Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
lie movie review

ఈ సంచికలో >> సినిమా >>

నేనే రాజు నేనే మంత్రి చిత్రసమీక్ష

nene raju nene mantri movie review

చిత్రం: నేనే రాజు నేనే మంత్రి 
తారాగణం: రానా, కాజల్‌ అగర్వాల్‌, కేథరీన్‌, నవదీప్‌, అశుతోష్‌ రాణా, ప్రదీప్‌ రావత్‌, తనికెళ్ళ భరణి తదితరులు. 
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌ 
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి దిలీప్‌ 
దర్శకత్వం: తేజ 
నిర్మాత: సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి 
నిర్మాణం: సురేష్‌ ప్రొడక్షన్స్‌, బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 11 జులై 2017

క్లుప్తంగా చెప్పాలంటే

ఓ సాధారణ యువకుడు (జోగేంద్ర) రాజకీయాలపై ఆసక్తితో, అంచలంచెలుగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఒక్కో మెట్టూ పైకెక్కుతుంటాడు. ప్రత్యర్థులు అడుగడుగునా అతన్ని కిందికి తొక్కేందుకు ప్రయత్నిస్తోంటే, ఆ ప్రయత్నాల్నే అవకాశాలుగా వాడుకుంటుంటాడు. ముఖ్యమంత్రి (తనికెళ్ళ భరణి) మెప్పి పొంది, మంత్రి వర్గంలో ఛాన్స్‌ దక్కించుకుంటాడు. ఇంతలోనే అనుకోని సంఘటనలు. భార్య రాధ (కాజల్‌ అగర్వాల్‌) మరణం, ఆ తర్వాత రాజకీయ ప్రస్థానంలో దేవికా రాణి (కేథరీన్‌) సహకారం, వెరసి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఆస్కారమేర్పడుతుంది. మళ్ళీ సమస్యలు మామూలే. రాజకీయంగా అత్యున్నత స్థానం అయిన ముఖ్యమంత్రి పదవి కోసం జోగేంద్ర చేసే ప్రయత్నాలు సఫలమయ్యాయా.? అన్నది తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

తొలి సినిమా 'లీడర్‌'లోనే తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు రానా ప్రయత్నించాడు. ఈ తరహా పాత్రలు రానాకి కొట్టిన పిండి. అందుకే జోగేంద్ర పాత్రలో రానా ఒదిగిపోయాడు. హైటూ, వెయిటూ, పర్సనాలిటీ అన్నీ కలిసొచ్చాయి. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన హుందాతనం గెటప్‌ పరంగా లభించేసింది. దాన్ని సినిమాలో బాగా మెయిన్‌టెయిన్‌ చేశాడు రానా. సీరియస్‌ సన్నివేశాల్లోనూ, రొమాంటిక్‌ సన్నివేశాల్లోనూ, రాజకీయం ప్రదర్శించే సన్నివేశాల్లోనూ రానా 'భళా' అనిపిస్తాడు. డైలాగ్స్‌ పరంగా రానాకి వాయిస్‌ ప్రధాన బలం. 
కాజల్‌ అగర్వాల్‌ అందంగా కన్పించింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. కేథరీన్‌ ట్రెసా సినిమాకి అదనపు గ్లామర్‌ ఎట్రాక్షన్‌. నటన పరంగానూ ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రల్లో తనికెళ్ళ భరణి, ప్రదీప్‌ రావత్‌, జయప్రకాష్‌రెడ్డి తదితరులంతా సినిమాకి అవసరమైనంతమేర ఉపయోగపడ్డారు.

కథ పరంగా చూస్తే, ఇది మోహన్‌బాబు నటించిన 'ఎం.ధర్మరాజు ఎంఎ' సినిమా గుర్తుకొస్తుంది. అందులో మోహన్‌బాబుని పూర్తిగా నెగెటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో చూపించగా, ఈ సినిమాలో హీరోకి కొంచెం నెగెటివ్‌ టచ్‌ ఇచ్చినట్లు కన్పించినా, హీరోయిజం ఎలివేట్‌ అయ్యేలా చేయగలిగారు. డైలాగ్స్‌ సినిమాకి మెయిన్‌ ఎస్సెట్‌. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. కథనం ఆకట్టుకుంటుంది. సంగీతం సినిమా మూడ్‌కి తగ్గట్టుగా ఉంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి హెల్ప్‌ అయ్యాయి.

తెలుగు తెరపై ఈ తరహా కథలు కొత్తేమీ కాదు. అయితే మారుతున్న రాజకీయాలకు తగ్గట్టుగా అన్నట్లు కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో వాస్తవ పరిస్థితుల్ని గుర్తుచేస్తాయి. దాంతో సినిమాతో ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. సినిమా అంతా సహజంగానే అన్పిస్తుంది. అక్కడక్కడా సినిమాటిక్‌ లిబర్టీ మామూలే. సెకెండాఫ్‌ చివర్లో పేస్‌ కొంచెం తగ్గుతుంది. సన్నివేశాలు అసహజంగా అనిపిస్తాయి. ఆ ఒక్కటీ మినహాయిస్తే సినిమా మంచి ఫీల్‌ని మిగుల్చుతుంది. రాజకీయాస్త్రం అనొచ్చు, అలాగే ఇందులో రొమాంటిక్‌ డ్రామాకీ చోటు కల్పించారు. ఓవరాల్‌గా ఈ సినిమా ఆడియన్స్‌కి బాగానే కనెక్ట్‌ అవుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

నేనే రాజు నేనే మంత్రి బాగానే ఉన్నాడు

అంకెల్లో చెప్పాలంటే: 3/5 

మరిన్ని సినిమా కబుర్లు
paisa vasool movie ready to release