చిత్రం: జంబ లకిడి పంబ
తారాగణం: శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నానీ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ధన్ రాజ్, షకలక శంకర్, హరితేజ, రాజ్యలక్ష్మి, హిమజ, జబర్‌దస్త్ అప్పారావు, సన, సంతోష్, గుండు సుదర్శన్ తదితరులు.
సంగీతం: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
నిర్మాతలు: రవి, జోజో జోస్, శ్రీనివాస్‌రెడ్డి ఎన్
దర్శకత్వం: జెబి మురళీకృష్ణ (మను)
విడుదల తేదీ: 22 జూన్ 2018
క్లుప్తంగా చెప్పాలంటే
వరుణ్ (శ్రీనివాస్‌రెడ్డి) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. పల్లవి (సిద్ధి ఇద్నానీ). వరుణ్, పల్లవి ప్రేమించి పెళ్ళి చేసుకుంటారుగానీ, మనస్పర్ధల కారణంగా విడిపోవాలనుకుంటారు. విడాకులకోసం న్యాయవాది హరిశ్చంద్రప్రసాద్ (పోసాని కృష్ణమురళి)ని కలుస్తారు. విడాకుల స్పెషలిస్ట్ అయిన హరిశ్చంరదప్రసాద్, భార్యతో గోవా టూర్‌కి వెళతాడు. దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అయితే, చనిపోయాక హరిశ్చంద్రప్రసాద్‌ని దేవుడు పైకి రానివ్వడు. విడాకుల కోసం నీ దగ్గరకు వచ్చిన ఓ జంటను కలిపితే తప్ప, పైకి రానిచ్చేది లేదని దేవుడు తెగేసి చెప్పేసరికి, చేసేది లేక ఆత్మ రూపంలో భూమ్మీదకు వస్తాడు హరిశ్చందప్రసాద్. ఎవర్నయితే విడదీయడానికి ఒప్పుకున్నాడో, ఆ వరుణ్ - పల్లవి జంటను కలిపేందుకు హరిశ్చంద్రప్రసాద్ పాట్లు పడాల్సి వస్తుంది. మరి వరుణ్, పల్లవి విడాకుల వ్యవహరమేమయ్యింది? హరిశ్చంద్రప్రసాద్ ఆత్మకు శాంతి కలిగిందా? లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి.
మొత్తంగా చెప్పాలంటే
కమెడియన్‌గా చాలా సినిమాల్లో నటించిన శ్రీనివాస్‌రెడ్డి, హీరోగా 'గీతాంజలి', 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాలతో హీరోగా మారాడు. నటుడిగా సినిమా సినిమాకీ అతనిలో మెచ్యూరిటీ లెవల్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ సినిమానే తీసుకుంటే, సినిమా మొత్తాన్నీ తన భుజాన మోసేందుకు ప్రయత్నించాడు. హీరోయిన్ సిద్ధి ఇద్నానీకి ఇదే తొలి తెలుగు సినిమా అయినా బాగా చేసింది. మంచి ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. డాన్సుల్లోనూ అలరించింది. గ్లామరస్ పరంగానూ బాగుంది.
మిగతా పాత్రధారుల్లో పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ తమ తమ పాత్రలకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. వెన్నెల కిషోర్ నవ్వులు బాగానే పండించాడు. మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
ఆడ, మగ పాత్రల ఆత్మలు మారిపోవడమే ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్. పాయింట్ మంచిదే అయినా, దాని చుట్టూ ఇంట్రెస్టింగ్‌గా కథ నడపడంలో దర్శకుడు అంతగా సక్సెస్ అవలేకపోయాడు. స్క్రీన్ ప్లే ఆకట్టుకోదు. డైలాగ్స్ అక్కడక్కడా పేలాయి. సినిమాటోగ్రఫీ ఓకే. సంగీతం బాగానే వుంది. ఎడిటింగ్ చాలా సందర్భాల్లో అవసరం అన్పిస్తుంది. నిర్మాణపు విలువలు బాగానే వున్నాయి. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సినిమాకి హెల్పయ్యింది.
ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని డీల్ చేయాలనుకున్నప్పుడు దర్శకుడు, దాన్ని డీల్ చేయడానికి తగిన శ్రద్ధ పెట్టాల్సి వుంటుంది. దర్శకుడి కన్‌ఫ్యూజన్ చాలా సీన్స్‌లో కన్పిస్తుంది. కొన్ని సీన్స్ రీపీటెడ్ అన్న భావన కలిగిస్తాయి. కామెడీ టైమింగ్ వున్న హీరో దొరికాక, హీరోయిన్ నుంచీ నటన పరంగా సపోర్ట్ దొరికాక దర్శకుడు చెలరేగిపోవచ్చు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. పోసాని, వెన్నెల కిషోర్‌లనీ సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు. దాంతో కామెడీ పరంగా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి నటీనటుల్లో అక్కడక్కడా కన్పిస్తుంది. కథనం పరంగా జాగ్రత్తలు తీసుకుని, నటీనటుల్ని బాగా వాడుకుని వుంటే సినిమా మంచి విజయాన్ని సాధించి వుండేదే. పాత 'జంబలకిడి పంబ' ఇప్పుడు చూసినా నవ్వు ఆపుకోలేం. అలాంటి క్లాసిక్ పేరు పెట్టుకున్నందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది.
ఒక్క మాటలో చెప్పాలంటే
ఆనాటి 'జంబలకిడి పంబ'లో పావు వంతు కూడా లేదు
అంకెల్లో చెప్పాలంటే
2/5
|