కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్‌బాబు కాంబినేషన్ అంటే భారీగా అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' సెన్సేషనల్ హిట్ అందుకుంది. అందుకే రాబోయే సినిమాపై కూడా అంతకు మించిన అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి 'భరత్ అను నేను' అనే టైటిల్‌ని అనుకుంటున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. సూపర్‌స్టార్‌ని ముఖ్యమంత్రిగా చూపించనున్నాడు కొరటాల శివ ఈ సినిమాలో అని ప్రచారం జరుగుతోంది. మరో పక్క సూపర్ స్టార్ - మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'స్పైడర్'ని విజయ దశమి సందర్భంగా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.
కాగా 2018 సంక్రాంతికి మహేష్ - కొరటాల శివ సినిమాని విడుదల చేసే యోచనలో ఉన్నాడట మహేష్. ఈ సినిమాకి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. జనవరి 11, 2018న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర యూనిట్. ప్రస్తుతం 'స్పైడర్' మేనియా నడుస్తోంది. క్లాస్‌గా కనిపించే పోస్టర్స్‌తో ఉర్రూతలూగించేసిన సూపర్ స్టార్, 'స్పైడర్' టీజర్‌తో మరింత ఉత్సాహం రేకెత్తించాడు ఫ్యాన్స్‌లో. 'భయపెట్టడం మాకూ తెలుసు' అంటూ సాఫ్ట్‌గానే అయినా 'స్పైడర్' సినిమాలో మహేష్ చెబుతున్న డైలాగ్‌కి ఫ్యాన్స్ పండగ చేసేసుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. ఎస్. జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు.
|