Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
poems

ఈ సంచికలో >> శీర్షికలు >>

నీకూ... నాకూ పెళ్ళంట - కాశీవిశ్వనాధం పట్రాయుడు

neeku -  naku pellamta

"నీకీ పుల్లమజ్జిగ గాడు ఎక్కడ దొరికాడే"

"వాడినే పెళ్లిచేసుకుంటానని భీష్మించుకు కూచున్నావు. మనమేమిటి? మన వంశమేమిటి? స్వర్గంలోని కామధేనువు నుంచి సురభి, నందిని.... నేటి ఆవు ,గేదెల వరకు ఎంతటి ఘనచరిత్ర మనది?

 

బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా, బాదం, కాఫీ ఇలా ఏది వేసి కలిపినా అమోఘమైన రుచిని ఇస్తాయి. అసలు అంతవరకూ ఎందుకు వట్టి పంచదార వేసినా, వెయ్యకపోయినా లొట్టలేస్తూ తాగేవాళ్ళు ఎంతమంది లేరు. పరమాన్నం, పాయసం, కోవా, జున్నులాంటి ఎన్నెన్నో మిఠాయిలకి మూలం మనమే. అలాంటి నీవు రంగు తప్ప రుచి, వాసన లో ఏమాత్రం పోలిక లేని ఆ మజ్జిగ గాడిని పెళ్ళి చేసుకుంటానంటావా? సిగ్గులేదూ! మన మధుర వంశం వారి పరువు తీస్తున్నావుకదే!!." అంది క్షీరం తల్లి.

 

"అలా అనొద్దమ్మా ఎంత మధురవంశం వారైనా, ఎంతమందికి ఆకలి తీర్చి ప్రాణాలు కాపాడినా, ఎన్ని శుభకార్యాలలో పాల్గొన్నా మనల్నే నమ్ముకుని మనసిచ్చిన వారికి సర్వస్వం ఇచ్చి వారిలా మారి వారసుల్ని అందిస్తే అపుడే మనపేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది" అంది క్షీరం(పాలు) తల్లితో.

"ఇదేమి చోద్యమే నువ్వు ఆ మజ్జిగని పెళ్లి చేసుకుంటే నీకంటూ ఒక వ్యక్తిత్వం గుర్తింపు ఉండదు. మానుంచి నువ్వు పూర్తిగా వేరైపోతావు ఆలోచించుకో ఎందుకు చెప్తున్నానో విను" అంది తల్లి కూతురు క్షీరంతో..

"మన వంశమూలమైన అమృతం కూడా తన స్వాభావిక లక్షణాన్ని వదలుకోలేదు కాబట్టే తన ప్రత్యేకత ఇప్పటికీ అలానే ఉంది" అన్నాయి సుధ, పీయూషం తదితర పాల బంధువర్గం.

"లేదమ్మా ఒక్కసారి తక్త్రం(మజ్జిగ) తో మాట్లాడి చూడండి. నాకైతే మీలానే ఉండిపోవాలని లేదు వారసులను అందించాలని ఉంది" క్షీరం తల్లితో.

అప్పుడే లోనికి ప్రవేశిస్తున్న తక్త్రం(మజ్జిగ) క్షీరం తల్లిని ఉద్దేశిస్తూ.." అమ్మా సాహసం చేస్తున్నందుకు మన్నించాలి. మీరన్నది ముమ్ముర్తులా నిజం. నేను రంగులో తప్ప ఇంకెందులోనూ మీ అమ్మాయికి సాటిరాను, అయినా మీ అమ్మాయికి మనసిచ్చాను. ఒకరినొకరం ఇష్టపడ్డాం. పెద్ద మనసుతో మా పెళ్లిని మీరు జరిపిస్తారని ఆశిస్తున్నాను" అన్నాడు తక్త్రం.

"ఏముందని ఇవ్వమంటావయ్యా"
చల్ల బూరెలు, పోపుమజ్జిగ, మాగాయపులుసుకు తప్ప ఒక్క మధుర పదార్ధానికైనా ఉపయోగపడతావా? అని నిలదీసింది క్షీరం తల్లి.

"అలా అనకండమ్మా! మా అమ్మా అమ్మమ్మలంతా మీ వంశం నుంచి వచ్చిన వారే కదా!" అని ఒప్పించే ప్రయత్నం చేసాడు తక్త్రం.

"కుదరదయ్యా! "అన్నారు పాల బంధువర్గం.

"మీకు తగిన వారసుణ్ణి ఇవ్వకపోతే అపుడు నన్ను నిందించండి. మీ క్షీరాన్ని మాత్రం నాకు దూరం చెయ్యకండి " అని తన ప్రేమని వ్యక్తం చేశాడు తక్త్రం.

తక్త్రం మాటతీరు, పద్ధతి నచ్చి పాల బంధువులు క్షీరాన్ని తక్త్రం కు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వారికి దధి(పెరుగు) అనే కొడుకు పుట్టాడు. దద్దోజనానికీ పెరుగు ఆవడలకి, నైవేద్యాలకు, అభిషేకాలకు పనికి వచ్చే ఈ దధిని కొంతవరకు ఆమోదించినా తండ్రి తక్త్రం లక్షణాలే ఎక్కువగా ఉండటంతో తమలో కలుపుకోలేకపోయాయి పాల బంధువులు.

మరి కొంత కాలానికి దధి కి నవనీతం (వెన్న), నవనీతానికి ఘృతం (నెయ్యి) జన్మించాయి. ఘృతం హోమ ద్రవ్యంగా, బలవర్ధకంగా మిఠాయిలకు, దైవకార్యాలకు ఉపయోగపడటం ఆరంభమయ్యింది.

"మా నాయనే! మళ్ళీ ఇన్ని తరాల తర్వాత మాతో కలిసే లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నావు. మాకు తగిన వారసుడవయ్యావు."

"అయితే ఒక్క విషయం.... ఆ రోజు కనుక తక్త్రం వచ్చి మా క్షీరాన్ని వివాహం చేసుకుంటానని ఆడగక పోతే ఈనాడు మాకు నువ్వు లభించేవాడివి కాదు."

"మా జీవితకాలం స్వల్పం. నీ వలన ఒక గుభాళింపు, ఒక విలువ, చిరాయుష్షు, చిర యశస్సు మాకు లభించాయి. క్షీరం పసిపిల్లలకు ఎంతటి బలమిస్తుందో పప్పుతో కూడిన నీవు(నెయ్యి) అంతకంటే ఎక్కువ బలాన్ని, బుద్ధిని, తేజస్సుని ఇస్తున్నావు. ఇంతకంటే ఏమి కావాలి."

"ఎప్పుడైనా, ఎంత ఘనత కలిగినా నేను, నా , అనే అహంకారం వదిలి ఇతరులతో మమేకమై తన ఉనికిని కూడా కోల్పోయినంతలా త్యాగాన్ని ప్రదర్శిస్తేనే తరువాతి తరాలకు నీవంటి అత్యుత్తమ ఫలాలు, వారసులు లభిస్తారు". అని ఘృతాన్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాయి క్షీరబంధువులు.

*భార్యాభర్తలు వేరు కాదు... ఒకరి కోసం ఒకరు... ఒకరిలో ఒకరు... అప్పుడే అన్యోన్య దాంపత్యం అవుతుంది. ఆనందమైన కుటుంబం, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడతాయి.*

 

మరిన్ని శీర్షికలు
tamilnadu