పెద్ద సినిమాలతో పోటీ పడి, చిన్న సినిమాలు సంక్రాంతి రేస్‌లో సత్తా చాటడం ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. శర్వానంద్ ఓ సంవత్సరం సంక్రాంతికి 'ఎక్స్‌ప్రెస్ రాజా', ఇంకో సంవత్సరం సంక్రాంతికి 'శతమానం భవతి'తోనూ మంచి హిట్స్ కొట్టశాడు. మొన్న దసరాకి 'మహానుభావుడు' సినిమాతో వచ్చి వసూళ్లు కొల్లగొట్టాడు. పండగ వేళ, పెద్ద సినిమాలతో వచ్చి కూల్‌గా హిట్స్ అందుకుని, యంగ్ హీరోల్లో మంచి దూకుడు ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకున్నాడు శర్వానంద్. చిన్న హీరో, చిన్న సినిమా అని తక్కువ అంచనా వేయకూడదని శర్వానంద్ నిరూపించాడు. కంటెంట్ ఉంటే, పెద్ద సినిమాలతో పోటీ పడి మరి సత్తా చాటగలవు చిన్న సినిమాలు కూడా. ఆ నమ్మకంతోనే అన్నపూర్ణా స్టూడియోస్ 'రంగుల రాట్నం' సినిమాని సంక్రాంతి రేస్‌లోకి తీసుకొస్తోంది. రాజ్‌తరుణ్ హీరోగా నటించాడు ఈ సినిమాలో. చిత్రశుక్లా హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీరంజిని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సంక్రాంతి రేస్‌లోకి సినిమా వస్తోంది అనే ప్రకటన వచ్చేదాకా ఈ సినిమా గురించి పెద్దగా ఎక్కడా చర్చ జరగలేదు. అంత సైలెంట్‌గా దూసుకొచ్చేశాడు రాజ్‌తరుణ్ ఈ సినిమాతో. సినిమా ప్రోమో కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. ఈ సినిమాపై చాలా నమ్మకంతో పండగ సీజన్‌ని రిలీజ్ కోసం ఎంచుకున్నారని ట్రైలర్ విన్నాక ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు. 'అజ్ఞాతవాసి', 'జై సింహా' వంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు, సూర్య నటించిన డబ్బింగ్ సినిమా 'గ్యాంగ్ ' కూడా సంక్రాంతికే విడుదలవుతుండగా, ఈ మూడు సినిమాల్ని తట్టుకుని, 'రంగులరాట్నం' సక్సెస్ కొట్టాలనీ ఆశిద్దాం. మరో పక్క రాజ్ తరుణ్ నటించిన 'రాజుగాడు' సినిమా కూడా లైన్‌లో ఉంది. ఈ సినిమాలో రాజ్‌తరుణ్‌తో ముద్దుగుమ్మ అమైరా దస్తూర్ జోడీ కడుతోంది.
|