తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రాజకీయ పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నారు. 2017 డిశంబర్ 31న అభిమానుల సమక్షంలో రాజకీయ రంగప్రవేశంపై కీలక ప్రకటన చేశారాయన. రజనీకాంత్ పొలిటికల్ ప్రకటన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సినీ రంగంలోనూ రజనీకాంత్, రాజకీయ రంగ ప్రవేశంపై ఆశక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'రోబో 2.0' విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసినదే. ఈ సినిమాని నిర్మిస్తోన్న లైకా సంస్థ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం సంస్థ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మూడేళ్లుగా రజనీకాంత్‌ని దగ్గరగా చూస్తున్న రాజు మహాలింగం రాజకీయాల్లో రజనీకాంత్‌తో కలిసి నడవాలని ఈ నిర్ణయం తీసుకున్నారట. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా రజనీకాంత్‌కి బాసటగా నిలవాలని అనుకుంటున్నారట. అయితే కొందరు మాత్రం రజనీకాంత్‌ని విమర్శిస్తున్నారు.
రాజకీయాల్లో విమర్శలు మామూలే. అసలు రజనీకాంత్ తమిళుడే కాదు. ఆయన రాజకీయాల్లో వస్తే నిలదీస్తాం అని నినదించిన వారూ ఉన్నారు. విమర్శలు, వివాదాలు ఎలా ఉన్నా, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అక్కడ పొలిటికల్ స్టార్‌గా ఎమర్జ్ అవ్వడం ఖాయమేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ విషయాలు ఇలా ఉంటే, రజనీకాంత్ నటించిన 'రోబో 2.0' 'కాలా' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 'రోబో 2.0' విడుదలవుతుంది. ఆ తర్వాత 'కాలా' విడుదల కానుంది. కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు కూడా అయిన లారెన్స్, రజనీకాంత్‌తో కలిసి రాజకీయాల్లో నడవాలనే ఆలోచనతో ఉన్నారట.
|