బాలీవుడ్ హాట్ ఐటెం బాంబ్ రాఖీసావంత్ ఏం చేసినా సంచలనమే. సినిమాల్లో అమ్మడి సీను అంతగా లేదు కానీ, అప్పుడప్పుడూ సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. మరోసారి ఈ అమ్మడి పేరు తాజా తాజాగా వార్తల్లోకెక్కింది. ఎందుకంటారా? ప్రస్తుతం బాలీవుడ్‌ని 'మీ టూ' మూమెంట్ కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ తనూశ్రీ దత్తా అప్పుడెప్పుడో పదేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో ప్రముఖ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇప్పుడు ఆరోపణలు చేసి, ఆయన పరువు బజారుకీడ్చిన సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ ప్రకంపనలతో వేడెక్కిన బాలీవుడ్ తర్వాత తర్వాత పలువురు ముద్దుగుమ్మలు 'మీ టూ.. మీటూ..' అంటూ వెలుగులోకి వస్తూ పలానా సినిమా టైంలో పలానా హీరో, లేదా పలానా డైరెక్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేస్తున్నారు.
అసలింతకీ రాఖీసావంత్ గొడవేంటంటారా? నానా పటేకర్‌కి రాఖీ సావంత్ సపోర్ట్‌గా నిలిచింది. ఆయన చాలా మంచోడు, తనూశ్రీదే తప్పంతా అంటోంది. ఆమె ఆరోపణల్లో నిజమెంత మాత్రమూ లేదంటోంది. 'హారన్ ఓకే ప్లీజ్' సినిమాలో తనూశ్రీ దత్తా నటించాల్సిన స్పెషల్ సాంగ్‌లో ఆమె తప్పుకోగా, అదే సాంగ్‌లో రాఖీసావంత్ నటించింది. ఒకవేళ నానాపటేకర్ చెడ్డవాడే అయితే, నాతో ఎందుకు అసభ్యంగా ప్రవర్తించలేదు. తనూశ్రీ ఆరోపణలు నిజమే అయితే ఆధారాలు చూపించాలంటూ తనూశ్రీని ఓపెన్‌గా ఛాలెంజ్ చేసింది. అంతేకాదు, తనూశ్రీకి పిచ్చి అనీ, పదేళ్లుగా కోమాలోనే ఉన్నదనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. దాంతో తనూశ్రీ దత్తా, లీగల్‌గా ఛాలెంజ్ చేస్తూ రాఖీ సావంత్‌పై పరువు నష్టం దావా వేసింది. అదీ సంగతి.
|