ఒక చిన్న పొరపాటు, నోరు జారారంతే. అంత పెద్ద రాధ్దాంతం అయిపోయింది. క్షమాపణ చెప్పినా కానీ వివాదం ఆగలేదు. ఇదంతా ఏమిటంటారా? ఇటీవల 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నటుడు చలపతి రావు మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై మండి పడిన మహిళా సంఘాలు ఆయనపై కేసు నమోదు చేశారు. వెంటనే ఆయన స్పందించి, యావత్ మహిళా లోకానికి ఆయన క్షమాపణలు చెప్పారు. కానీ ఈ దుమారం ఆగలేదు. సోషల్ మీడియా వేదికగా ఆయనను ప్రతీ ఒక్కరూ విమర్శించేశారు. వయసుతో సంబంధం లేకుండా, సినీ పరిశ్రమకి సంబంధించిన యంగ్ జనరేషన్ నటీ నటులు కూడా ఆయనపై విమర్శలు గుప్పించేశారు. తప్పదు..
వివాదం ఇంతవరకూ వచ్చింది కాబట్టి. కానీ గతంలో బాలకృష్ణ, ఆలీ తదితర నటులు కూడా ఇంత కంటే ఎక్కువగానే మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఈ స్థాయిలో వివాదాలు తలెత్తలేదు. సరి కదా. ఈ రోజు ఈయన్ని విమర్శించిన ఈ సెలబ్రిటీసే అప్పుడు కూడా ఇదే రకంగా వారినీ విమర్శించి ఉంటే బాగుండేది. అవును నిజమే చలపతిరావు చేసిన వ్యాఖ్యలు తప్పే. అందుకు ఆయన మీడియా ముఖంగా పలు సార్లు క్షమాపణలు చెప్పారు. కానీ వయసుకు తగ్గట్లుగా, ఆయన అనుభవానికి సరిపడా మాటలు మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా. బహిరంగ వేడుకల్లో ఎంతటి వారైనా నోరు అదుపులో ఉంచుకుంటేనే మంచిది. చూశారా! ఇన్నేళ్లుగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ ఒక్క మాటతో ఎలా తుడిచి పెట్టుకుపోయాయో చలపతిరావుకి.
|