చిత్రం: కవచం
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, పోసాని కృష్ణమురళి, హరీష్ ఉత్తమన్, రాజేష్, హర్షవర్ధన్ రాణె, అజయ్ తదితరులు
సంగీతం: తమన్ ఎస్‌ఎస్
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు
నిర్మాత: నవీన్ చౌదరి శొంటినేని
దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ళ
నిర్మాణం: వంశధార క్రియేషన్స్
విడుదల తేదీ: 7 డిసెంబర్ 2018
కుప్లంగా చెప్పాలంటే..
క్రమశిక్షణ గల యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). విశాఖలో విజయ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటాడు. ఓ సందర్భంలో సంయుక్త (మెహరీన్)ని ప్రమాదం నుంచి రక్షించిన విజయ్, ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెను కిడ్నాప్ చేస్తున్నట్లు నాటకం ఆడాల్సి వస్తుంది. కానీ, ఆ క్రమంలో తాను కిడ్నాప్ చేసింది అసలు సంయుక్తని కాదనీ, సంయుక్త పేరుతో వున్న లావణ్య (మెహరీన్) అనీ తెలుస్తుంది. అసలు సంయుక్త (కాజల్)ని ఇంకెవరో కిడ్నాప్ చేస్తారు నిజంగానే. ఆ కిడ్నాప్ కేసు, విజయ్ మీద పడుతుంది. ఇంతకీ, ఈ డబుల్ సంయుక్త వెనుక సీక్రెట్ ఏంటి.? అసలు సంయుక్తను కిడ్నాప్ చేసింది ఎవరు.? ఈ మిస్టరీని విజయ్ ఎలా ఛేదించాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
మొత్తంగా చెప్పాలంటే..
పోలీస్ అధికారి పాత్రలో స్టిఫ్‌గా కన్పించేందుకు ప్రయత్నించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. యాక్షన్ ఎపిసోడ్స్‌లో, డాన్సుల్లో బెల్లంకొండ శ్రీనివాస్ సత్తా చాటాడు. నటన పరంగా ఇంకా చాలా మెరుగవ్వాల్సి వుంది. తనవరకూ పూర్తి ఎఫర్ట్స్ పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్‌ని అభినందించాల్సిందే.
హీరోయిన్లలో కాజల్, మెహ్రీన్‌లకు కథలో ప్రాథాన్యం వున్నా, వారి పాత్రల్ని దర్శకుడు మలచిన తీరు ఏమంత బాగుండదు. గ్లామర్ పరంగా ఇద్దరూ తాము చేయగలిగినదానికంటే ఎక్కువే చేశారు. నెగెటివ్ రోల్‌లో నీల్ నితిన్ ముఖేష్ బాగానే చేసినా, ఆయన పాత్రని డిజైన్ చేసిన తీరు కూడా అప్ టు ది మార్క్ లేదు. విలనిజం పండకపోవడంతో, హీరోయిజం తేలిపోతుంది. పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, హరీష్ ఉత్తమన్, సత్యం రాజేష్, హర్షవర్ధన్ రాణే తదితర నటులున్నా, ఎవర్నీ దర్శకుడు వినియోగించుకోకపోవడంతో.. అందరి పాత్రలూ తేలిపోయినట్లు అన్పిస్తాయి.
కథ పరంగా చూస్తే ఇంట్రెస్టింగ్ అన్పిస్తుంది. కథనం విషయానికొస్తే చాలా లోపాలు కన్పిస్తాయి. డైలాగ్స్ ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ఆర్ట్, కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్స్ ఓకే. ఎడిటింగ్ గందరగోళంగా అన్పిస్తుంది. నిర్మాణపు విలువలు చాలా రిచ్‌గా వున్నాయి.
దర్శకుడు మంచి పాయింట్‌ని ఎంచుకున్నాడుగానీ, కథని నడిపించడంలో గందరగోళానికి గురయ్యాడు. విలనిజం ఎంత ఎలివేట్ అయితే, హీరోయిజం అంత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దడానికి అవకాశం వుంటుంది. కానీ, ఈ విషయంలో దర్శకుడు తడబడ్డాడు. విలనిజం ఎలివేట్ కాకపోవడంతో, హీరోయిజం పవర్ కన్పించలేదు. హీరోయిన్ల పాత్రలకి కథలో మంచి చోటు కల్పించినా, ఆ పాత్రల్ని తిర్చిదిద్దిన విధానం ఆకట్టుకోదు. దాంతో కాజల్ లాంటి సీనియర్ హీరోయిన్ కూడా ఏమీ చేయలేకపోయింది. మెహ్రీన్ సంగతి సరే సరి. ఫస్టాఫ్ సాగతీతగా వుంటే, సెకెండాఫ్‌లోనూ ఏమాత్రం పుంజుకునే పరిస్థితి కన్పించదు. సెకెండాఫ్‌లో ట్విస్ట్‌లు వున్నా, అవి గందరగోళాన్ని సృష్టించాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌ని సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు.
అంకెల్లో చెప్పాలంటే..
2.5/5
ఒక్క మాటలో చెప్పాలంటే
'కవచం' సరిగ్గా కుదరలేదు
|