సంపూర్ణేష్ బాబు ఏముందో తెలీదు ఈ పేరులో. బర్నింగ్ స్టార్ అంటూ నిజంగానే ప్రజల హృదయాల్ని బర్న్ చేసేశాడీ స్టార్. తనదైన కామెడీ స్టైల్‌తో హీరోగా ఆకట్టుకున్నాడు. 'హృదయ కాలేయం' సినిమాతో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్ బాబు పలు చిత్రాల్లో అతిధి పాత్రల్లోనూ మెరిశాడు. ఆయన నటించిన 'కొబ్బరి మట్ట' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ సంగతి పక్కన పెడితే, తిత్లీ తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర ప్రజలు సాయం కోసం విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడో కేరళకు వరదలు వస్తే, క్షణాల్లో స్పందించిన మన స్టార్ హీరోలకు, ఇక్కడే ఉన్న మన తెలుగు రాష్ట్ర ప్రజల ఆర్తనాదాలు వినిపించట్లేదా.? సాయం కోసం అర్ధిస్తున్న తమ వద్దకు ఏ నాయకులూ రావడం లేదనీ, అక్కడి ప్రజలు తమ గోడు వెల్లబుచ్చుకుంటున్నారే తప్ప, ఆ గోడు ఎవ్వరికీ వినిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి పరిస్థితిని స్వయంగా చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
కేరళ వరద బాధితుల సహాయార్ధం విరాళాలు వెదజల్లిన సెలబ్రిటీలు సిక్కోలు విషయంలో చిన్న చూపు చూస్తున్న ఈ తరుణంలో మొట్ట మొదటిగా స్పందించిన సెలబ్రిటీ స్టార్ సంపూర్ణేష్‌బాబు. గతంలో ప్రత్యేకాంధ్ర ఇష్యూ విషయంలోనూ సంపూర్ణేష్ బాబు మద్దతు పలికారు. నిజానికి తెలంగాణా వాడైన సంపూర్ణేష్‌బాబు తెలుగు ప్రజల విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. అలాగే ఇప్పుడు 50వేల రూపాయలు సిక్కోలు తుఫాను బాధితులకు విరాళంగా ప్రకటించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, వరుణ్‌తేజ్, కళ్యాణ్‌రామ్ తదితర హీరోలు తమ వంతు విరాళాలను ప్రకటించారు.
|