చిత్రం: ఈ నగరానికి ఏమైంది?
తారాగణం: విశ్వక్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభివన్ గోమతం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు.
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: నికిత్ బొమ్మి
రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్
నిర్మాత: డి. సురేష్‌బాబు
నిర్మాణం: సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 29 జూన్ 2018
క్లుప్తంగా చెప్పాలంటే
వివేక్ (విశ్వక్సేన్), కార్తీక్ (సుశాంత్), కౌశిక్ (అభినవ్), ఉపేంద్ర (వెంకటేష్) నలుగురు స్నేహితులు. వీరంతా ఓ షార్ట్ ఫిలిం తీయాలనుకునే బ్యాచ్. వివేక్‌కి కోపమెక్కువ, పైగా లవ్ ఫెయిల్యూర్. అలా ఒక్కొక్కరిదీ ఒక్కో టైపు. దాంతో తరచుగా వీరి మధ్య గొడవలు వస్తుంటాయి. పెళ్ళి చేసుకుందామనుకునే ఆలోచనలో వున్న కార్తీక్, తన స్నేహితులకు పార్టీ ఇస్తాడు. పార్టీ మత్తులో నలుగురూ గోవా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమయ్యింది.? అన్నది మిగతా కథ.
మొత్తంగా చెప్పాలంటే
నలుగురూ కొత్తవారే. వీరిలో కౌశిక్ నటన నటనతో ఇంకాస్త ఎక్కువ ఆకట్టుకున్నాడు. నలుగురూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. చాలా సహజంగా అన్పిస్తుంది వీరి నటన. సహజత్వానికి దగ్గరగా దర్శకుడు మెయిన్ లీడ్ ఆర్టిస్టుల్ని ఎంచుకోగా, దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా వారంతా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.
కథ పరంగా లోపాలు వున్నాయి. కథనంలోనూ తడబాటు కన్పిస్తుంది. డైలాగ్‌లు యూత్‌ని బాగానే ఆకట్టుకునే అవకాశముంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే వుంది. ఎడిటింగ్ చాలా చాలా అవసరం అనిపిస్తుంది. నిర్మాణపు విలువలు బాగానే వున్నాయి. ఆర్ట్, కాస్ట్యూమ్స్ ఫర్వాలేదు.
యూత్‌ని టార్గెట్‌గా చేసుకుని వచ్చిన అనేక సినిమాలు పెద్ద విజయాలే సాధించాయి. అయితే, పరాజయాలు పొందిన సినిమాలు తక్కువేమీ కాదు. ఒక్కోసారి మ్యాజిక్ అలా వర్కవుట్ అవుతుందంతే. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆయా సినిమాలకు ప్లస్ అవుతుంటాయి. కొత్తదనంతో తీసే సినిమాలే అయినా, అవి యూత్‌కి కనెక్ట్ అవ్వాల్సి వుంటుంది. కథ పరంగా కొత్తదనాన్ని కోరుకోకపోయినా, కథనాన్ని సమర్థవంతంగా నడిపించగలగాలి. కథ విషయంలో, కథనం విషయంలో దర్శకుడు తడబడటం సినిమాకి పెద్ద మైనస్. పైగా సినిమా నిండా తాగుబోతు సన్నివేశాలు ఎక్కువైపోయాయి. 'పెళ్ళిచూపులు' సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడి నుంచి, ఇలాంటి సినిమాని అయితే ఆడియన్స్ ఆశించరు. యూత్‌లోనూ ఓ సెక్షన్‌ని ఎట్రాక్ట్ చేసే సన్నివేశాలుండడంతో వారికి ఓకే అన్పిస్తుంది. అంతకు మించి, సినిమా అప్పీలింగ్‌గా అనిపించదు.
ఒక్క మాటలో చెప్పాలంటే
ఈ దర్శకుడికి ఏమయ్యింది?
అంకెల్లో చెప్పాలంటే: 2.5/5
|