చిత్రం: మిస్టర్ మజ్ను
తారాగణం: అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, ప్రియదర్శి, నాగబాబు, సుబ్బరాజు, హైపర్ ఆది, సితార, పవిత్ర లోకేష్, విద్యుల్లేఖ తదితరులు.
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్
నిర్మాత: బివిఎన్‌ఎన్ ప్రసాద్
దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
విడుదల తేదీ: 25 జనవరి 2019
కుప్లంగా చెప్పాలంటే..
ఏ అమ్మాయినైనా చిటికెలో ప్రేమలో పడేయగల సత్తా వున్న చిలిపి కుర్రోడో విక్కీ (అఖిల్). యూకేలో ఎంఎస్ చదువుతుండే విక్కీ, ఏ అమ్మాయితోనూ లాంగ్ టెర్మ్ లవ్ చేయడు. అంతా షార్ట్ టెర్మ్ ప్రేమ వ్యవహారాలే. అతనికి నిక్కీ (నిధి అగర్వాల్) పరిచయమవుతుంది. నిక్కీ ఆలోచనలు విక్కీ ఆలోచనలకి పూర్తి వ్యతిరేకం. ప్రేమిస్తే, శ్రీరాముడి లాంటివాడ్ని ప్రేమించాలనుకుంటుంది. విక్కీ మనస్తత్వం తెలుసుకుని నిక్కీ అతన్ని అసహ్యించుకుంటుంది. కానీ అనుకోకుండా అతనితో ప్రేమలో పడ్తుంది. మరి విక్కీ, నిక్కీ ప్రేమని ఫీలవుతాడా? షార్ట్ టెర్మ్ ప్రేమ తప్ప, లాంగ్ టెర్మ్ ప్రేమ మీద నమ్మకం లేని విక్కీ, నిక్కీతో ఎలా ప్రేమ వ్యవహారం నడిపాడు? నిక్కీకి విక్కీ శ్రీరాముడిలా కన్పించాడా? శ్రీరాముడిలా అతన్ని మార్చుకోగలిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే..
అక్కినేని అఖిల్ డాన్సులు బాగా చేశాడు. ఫైట్స్‌లో ఇరగదీశాడు. చిలిపి కుర్రాడిలా ఫన్ జనరేట్ చేశాడు, రొమాంటిక్ యాంగిల్‌లో అదరగొట్టేశాడు. ఎమోషనల్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. తనవంతుగా అన్నీ చేసి నటుడిగా మంచి మార్కులేయించుకోవాలనుకున్నాడు. నిజంగానే అఖిల్‌కి మంచి మార్కులు పడతాయి ఈ సినిమాతో నటుడిగా. చాలా ఎనర్జిటిక్‌గా కూడా కన్పించి మెప్పించాడు అఖిల్ అక్కినేని.
హీరోయిన్ నిధి అగర్వాల్ అందంగా కన్పించింది, నటనతోనూ మెప్పిస్తుంది. అఖిల్‌తో నిధి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. ఆమెకిది రెండో తెలుగు సినిమా. తొలి సినిమాలో అక్కినేని నాగచైతన్యతోనూ, రెండో సినిమాలో నాగచైతన్య తమ్ముడు అఖిల్‌తోనూ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండించింది నిధి అగర్వాల్.
నాగబాబు, పవిత్ర లోకేష్, రావు రమేష్, సితార.. ఇలా చాలామంది నటీనటులు తెరపై కన్పిస్తారు. కానీ ఆయా పాత్రల నిడివి అంతంతమాత్రమే. తమకు దక్కిన స్క్రీన్ స్పేస్‌లో అందరూ ఆకట్టుకుంటారు. హైపర్ ఆది, ప్రియదర్శి, విద్యుల్లేఖ రామన్‌ల హాస్యం కొన్ని సన్నివేశాల్లో కడుపుబ్బా నవ్విస్తుంది. మిగతా పాత్రలన్నీ తమ పాత్రల పరిధి మేర బాగానే అన్పిస్తాయి.
కథ పరంగా చెప్పుకోవాలంటే కొత్తదనమేమీ కన్పించదు. కథ కంటే దర్శకుడు కథనం మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నాడు. అయితే కథనం పరంగా కూడా అక్కడక్కడా లోపాలు కన్పిస్తాయి. సంగీతం బావుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మంచి మూడ్‌లో నడిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్ అవసరం ఇంకాస్త ఎక్కువ అన్పిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పని తీరు ఓకే. నిర్మాణపు విలువలు బావున్నాయి. ఎక్కడా రాజీ పడలేదు నిర్మాత.
చిలిపితనం ఓవర్ డోస్‌తో వుండే హీరో పాత్రలకు తెలుగు తెరపై కొరతేమీ లేదు. చాలా సినిమాలొచ్చేశాయి ఇలాంటి కథలతో. హీరో - హీరోయిన్ మధ్య ఈ తరహా కాన్‌ఫ్లిక్ట్ చూసేశాం ఇదివరకే. కొత్తగా ఈ సినిమాతో దర్శకుడు ఏమన్నా చెప్పాడా? అంటే లేదనే అన్పిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్ వేగంగానే నడుస్తుంటుంది. సెకెండాఫ్‌లోనే ఎమోషనల్ కంటెంట్, సాగతీత సన్నివేశాలు వెరసి సినిమా వేగం తగ్గిపోయేలా చేస్తుంది. ప్రీ క్లయిమాక్స్ మళ్ళీ ఫర్వాలేదన్పిస్తుంది. ఓవరాల్‌గా యువ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కంటెంట్ అయితే సినిమాలో వుందని చెప్పొచ్చు. టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే గనుక.. సినిమాకి విజయావకాశాలకు కొదవ వుండకపోవచ్చు.
అంకెల్లో చెప్పాలంటే..
2.75/5
ఒక్క మాటలో చెప్పాలంటే
అక్కినేని కుర్రాడు ఆకట్టుకుంటాడు
|