Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Cool summer

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

సీజనల్ మూఢ నమ్మకాలు!

నల్ల పిల్లి ఎదురొస్తే, ఎవరైనా తుమ్మితే ప్రయాణం చేయకూడదని. కొన్ని అంకెలు అచ్చిరాకపోవడం, కావాలని కలిసొస్తాయని కొన్ని రంగులు, హంగులు కూర్చుకోవడం మనకు తెలుసు. చౌరస్తాల్లో కుండెడు అన్నం నిమ్మకాయలు, పసుపు, కుంకంలతో ఎవరైనా దాటడానికి ఉంచడం-ఇలాంటి మూఢ నమ్మకాలు మనిషి జీవితంలో భాగమయి సుగమ ప్రయాణాన్ని అగమ్యగోచరం చేస్తుంటాయి.

అయితే మరికొన్ని సీజనల్ మూఢ నమ్మకాలు వస్తుంటాయి. అవేంటంటే- అన్న తన చెల్లెళ్లకి పచ్చని గాజులు, చీర, పసుపు, కుంకం పెట్టాలని. అలాగే ఒకింట్లో ఇద్దరు మగపిల్లలుంటే దానాలు ధర్మాలు చెయ్యాలని ఇత్యాదివి. కొన్ని అయితే మరీ చిత్రంగా ఓవర్నైట్ లో ప్రాణం పోసుకుని గాలికన్నా వేగంగా వ్యాపిస్తాయి. అప్పటికప్పుడు దానికి సంబంధించిన అరెంజ్మెంట్లు చేసుకోలేక అతలాకుతలం అయినవాళ్లు నాకు తెలుసు.

నాఫ్రెండొకడు ట్రైన్ ఎక్కడు. మరొకడు తోడు లేకుండా వెళ్లడు. అదేంటంటే ఎవరో జోతిష్కుడు చెప్పాట్ట!

ఈ మధ్య పురుషులు, స్త్రీలు కాళ్లకు నల్లటి మొలతాడు దారం కట్టుకుని తిరగడం చూస్తున్నాను. అదేమిటని? ఎందుకలా కట్టుకుని తిరుగుతున్నారని అడిగాను- దిష్టి తగలకుండా అని ఒకరు, మా ఇంట్లో ఉన్నవాళ్లు కట్టుకోమన్నారని మరొకరు సమాధానాలు చెప్పారు తప్ప, కాలికి మాత్రమే కట్టుకోవడంలోని అంతరార్థం, సరైన సమాధానం ఒక్కరూ చెప్పలేదు.

ఏ మహానుభావుడన్నాడో గాని మనుషులు గొర్రెలు. ఒక్కరు చేస్తే చాలు అందరూ అదే బాట పడతారు. తార్కికంగా అస్సలు ఆలోచించరు.సమస్యలు అందరికీ వస్తాయి. కాకపోతే ఇంటెన్సిటీ వేరుగా ఉంటుంది. భగవంతుడు సైతం సమస్యలు ఎదుర్కొన్నాడని మనకు తెలుసు. ఒక సమస్య ఎదురైతే బెంబేలు పడిపోయేవారే అధికం కాని నిబ్బరంగా ఉండేవారు అరుదు. అలా బెంబేలు పడేవారే మానసికంగా కుంగిపోతూ ఎవరేది చెబితే అటు నీరు పల్లమెరిగినట్టు ప్రవహిస్తారు. వాళ్ల మనసు తెగిన గాలిపటమే! అసలే బాధల్లో ఉన్నవాళ్లు వాస్తు పరిష్కారలకు వేలకు వేలు తగలెయ్యడం నాకు తెలుసు. శాంతులకు పూజలకు లక్షలు కర్చు చేయడం తెలుసు.

ఒకప్పుడు ఊళ్లలో ఏడు దాటిందంటే బయటకు వెళ్లాలంటే భయం. దెయ్యాలని బూతాలని తెగ భయపడేవాళ్లు. మరిప్పుడూ పట్నంలో పొట్టగడవడానికి షిఫ్ట్ డ్యూటీలు చేస్తూ అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ఇంటినుంచి కర్మాగారానికి, కర్మాగారాన్నుంచి ఇంటికి రాకపోకలు సాగాల్సిందే. అసలు దెయ్యాల ఊహ వచ్చే టైముండదు. అంటే దెయ్యాలు లేనట్లేగా!

ఒకప్పుడు శ్మశానాలు ఊరికి దూరంగా ఉండేవి. ఇప్పుడూ, ఇళ్ల మధ్యలోనే. మన మనసు చేసే వింతలు అన్ని ఇన్ని కావు. దాన్ని అదుపులో పెట్టుకుంటే అన్నీ అదుపులో ఉన్నట్టే! చెడు అన్నది జరగడానికి కారణాలక్కర్లేదు. మన జీవితంలో మంచి ఎలా చోటు చేసుకుంటుందో అదీ అంతే. అయితే దానికి అధిక ప్రాధాణ్యతనిచ్చి మనశ్శాంతి కోల్పోవడం కూడదు.మూఢ నమ్మకాలను విసర్జించండి. ఫాలో అయ్యేవాళ్లను మార్చే ప్రయత్నం చేయండి. అప్పుడు చూడండి మనిషి జీవితంలో ప్రగతి.. గతి!

***

మరిన్ని శీర్షికలు
road show cartoons