Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చల్‌ మోహనరంగ చిత్రసమీక్ష

chal mohanaranga movie review

చిత్రం: చల్‌ మోహనరంగ 
తారాగణం: నితిన్‌, మేఘా ఆకాష్‌, మధునందన్‌, రావు రమేష్‌, నర్రా శ్రీనివాస్‌, లిజి తదితరులు. 
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ 
సినిమాటోగ్రఫీ: నటరాజ సుబ్రమణియన్‌ 
దర్శకత్వం: కృష్ణ చైతన్య 
నిర్మాతలు: పవన్‌కళ్యాణ్‌, సుధాకర్‌రెడ్డి, పవన్‌కళ్యాణ్‌ 
నిర్మాణ సంస్థలు: పవన్‌కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, శ్రేష్ట్‌ మూవీస్‌ 
విడుదల తేదీ: 05 ఏప్రిల్‌ 2018

క్లుప్తంగా చెప్పాలంటే

చిన్నప్పుడే ఒకర్నొకరు ఇష్టపడతారు మోహన్‌ రంగ (నితిన్‌), మేఘ (మేఘా ఆకాష్‌). కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోతారు. మేఘ, అమెరికా వెళ్ళిపోతుంది. ఆమె కోసం అమెరికా పయనమవుతాడు మోహనరంగా. అమెరికాలో మేఘని మోహన్‌ కలుస్తాడుగానీ, ఆమె ఎవరన్నదీ అతనికి తెలియదు. ఇంతకీ మోహన్‌ రంగ తన ప్రేమని గెలిపించుకున్నాడా? అమెరికా వెళ్ళేందుకు అతను పడ్డ పాట్లు ఏంటి? ఇద్దరూ ఎందుకు విడిపోయారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూస్తేనే తెలుస్తాయి.

మొత్తంగా చెప్పాలంటే

నటుడిగా నితిన్‌ చాలా రాటుదేలాడనే చెప్పాలి. సినిమా సినిమాకీ మెచ్యూరిటీ లెవల్స్‌ పెరుగుతున్నాయి. కామెడీ టైమింగ్‌ బాగా వర్కవుట్‌ అవుతోంది. నటనలో ఈజ్‌ కనబరుస్తున్నాడు. టైలర్‌ మేడ్‌ లాంటి స్క్రిప్ట్‌ల్ని ఎంచుకుంటే, అందులో నితిన్‌ కేపబిలిటీస్‌ మరింతగా ఎలివేట్‌ అవుతున్నాయి. డాన్సులు బాగా చేశాడు, పవన్‌కళ్యాణ్‌ని ఇమిటేట్‌ చేయడం ఆటోమేటిక్‌గా జరిగిపోతోంది. హీరోయిన్‌ టీజింగ్‌ సన్నివేశాల్లోనూ చెలరేగిపోతున్నాడు నితిన్‌.

హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ అందంగా కన్పించింది. తెరపై నితిన్‌ - మేఘ ఇద్దరి పెయిర్‌ బాగా వర్కవుట్‌ అయ్యిందంటే దానికి కారణం, ఇద్దరి కాంబినేషన్‌లో 'లై' సినిమా రావడమే కావొచ్చు. దాంతో మేఘ మరింత ఈజ్‌తో చేసుకెళ్ళిపోవడానికి మార్గం సుగమం అయ్యింది. నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడతాయి.

రావు రమేష్‌, మధు నందన్‌ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నిన్నటితరం హీరోయిన్‌ లిజి చాలకాలం తర్వాత తెలుగు తెరపై సర్‌ప్రైజ్‌గా రీ-ఎంట్రీ ఇచ్చింది. మిగతా పాత్రధారులంతా తమ వంతుగా సినిమాకి సహకరించారు.

కథ కొత్తదేమీ కాదు, కథనం విషయంలోనూ దర్శకుడు కొత్తదనం చాటుకోవాలనుకోలేదు. అయితే సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా మలచాలనే ఆలోచనతో, ఎక్కువగా సిట్యుయేషనల్‌ కామెడీని నమ్ముకున్నాడు. కొన్ని చోట్ల అది బాగా పేలితే, ఇంకొన్ని చోట్ల తేలిపోయింది. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్‌ అయ్యింది. పాటలు బాగున్నాయి. 'పెద్ద పులి' పాట మాస్‌ని ఉర్రూతలూగిస్తుంది. 'మేఘ..' అంటూ సాగే పాట, పిక్చరైజేషన్‌ అదిరిపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువలు చాలా చాలా బాగున్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి అవసరమైన రిచ్‌నెస్‌ని తెచ్చేందుకు సహకరించాయి.

ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో కొంతమేర సినిమా స్లో అవుతున్నట్లు అన్పిస్తుంది. రొటీన్‌ కథ, కథనాలు కావడంతో అక్కడక్కడా బోర్‌ ఫీలవుతాడు ప్రేక్షకుడు. కాస్సేపు కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలున్నా, అవి అక్కడక్కడా మాత్రమే దొర్లుతాయి. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌, సింపుల్‌ లవ్‌ స్టోరీ అనుకుని థియేటర్‌కి వస్తే, ఎంజాయ్‌ చేసి వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఎలాంటి అభ్యంతరాలూ లేని సినిమా ఇది. ఓవరాల్‌గా నిరాశపరిచే సినిమా అయితే కాదు. అలాగని, బాగా ఎంటర్‌టైన్‌ చేసేసే సినిమా కూడా కాదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద ఇంకాస్త దృష్టిపెట్టి వుంటే, ఫలితం ఇంకా బెటర్‌గా వుండేది.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఛల్‌ మోహనరంగ - ఫర్వాలేదన్పించంగ!

అంకెల్లో చెప్పాలంటే:  3/5

మరిన్ని సినిమా కబుర్లు
churaka