చిత్రం: సిల్లీ ఫెలోస్
తారాగణం: అల్లరి నరేష్, సునీల్, చిత్రా శుక్లా, పూర్ణ, జయప్రకాష్ రెడ్డి, ఝాన్సీ, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, రఘు కారుమంచి, చలపతిరావు, రాజా రవీంద్ర, నందిని రాయ్ తదితరులు.
సంగీతం: శ్రీ వాసంత్
సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్‌కుమార్
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు
నిర్మాణం: బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 7 సెప్టెంబర్ 2018
క్లుప్తంగా చెప్పాలంటే
జాకెట్ జానకిరామ్ (జయప్రకాష్‌రెడ్డి) ఓ ఎమ్మెల్యే. ఆయనకి నమ్మిన బంటు సూరిబాబు (నరేష్). ఎమ్మెల్యే పదవి కోసం ఎదురుచూస్తున్న సూరిబాబు, జానకిరామ్ మెప్పుకోసం నిర్వహించే ఓ సామూహిక వివాహాల కార్యక్రమం నిమిత్తం ఫ్రెండ్ వీరబాబు (సునీల్)కి పుష్పతో పెళ్ళి చేసేస్తాడు. ఇంకోపక్క తన ప్రియురాల్ని పోలీస్ చేయడం కోసం 10 లక్షలు లంచం పై అధికారులకు ఇచ్చేస్తాడు. వీరబాబుకి పుష్ప కారణంగా ఓ సమస్య వచ్చిపడ్తుంది. ఆ సమస్య నుంచి బయటపడాలన్నా, తాను ఖర్చు చేసిన 10 లక్షల వ్యవహారం కొలిక్కి రావాలన్నా జానకిరామ్ చేతుల్లోనే వుంటుంది. కానీ జానకిరామ్ ఓ ప్రమాదం కారణంగా కోమాలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.
మొత్తంగా చెప్పాలంటే
అల్లరి నరేష్, సునీల్ ఇద్దరూ కామెడీలో అదరగొట్టేస్తారు. అలాంటిది ఈ ఇద్దరు తెరపై కన్పిస్తే.. ఆ కిక్కే వేరేలా వుంటుంది. తెరపై కన్పించినంతసేపూ అటు అల్లరి నరేష్, ఇటు సునీల్ కామెడీతో కడుపుబ్బా నవ్వించేశారు. ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అయితే ఈ ఇద్దరి స్టామినాకి తగ్గ కంటెంట్‌తో కూడిన సీన్స్ రూపొందించడంలో దర్శకుడు ఆశించిన మేర సఫలం కాలేదన్పిస్తుంది. హీరోయిన్లలో చిత్రా శుక్లా, పూర్ణ ఓకే. నందిని రాయ్ ఫర్వాలేదు.
జానకిరామ్ పాత్రలో జయప్రకాష్‌రెడ్డి తన సీనియారిటీకి తగ్గట్టుగా నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చేతా బలవంతంగా కామెడీ పండించినట్లు అన్పిస్తుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.
కథ ఓకే. కథనం పరంగా తగినంత వేగం చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. డైలాగ్స్ బాగానే వున్నాయి. పాటల్లో 'హెడ్డేకురా మామా' ఆకట్టుకుంటుంది. పాటలన్నీ వినడానికి, తెరపై చూడ్డానికీ బాగానే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. సినిమాటోగ్రఫీ సినిమాకి తగ్గట్టుగానే వుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సినిమాకి అవసరమైన మేర సహకారాన్ని అందించాయి. నిర్మాణపు విలువలు బాగానే వున్నాయి.
ఫస్టాఫ్ సరదా సరదాగా సాగిపోతుంది. ఆ తర్వాతే కథలోంచి మెయిన్ కాస్టింగ్ మీద ఫోకస్ డల్ అయిపోతుంది. మళ్ళీ క్లయిమాక్స్‌కి ముందు ఊపందుకుంటుంది. ఓవరాల్‌గా సినిమా ఓ మోస్తరుగా అన్పిస్తుంది. సునీల్‌నీ, అల్లరి నరేష్‌నీ పూర్తిగా వాడుకుని వుంటే ఇంకా బెటర్ ప్రోడక్ట్ అయి వుండేది. సునీల్‌ని చాలాకాలం తర్వాత ఈ స్థాయి కామెడీ పాత్రలో చూస్తాం కాబట్టి, అది కొంచెం ఊరట. చాలా చోట్ల నరేష్, సునీల్ తమ టాలెంట్‌తో ఒకర్ని ఒకరు డామినేట్ చేసేలా అన్పిస్తారు. బ్రహ్మానందం పాత్ర వృధా అన్న బావన కలగడం బాధాకరం. నాటు కామెడీ.. ఇప్పుడున్న క్లాస్ ట్రెండ్‌లో ఎలా వర్కవుట్ అవుతుందో ఇప్పటికైతే సస్పెన్సే.
ఒక్క మాటలో చెప్పాలంటే
సునీల్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..
అంకెల్లో చెప్పాలంటే 2.5/5
|