసి పనిచేశాను. కానీ ఇప్ప‌టివ‌ర‌కు వంశీ గారితో క‌లిసి ప‌నిచేసింది లేదు. ఈ ప్రాజెక్ట్ నాకు ఎప్ప‌టినుంచో డ్రీమ్. అది ఈ సినిమా ద్వారా నెర‌వేరింది.

ప్ర‌శ్నః మీ గురువు గారు ఇళ‌య‌రాజా గారు లేడీస్ టైల‌ర్ కు మ్యూజిక్ అందించారు. ఇప్పుడు మీరు ఆ సీక్వెల్ అయిన ఫ్యాష‌న్ డిజైన‌ర్ కు సంగీతం అందిస్తున్నారు, మీకు ఎలా ఉంది?
మ‌ణిశర్మః మీలా నేను మాట‌కారిని కాదు(న‌వ్వుతూ).. ఇళ‌య‌రాజా గారు అందించిన లేడీస్ టైల‌ర్ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తున్న ఈ సినిమాకు నేను సంగీతం అందించడం నా అదృష్టం. ఖ‌చ్చితంగా మా గురువు గారి పేరు నిల‌బెట్టేలాంటి సంగీతమే సినిమాకు అందించాను.

ప్ర‌శ్నః వంశీ గారితో ప‌నిచేయాల‌ని ఎప్ప‌టినుంచో అనుకుంటున్న‌ప్పుడు, ఇప్ప‌టివ‌ర‌కు మీరు ఎందుకు ఆయ‌న‌తో క‌లిసి సినిమా చేయ‌లేదు?
మ‌ణిశ‌ర్మః సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏదైనా ఒక అద్భుత‌మే. దాని కోసం మ‌నం ఎదురు చూడాలే త‌ప్ప‌, ఎందుకు అని అనుకోకూడదు. ఇన్నిరోజులు ఆ అద్భుతం జ‌ర‌గ‌లేదు, ఇప్పుడు జ‌రిగింది అంతే.

ప్ర‌శ్నః  చిరంజీవి గారితో క‌లిసి చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశారు. ఒకానొక సంద‌ర్భంలో మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ లేక‌పోతే, చిరంజీవి సినిమాలు చేయ‌డేమో అనేట్లుగా చేశారు. మ‌రి ఆయ‌న కంబ్యాక్ మూవీ ఖైదీ నెం.150 ని ఎందుకు మిస్ అయిన‌ట్లు!
మ‌ణిశ‌ర్మః ఇందాక చెప్పిన‌ట్లు, ఏది చేయాలన్నా ఓ అద్భుతం జ‌ర‌గాలి. ఈ విష‌యంలో అది జ‌ర‌గ‌లేదు.

ప్ర‌శ్నః ఈ సినిమా నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ గారి గురించి..!
మ‌ణిశర్మః ఆయ‌న‌ ఓ జెంటిల్‌మ‌న్.చాలా ఫ్రీడ‌మ్ ఇస్తారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ  విష‌యంలో కాంప్ర‌మైజ్ అవ్వ‌మ‌ని కానీ,
తొంద‌రపెట్టింది కానీ లేదు. న‌న్ను తామ‌ర‌పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటే ఎలా ఉంటానో అలా చూసుకున్నారు. మధుర
ఆడియో సంస్థ ఓనర్ గా తను మంచి సంగీతాన్ని ఎప్పుడూ ఆదరిస్తూనేవుంటారు.

ప్ర‌శ్నః  ఇన్నేళ్ల త‌ర్వాత మ‌రి వంశీ గారితో సినిమా చేస్తున్నారు, ఎలా ఉంది?
మ‌ణిశ‌ర్మః మా మీటింగే చాలా గొప్ప‌గా జ‌రిగింది. వంశీ గారి సినిమాల్లో పాట‌లు ఎలా ఉంటాయో, ఆయ‌న టేస్ట్ ఏంటో నాకు తెలుసు కాబ‌ట్టి, త్వ‌ర‌గానే ప‌ని కూడా పూర్తి చేయ‌గ‌లిగా. ఎవ‌రికి త‌గ్గ‌ట్టు వారికి పాట‌లు ఇవ్వ‌డంలో నేను బెస్ట్ అని నా ఫీలింగ్

ప్ర‌శ్నః లేడీస్ టైల‌ర్ సినిమాకు ఇళ‌య‌రాజా గారు మ్యూజిక్ డైర‌క్ట‌ర్. మ‌రి మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు వాళ్ల‌ని దృష్టిలో ఉంచుకుని ట్యూన్స్ చేశారా!
మ‌ణిశ‌ర్మః లేదు, చాలా ఫ్రీ మైండ్ తో ట్యూన్స్ చేశా. ఎప్పుడైనా ఒక ట్యూన్ చేసేటప్పుడు మ‌న‌సంతా దానిమీద పెడితేనే, ది బెస్ట్ అవుట్ పుట్ మ‌న‌కు వ‌స్తుంది, అందుకే, నా పాట‌లు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటాయి.

ప్ర‌శ్నః ఈ సినిమాలో మొత్తం మెలోడీ పాట‌లేనా..!
మ‌ణిశ‌ర్మః అవును, మొత్తం మెలోడీ సాంగ్సే. ఈ ఆల్బ‌మ్ ను ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని చేశా. ఒక్కో సాంగ్ కు ఒక్కో ప్ర‌త్యేకత ఉండేలా ఈ ఆల్బ‌మ్ చేశా.

ప్ర‌శ్నః వంశీ గారితో క‌లిసి ప‌నిచేయ‌డం ఎలా ఉంది!
మ‌ణిశ‌ర్మః నిజంగా ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా మంచి అనుభూతి. ఏ క్రియేట‌ర్ ఈజ్ ఆల్వేస్ ఏ క్రియేటర్. ఆయ‌న అన్నా ఆయ‌న సినిమాలు అన్నా బాగా ఇష్టం. ఎప్ప‌టినుంచో వెయిట్ చేసిన ప్రాజెక్ట్ ఇది..

ప్ర‌శ్నః  లేడీస్ టైల‌ర్ లో ఉన్న ఫ‌న్, స్టోరీ, ఎలిమెంట్స్ ఇందులో కూడా ఉన్నాయంటారా!
మ‌ణిశ‌ర్మః  ఆ సినిమా కంటే ఈ సినిమాలోనే ఎక్కువ ఫ‌న్ , ఎంట‌ర్ టైన్ మెంట్ ఉంటుంది. సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అనుకుంటున్నాం. రేపు సినిమా చూశాక ప్రేక్ష‌కులే ఆ విష‌యం చెప్తారు. అయినా ఆ సినిమాకు, ఈ సినిమాకు అస‌లు సంబంధం ఉండ‌దు. కేవ‌లం ఆ లేడీస్ టైల‌ర్ కొడుకు ఈ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అంతే.

ప్ర‌శ్నః  ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాటేంటి!
మ‌ణిశ‌ర్మః కనులేమిటో అనే పాట చాలా బాగా ఇష్టం. ఈ పాట‌ను ఎంతో కుస్తీలు ప‌డి మ‌రీ చేశా. చివ‌ర్లో ఈ సాంగ్ ఫైన‌ల్ వెర్ష‌న్ విన్నాక‌, పాట కోసం ప‌డిన శ్ర‌మంతా మ‌ర్చిపోయా. ఈ పాట‌లో ఇప్ప‌టి ట్రెండ్ కు స‌రిపోయే రిథ‌మ్ ఉంటుంది.

ప్ర‌శ్నః వంశీ గారు సైలెంట్, మీరూ సైలెంట్, మ‌రి మీ ఇద్ద‌రి మ‌ధ్య అస‌లు సంభాష‌ణ ఎలా ఉండేది.!
మ‌ణిశ‌ర్మః సినిమా అంటేనే ఒక ప్రొడ‌క్ట్. మ‌నం చేసే ప్రొడ‌క్ట్ బాగా రావాలి అన్న‌దే ఎవ‌రి ఆలోచ‌న అయినా.. ఎవ‌రు ఏం చెప్పినా వినాలి. అలాంటప్పుడు డైర‌క్ట‌ర్ అయిన ఆయ‌నే మాట్లాడితే మాత్రం ఇక అంతే,  అదే ఫైన‌ల్. ఆయ‌న మాట్లాడుతుంటే వినాలి,

ప్ర‌శ్నః వంశీ గారిని అస‌లు ఎప్పుడు క‌లిశారు.
మ‌ణిశ‌ర్మః ఈ సినిమా కోస‌మే కలిశాం. ఇప్ప‌టివ‌ర‌కు నేనూ, ఆయ‌న క‌లిసింది లేదు.

ప్ర‌శ్నః ఇప్ప‌టికి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి..
మ‌ణిశ‌ర్మః నేను ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి, 20 ఏళ్లు అవుతుంది. ఈ 20 యేళ్ల జీవితం వండ‌ర్‌ఫుల్ అస‌లు.

ప్ర‌శ్నః సినిమాలో హీరో కు త‌గ్గ‌ట్టు, మ్యూజిక్ ఇవ్వ‌డం మీ బ‌ల‌మ‌న్నారు, ఈ సినిమాలో సుమంత్ అశ్విన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండ‌బోతుంది!
మ‌ణిశ‌ర్మః ఈ సినిమా విష‌యంలో వంశీ గారి అభిరుచినే ఫాలో అయ్యాను. పెద్ద పెద్ద హీరోల విష‌యంలోనే హీరోల‌కు సంబంధించిన‌ట్లు వారికి స‌రిపోయే సంగీతం ఇస్తాను.

ప్ర‌శ్నః  ఇప్పుడున్న మ్యూజిక్ డైర‌క్ట‌ర్స్ లేటెస్ట్ ట్రెండ్ కు స‌రిపోయే మ్యూజిక్ ఇస్తున్నారు. మ‌రి ఆల్రెడీ ఉన్న సంగీత ద‌ర్శ‌కులు ఎలా అప్‌డేట్అవ్వాలి.
మ‌ణిశ‌ర్మః అప్ డేట్ చేసుకోవాలి. అయినా మ్యూజిక్ కు వ‌య‌సు తో ఏం ప‌న్లేదు. ఆ విష‌యానికొస్తే, నేను ఏ పాట‌నైనా మెలోడీ చేయ‌గ‌ల‌ను.

ప్ర‌శ్నః సంగీతంలో అప్ప‌టికి, ఇప్ప‌టికీ ఏం తేడా వ‌చ్చింది!
మ‌ణిశ‌ర్మః అప్పుడు సినిమాలో పాట‌లు, నేప‌థ్య సంగీతం బాగుంటేనే  అది మ్యూజిక‌ల్ హిట్.ఇప్పుడు మాత్రం సినిమా హిట్ అయి, పాట‌లు బాలేక‌పోయినా మ్యూజిక‌ల్ హిట్టే.

ప్ర‌శ్నః మీ త‌ర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటి!
మ‌ణిశ‌ర్మః మోహ‌న్ కృష్ణ‌ ఇంద్ర‌గంటి దర్శ‌క‌త్వంలో వ‌స్తున్న అమీ తుమీ. నితిన్-హ‌ను రాఘ‌వపూడి కాంబినేష‌న్ లో వ‌స్తున్న లై అనే సినిమా, శమంత‌క‌మ‌ణి అనే మ‌రో సినిమా.

-జి.ఎస్.మీడియా

మరిన్ని సినిమా కబుర్లు
mega game show