1998లో కృష్ణ జింకల వేటాడిన కేసులో సల్లూ భాయ్ దోషిగా పరిగణించబడ్డాడు. గురువారం జోధ్‌పూర్ కోర్టు సల్లూభాయ్‌ని దోషిగా పరిగణించి, ఐదేళ్ల జైలు శిక్ష విధించినట్లుగా తీర్పు వెలువరించింది. వన్య ప్రాణి సంరక్షణ కింద సల్లూభాయ్‌పై కేసులు నమోదు చేశారు. గత 20 ఏళ్లుగా ఈ కేసు నుండి తప్పించుకొస్తున్నాడు సల్మాన్‌ఖాన్. ఎట్టకేలకు కోర్టు తుది తీర్పును విధించింది.మన టైగర్‌కి జింకల వేటలో ఐదేళ్లు శిక్ష పడింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సోనాలీ బింద్రే, టబు, సైఫ్ అలీకాన్, నీలమ్‌లను నిర్ధోషులుగా పరిగణించింది. దాంతో ఈ నలుగురికీ కాస్త ఊరట లభించింది. కానీ సల్లూ భాయ్ మాత్రం అడ్డంగా బుక్ అయిపోయాడు. 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో ఈ ఐదుగురూ జీపులో కృష్ణ జింకల వేటకు బయల్దేరారు. సల్మాన్ ఖాన్ డ్రైవింగ్ సీట్‌లో ఉన్నాడు.
ఇదే కాక, గతంలో తప్ప తాగి యాక్సిడెంట్ కమ్ మర్డర్ కేసులో కూడా సల్మాన్‌ఖాన్ నిందితుడుగా ఉన్నాడు. ఆ కేసు నుండి ఎలాగో తప్పించుకున్నాడు కానీ, ఈ సారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించేసింది మన కండల వీరుడికి. ఇటీవలే 'టైగర్ జిందాహై' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సల్మాన్ ఖాన్. మంచి విజయం దక్కింది ఈ సినిమాతో సల్లూభాయ్‌కి. ఇప్పుడు చేయాల్సిన సినిమాల్లో 'రేస్ 3', 'కిక్ 2', 'భారత్' తదితర చిత్రాలున్నాయి సల్మాన్ చేతిలో. మరి ఈ తాజా తీర్పుతో ఆల్రెడీ కమిట్ అయిన ఈ సినిమాల సంగతేంటనీ ఆయా దర్శక, నిర్మాతలు ఓ పక్క, సల్లూభాయ్ అభిమానులు మరో పక్క ఆందోళన చెందుతున్న పరిస్థితి.
|