'అష్టా చెమ్మా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నాని. ఆ సినిమా విడుదలై పదేళ్లైంది. ఈ పదేళ్లలో నాని రకరకాల ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలను చవి చూశాడు. డైరెక్టర్ అవుదామనుకుని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా హీరోగా సెటిలైపోయాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు, ఫ్యామిలీ హీరోగానూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. నాని అంటే పక్కింటబ్బాయ్ ఇమేజ్ ఉన్నోడు. సహజ నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఏ సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా తనదైన స్థాయిలో నిలదొక్కుకున్నాడు. కెరీర్ మొదట్లో కొన్ని పరాజయాలు చవి చూసినా, 'భలే భలే మగాడివోయ్' చిత్రం నుండీ వరుస విజయాలతో దూసుకొచ్చాడు. నానితో సినిమా అంటే నిర్మాతలకు పండగే. మినిమమ్ బడ్జెట్‌లో నిర్మాతలకు ఖచ్చితంగా లాభాలు తెచ్చిపెట్టగల హీరో నాని. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించాడు.
అలా హీరోగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న ఈ తరుణంలోనే బిగ్‌బాస్ హోస్ట్‌గా బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నాడు. అసలే పక్కింటబ్బాయ్ ఇమేజ్ ఉన్న నాని బుల్లితెరపై కనిపిస్తున్నాడంటే ప్రేక్షకులు మరింత సంతోషం వ్యక్తం చేశారు. హీరోగా ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతూనే 'అ' వంటి విలక్షణ కథా చిత్రంతో నిర్మాతగానూ ఓ మెట్టు పైకెక్కాడు నాని. ఇలా ఈ పదేళ్ల సినీ పయనంలో రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు నేచురల్ స్టార్ నాని. ఇలాంటి మరెన్నో పాత్రలు నాని నుండి రావాలని, మరిన్ని విలక్షణ సినిమాల్లో నాని నటించాలనీ ఆశిద్దాం.
|