'బిగ్‌బాస్' రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై తొలిసారిగా ఎన్టీఆర్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయనున్నాడు. అదే క్రికెట్ ప్రియుల్ని కదలనీయకుండా టీవీల ముందు కూర్చుండబెట్టే ఐపీఎల్ సీజన్. త్వరలోనే ప్ర్రారంభం కానున్న ఐపీఎల్ సమాచారాన్ని ఓ ప్రముఖ తెలుగు ఛానెల్ ప్రసారం చేయనుంది. దీనికి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆల్రెడీ నెట్టింట్లో సందడి చేస్తోంది. ఆ వీడియోని చూసిన ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్‌కి తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడంటే ఆ అనందం డబుల్ అయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్‌పై ఐపీఎల్‌కి సంబంధించిన పలు వీడియోస్‌ని షూట్ చేసి పెట్టారు.
ఒక్కొక్కటిగా వాటిని విడుదల చేయనున్నారట. ప్రస్తుతం ఈ ఈవెంట్ నిమిత్తం ఎన్టీఆర్ బిజీగా గడుపుతున్నాడు. మరో పక్క త్రివిక్రమ్‌తో సినిమాకి సంసిద్ధమవుతున్నాడు. త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోందట. అందుకోసం ఆల్రెడీ జిమ్‌లో కసరత్తులు చేసి చాలా వరకూ బరువు తగ్గాడు యంగ్ టైగర్. అంతకన్నా ముందు ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా తన డిఫరెంట్ లుక్‌ని అభిమానులకు పరిచయం చేస్తున్నాడు. గతంలో ప్రొ కబడ్డీ లీగ్‌కి తెలుగులో ప్రసారం మాంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ ఐపీఎల్ తెలుగు కామెంట్రీ మరింత కిక్ ఇవ్వడం ఖాయమనీ ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.
|