Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

అంతరిక్షం చిత్రసమీక్ష

amtariksham movie review

చిత్రం: అంతరిక్షం 
తారాగణం: వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరీ, రఘు, శ్రీనివాస్‌ అవసరాల, సత్యదేవ్‌ తదితరులు. 
సంగీతం: ప్రశాంత్‌ విహారి 
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ 
నిర్మాతలు: రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌ 
దర్శకత్వం: సంకల్ప్‌ రెడ్డి 
నిర్మాణం: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 21 డిసెంబర్‌ 2018

కుప్లంగా చెప్పాలంటే.. 
దేవ్‌ (వరుణ్‌ తేజ్‌), రష్యాలో శిక్షణ పొందిన భారతీయ వ్యోమగామి. ఓ శాటిలైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా, మిగిలిన ఉపగ్రహాలకు నష్టం వాటిల్లే అవకాశం వుందనీ, దాన్ని సరిదిద్దాలంటూ దేవ్‌కి ప్రతిపాదన వస్తుంది. భారతదేశ కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన విషయం కావడంతో, దాన్ని దేవ్‌ డీల్‌ చేయాల్సి వస్తుంది. కానీ, అప్పటికే దేవ్‌ ఉద్యోగాన్ని వదిలేస్తాడు. దేవ్‌, ఎందుకు తనకిష్టమైన ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు? దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశాన్ని దేవ్‌ ఎలా డీల్‌ చేస్తాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి. 
మొత్తంగా చెప్పాలంటే..

వ్యోమగామి దేవ్‌ పాత్రలో వరుణ్‌ తేజ్‌ ఒదిగిపోయాడు. పాత్రకు అవసరమైన భావోద్వేగాల్ని ప్రదర్శించడంలో వరుణ్‌ తనదైన ముద్ర వేశాడు. అన్ని ఎమోషన్స్‌నీ బాగా క్యారీ చేయగలిగాడు. విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ ప్రతి పాత్రతోనూ తనకు తానే సవాల్‌ విసురుకుంటున్న వరుణ్‌ని అభినందించి తీరాలి. అతని కెరీర్‌లో ఇదొక మంచి పాత్రగా ఎప్పటికీ నిలిచిపోతుంది.

హీరోయిన్లలో లావణ్య త్రిపాఠికి దక్కింది తక్కువ ప్రాధాన్యమే. వున్నంతలో ఆమె బాగా చేసింది. మరో హీరోయిన్‌ అదితి రావు హైదరీ వ్యోమగామి పాత్రలో కన్పించింది. సెకెండాఫ్‌లో అదితి పాత్ర కీలకం. సత్యదేవ్‌, రఘు, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 
తెలుగు సినిమాని అంతరిక్షంలోకి తీసుకెళ్ళాలన్న ఆలోచనే దర్శకుడ్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. కథ పరంగా హాలీవుడ్‌ ఆలోచనలు చేశాడు దర్శకుడు. కథనం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాడు. డైలాగ్స్‌ విషయంలో టెక్నికల్‌ టెర్మ్స్‌ ఎక్కువయ్యాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అన్పిస్తుంది. సినిమాకి విజువల్స్‌ స్పెషల్‌ ఎస్సెట్‌. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి అదనపు బలాన్నిచ్చింది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కష్టం తెరపై కన్పిస్తుంది. హాలీవుడ్‌ స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా వున్నాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి.

కొత్తదనంతో కూడిన సినిమాలే అయినా, ప్రేక్షకుడ్ని థియేటర్‌లో కూర్చోబెట్టగలగాలి. దానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఒక్కటే వుండాలంటే కుదరదు. ప్రేక్షకుడ్ని కదలనీయకుండా కట్టిపడేయగల మ్యాజిక్‌ వుంటే సరిపోతుంది. ఆ విషయంలో దర్శకుడు కొంతవరకు సఫలమయినా, కొంతవరకు ఇబ్బందిపెట్టాడు. స్పేస్‌, శాటిలైట్స్‌.. వాటికి సంబంధించిన కోడింగ్‌.. ఇలా తెరపై ఏవేవో పదాలు విన్పిస్తోంటే, కనెక్ట్‌ అవడం కష్టం. తెరపై సీరియస్‌ అంశం నడుస్తున్నా, అక్కడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందంటే.. ఆ అర్థం కాని పదాల కారణంగానే. ఆ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని వుంటే బావుండేది. ఆ ఒక్కటీ మినహాయిస్తే, ఓ మంచి అనుభూతిని అయితే ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ సినిమాతో పొందుతారు. ఎంటర్‌టైన్‌మెంట్‌, గ్లామర్‌ ఆశిస్తే మాత్రం కష్టమే.

అంకెల్లో చెప్పాలంటే..
3.25/5

ఒక్క మాటలో చెప్పాలంటే
అంతరిక్షం.. అద్భుతమేగానీ..  

మరిన్ని సినిమా కబుర్లు
churaka