Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

చూస్తూ చూస్తూ మళ్ళీ సాధారణ  ఎన్నికలొచ్చేసాయి.. అయిదేళ్ళు గడవడం ఎంతసేపూ?  ఎన్నికలేమీ కొత్తకావు,  స్వతంత్రం వచ్చినప్పటినుండీ  అయిదేళ్ళకోసారి వస్తూనే ఉన్నాయి, ప్రభుత్వాలు ఎంత మారినా, సామాన్యమానవుడి పరిస్థితి మాత్రం ఏమీ మారినట్టులేదు.  ఏదో 70 ల దాకా , ఓ పధ్ధతిలో నడిచింది. ఆ తరవాత చాలా మార్పులు వచ్చాయి.  మొదట్లో, ఏదో స్వాతంత్రం  వచ్చిన కొత్తరోజులు కావడంవలన , స్వతంత్రపోరాటంలో పాల్గొన్నవారే చాలామంది ఎన్నికయేవారు.. పైగా అప్పటికి ప్రసార, ప్రచార సాధనాలు కూడా అంతగా ఉండేవి కావు… ఆరోజుల్లో, అందరూ కాకపోయినా, కొందరైనా దేశాన్ని అభివృధ్ధి బాటలో నడిపించినట్టే ఉంది.  స్వార్ధ రహితంగానే పనిచేసారనుకోవాలి.   తాము నమ్మిన సిధ్ధాంతాలను బట్టి, ఏదో రాజకీయ పార్టీలోనో చేరి, జీవితాంతం ఆ పార్టీకే పనిచేసేవారు. నామినేట్ చేయబడ్డారా, ఎన్నికలలో నిలబడేవారు. ప్రజలలో వారికున్న పేరుప్రతిష్టలను బట్టి ఎన్నికయేవారు. అయినా ఆ రొజుల్లో ఉన్నవెన్నీ, మూడో నాలుగో రాజకీయ పార్టీలు. అన్నీ జాతీయ స్థాయిలోనే.. ప్రాంతియ పార్టీల హవా అప్పటికింకా రాలేదు.

ఆ తరవాత దశకానికి   శాసనసభ సభ్యత్వాలలో ఉండే సుఖాలకీ, సదుపాయాలకీ ,  అలవాటు పడ్డారు. ఇంకేముందీ, కుటుంబంలోని మిగిలిన సభ్యులని కూడా రంగంలోకి దింపసాగారు… ఏదో ఏ కొద్దిమందో తప్ప దేశానికేదో సేవలు చేయడం కంటే, తమని తాము ఉధ్ధరించుకోడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలయింది. ఏ పార్టీ టికెట్ మీద  ఎన్నికయారో, ఆ పార్టీని విడిచిపెట్టి, అధికారపార్టీలోకి మారిపోవడం, 70 ల్లోనే ప్రారంభం అయింది. ఆరోజుల్లో గుర్తుండే ఉంటుంది, “ ఆయారాం గయారాం “ అనేవారు, హర్యాణా రాష్ట్రంలో. పొద్దుటో పార్టీ, సాయంత్రానికి ఇంకో పార్టీ గా ఉండేది. ఈ గొడవలు భరించలేక పార్లమెంటులో ఓ చట్టం కూడా చేసారు --  Anti Defection Law -  అని. ఈ చట్టప్రకారం, పార్టీ మెంబర్లలో 1/3 కంటే తక్కువ అయితే,  పార్టీ ఫిరాయించిన సభ్యుడి సభ్యత్వం రద్దవుతుందని… అలాగే ఎవరినా కైల్లో ఉన్నా, వారికికూడా పోటీచేసే హక్కుండేది. ఆతరవాత అప్పుడెప్పుడో, దాన్ని మార్చి, కోర్టులో కేసులున్నా పరవాలేదూ, నేరస్థుడిగా శిక్ష పడకుండా ఉంటే, ఎన్నికల్లో నిలబడొచ్చూ అని. ప్రస్తుతం జరుగుతున్నదదే.. ఎన్నికల్లో పోటీచేసేవారిమీద, ఎన్నో ఎన్నెన్నో కేసులుంటాయి, అయినా తీర్పులు మాత్రం రావు, ఏ ఒకరిద్దరి కేసులో తప్ప.

కాలక్రమేణా ఎన్నికల్లో నిలబడ్డానికి ఖర్చు , వేలల్లో ఉండేది, కోట్లలోకి దిగింది. పాపం ఎన్నికలసంఘం, ఆ ఖర్చు ఏదో నియంత్రించాలనే సదుద్దేశ్యంతో అధికారకంగా ఇన్ని లక్షలకంటే ఎక్కువుండకూడదంది. అయినా వినేవాడెవడూ? ఈరోజుల్లో ఓ ఎన్నికలో నెగ్గాలంటే, పాపం ఎంతఖర్చో కదా?  ఓటుకింతా అని తీసుకునేవాళ్ళు కొందరైతే, అసలు టికెట్ సంపాదించాలంటే, పార్టీకి ఎంతివ్వాలో? ఈ విషయాలన్నీ పబ్లిక్ గా ఎవరూ ఒప్పుకోకపోయినా, జరుగుతున్నదదే అని ప్రతీవాడికీ తెలిసిందే… ఇంత ఖర్చు పెట్టాలంటే స్వతహాగా ఎంతో కొంత ఉండాల్సిందే కదా. అందుకే ఈ రోజుల్లో, ఎన్నికల్లో నిలబడాలంటే, ఏవేవో సిధ్ధాంతాలూ, నీతులూ కాదు, డబ్బు ముఖ్యం. అసలంటూ ఎన్నికైతే, అయిదేళ్ళలో ఆ డబ్బుసంపాదించడమే కాక, తరవాతి రెండుమూడు తరాలకీ కూడా సరిపోయేటంత .

మధ్యలో అప్పుడెప్పుడో, ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ శేషన్ ధర్మమా అని కొన్ని సంస్కరణలు వచ్చాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులందరూ తమతమ ఆస్థి వివరాలు వెల్లడించాలని. అదంతా ఓ పెద్ద జోక్. అదేమిటో ప్రతీ వాడూ అప్పులే చూపిస్తాడు. అప్పుడే పుట్టిన పిల్లల పేరునా, పెళ్ళాంపేరనా ఉంటాయి అస్స్థులన్నీ, అదీ కిందటి ఎన్నికల్లో చూపించినదానికి ఓ నాలుగైదు వంతులు ఎక్కువగానే. మరి దేశాన్ని ఉధ్ధ్రరించిన ఈ అయిదేళ్ళలోనూ, మరో ఉద్యోగం లేకుందా, ఇన్నిన్ని ఆస్థులు ఎలా కూడబెట్టారో ఆ భగవంతుడికే తెలుసు.

పోనీ వెర్రి ప్రజలు, ఏదో ఫలానాపార్టీకదా అని  ఓట్లు వేసి విజయం ఇచ్చారే, ఆమాత్రం విశ్వాసంకూడా లేకుండా, డబ్బులకాశపడి, అధికారపార్టీలోకి జంప్ అయే, ఈ ప్రజాప్రతినిధులనేమనాలీ ? అయినా మళ్ళీ వాళ్ళనే ఎన్నుకోవలసిరావడం, మన దౌర్భాగ్యం.

 జరగబోయే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల ఆస్థివివరాలు చూస్తే తెలుస్తుంది.. కోటానుకోట్లు ఆస్థి, ఎక్కణ్ణుంచొచ్చిందో తెలియదు. అయినా వాళ్ళే మనకి దిక్కు….

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
endaro mahanubhavulu andarikee vandanaalu