Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

మౌని అమావాస్య ప్రాముఖ్యత : మౌనమే మార్గం! - ..

mouni amavasya importence

మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా చూచి గానీ, విని గానీ, ఆఘ్రాణించి గానీ (వాసన చూడటం), రుచి చూసి గానీ, స్పృశించి గానీ గ్రహించే ఈ జగత్తంతా కేవలం కొన్ని ప్రకంపనల వల్ల ఏర్పడిందే. జగత్తంతా శబ్దం లేక నాదం తాలూకూ విలాసమే. మనిషి శరీరమూ, మనస్సూ కూడా ప్రకంపనల వల్ల ఏర్పడినవే. కానీ శరీరమూ, మనసూ చరమ లక్ష్యాలుగా ఏర్పడినవి కావు. ఈ రెండూ ఒకానొక లక్ష్యం తాలూకూ పై పై పొరలు మాత్రమే. చాలా మంది మనుషులు ఈ పొరలను దాటి లోతుకు వెళ్లలేరు. వాళ్ళు తమ జీవితమంతా ముఖద్వారం దగ్గరే కూర్చొని ఉండిపోతారు. కానీ ద్వారం ఉన్నది లోపలికి ప్రవేశించటానికి కదా! ప్రవేశించి ఆ ద్వారానికి అవతలి పక్క ఉన్న దాన్ని అనుభవించటానికి చేసే నిశ్శబ్ద సాధననే 'మౌనం' అంటాం.

ఆంగ్లంలో సైలెన్స్ (silence) అన్న పదం పెద్దగా ఏమీ తెలియజేయదు. సంస్కృత భాషలో నిశ్శబ్దాన్ని సూచించేందుకు చాలా పదాలు ఉన్నాయి. వాటిలో 'నిశ్శబ్దం', 'మౌనం' అనే రెండు పదాలు ప్రముఖమైనవి. 'మౌనం' అంటే మనకు మామూలుగా తెలిసిన నిశ్శబ్దం. అంటే మాట్లాడకుండా ఉండటం. ఇది శబ్ద రాహిత్య స్థితిని సృష్టించే ప్రయత్నం. నిశ్శబ్దం అంటే శబ్దం కానిదేదో అది. అంటే ఈ శరీరానికీ, మనసుకూ, ఈ సృష్టి సర్వానికీ ఆవల ఉండేది. శబ్దానికి ఆవల ఉండేది అంటే, కేవలం శబ్ద రాహిత్య స్థితి అని కాదు, శబ్దానికి అతీతమైన స్థితి అని.

నిశ్శబ్దం ఆంతరికమైన సారరూపం

జగత్తంతా శక్తి ప్రకంపనలవల్ల ఏర్పడిందన్న విషయం శాస్త్రీయంగా నిరూపితమైన సత్యం. మనిషికి తెలిసిన ప్రకంపనలన్నీ శబ్దాలుగా రూపంతరం చెందుతాయి. ఈ సృష్టిలో ప్రతి ఒక్క రూపానికీ దానికి సంబంధించిన శబ్ద రూపం ఒకటి ఉంటుంది. ఈ అతి సంక్లిష్టమైన శబ్ద తరంగాల సముదాయమే మనకు 'సృష్టి' గా అనుభవంలోకి వస్తుంది. శబ్దాలన్నిటికీ మూలం నిశ్శబ్దం. మనిషి, సృష్టిలో తానూ ఒక శకలంగా ఉండే స్థితిని అధిగమించి, అసలు తానే ఆ సృష్టిమూలంగా మారేందుకు చేసే సాధన మౌనం. అలాంటి నిర్గుణమైన, నిరవధికమైన, అనంతమైన చైతన్య స్థితిని అనుభవం చేసుకోవటమే యోగ సాధనలకు లక్ష్యం.

నిశ్శబ్దం అనగానే ఒక శూన్యాన్ని స్ఫురించవచ్చు. మరి శూన్యం అనగానే ఆ పదానికి 'nothing' అనే ఒక చులకన (negative) అర్థం తట్టవచ్చు. ఆ 'nothing'ని మధ్యలో ఒక అడ్డగీత పెట్టి 'no-thing' అని అర్థం చేసుకొంటే మంచిది. అ-వ్యక్తం, అ-గోచరం అనే అర్థంలో. శబ్దం అనేది పై పై పొరలకూ, ఉపరితలానికీ మాత్రమే సంబంధించిన విషయం. నిశ్శబ్దం ఆంతరికమైన సారరూపం. అంతరాంతరాలలో పూర్తి శబ్ద రాహిత్యం ఉంటుంది. శబ్దమే లేని స్థితి అంటే ప్రకంపనలూ, జీవనమూ, మరణమూ, సృష్టీ ఇవేవీ ఉండనిస్థితి. సృష్టి అనేది మన అనుభవంలోకి రాకుండా ఉన్న స్థితి అంటే, అది 'సృష్టి మూలం' అనుభవంలోకి వచ్చే స్థితి అన్నమాట. కనుక, నిశ్శబ్ద స్థితి అంటే సృష్టికి అతీతమైన స్థితి. జీవన, మరణాలకు అతీతమైన స్థితి. నిశ్శబ్దాన్ని ఎవ్వరూ ఆచరించలేరు. నిశ్శబ్దంగా పరిణమించగలరు, అంతే!

మరిన్ని శీర్షికలు
Aalu Tomato Curry - Very Easy Method.