Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
neeku -  naku pellamta

ఈ సంచికలో >> శీర్షికలు >>

తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

( కొడైకెనాలు , అభయారణ్యం )


కొడైకెనాల్ తమిళనాడులో దిండుగల్లు జిల్లాలో సుమారు 6300 అడుగుల యెత్తులో వున్న వేసవి విడిది .

చెన్నై నుంచి సుమారు 510 కిలోమీటర్ల దూరం కొడైకెనాల్ రోడ్డు , కొడైకెనాల్ రోడ్డునుంచి కొడైకెనాల్ సిటి సుమారు 75 కిలోమీటర్ల దూరం . చెన్నై , బెంగళూరు , ట్రివేండ్రం లాంటి ముఖ్య పట్టణాలనుంచి రైలు , బస్సు సర్వీసులు వున్నాయి . రైలు మార్గంలో ప్రయాణిస్తే కొడైకెనాల్ రోడ్డులో గాని మధురై స్టేషనులో గాని దిగి బస్సులో కొడైకెనాలు చేరుకోవాలి

కొడైకెనాలు ప్రయాణం పళని కొండలమీదుగా సాగుతుంది . దట్టమైన అడవులతో కూడుకొని వున్న దారి , మబ్బులు చాలా కిందకి వుండడంతో మనం మబ్బులను చీల్చుకొని వెళుతున్నట్లుగా వుంటుంది .        ఈ అడవులలో చాలా మటుకు పైను , నీలగిరి చెట్లు వున్నాయి , మైదానాలు పచ్చని గడ్డి తో గడ్డిపూలతోనూ అహ్లాదకరంగా వుంటుంది . కొండలలో ప్రయాణం అంటే కొండవాలులలో ప్రవహిస్తున్న జలపాతాలు కామనే , మనలాంటి పట్టణవాసులకి చాలా ఆనందాన్ని కలుగ జేస్తాయి , రోడ్డులమీద అక్కడక్కడా మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్న దుకాణాలు , పండ్లదుకాణాలు కనిపిస్తాయి . ఏకాలమైనా వేడిగా వుండే తమిళనాడు వాతావరణం యీ కొండలమీద మారిపోయి చలిగా యింకా పైకి వెళుతున్నగొద్దీ చాలా చల్లగా మారిపోతుంది .

          కొడైకెనాలు పర్యాటక స్థలం కావడంతో యిక్కడ పర్యాటకులకు కావలసిన జసదుపాయాలు వున్నాయి ,  ముఖ్యంగా కొడైకెనాలు సరస్సు , యిందులో బోటింగు పర్యాటకలను ఆకర్షిస్తుంది . ఈ సరస్సు మానవనిర్మితమైనది , వర్షాధారమైనదికూడా , యే సంవత్సరమైన వర్షాలు సమంగా కురవకపోతే యీ సరస్సు యెండిపోతుంది , కొడైకెనాల్ కి సగం అందం యీ సరస్సువల్లే కలుగుతుంది . ఈ సరస్సు సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలతలో వుంది . అలాంటి సరస్సు యెండిపోతే కొడైకెనాల్ కి ఆకర్షణ వుండదు . ఎవరైన కొడైకెనాల్ వెళ్లదల్చుకున్నవారు ముందుగా యీ సరస్సును గురించి కనుక్కొని వెడితే నిరాశ యెదురవదు . 

        సరస్సుకు యివతల వొడ్డున చిన్న పెద్ద హోటల్స్ వున్నాయి , భోజనాలుకూడా చాలా ఖరీదుగా వుంటాయి , అవతల వొడ్డున బోటింగ్ టికెట్స్ అమ్మే స్థలం , పిల్లలకి ఆడుకోడానికి సర్వ సదుపాయాలతోనూ పార్కు , వాటర్ స్పోర్ట్స్ , ఫుడ్ కోర్టు వున్నాయి , యివన్నీ కూడా సాయంత్రం అయిదయేసరికి మూసేస్తారు , ఫుడ్ కోర్టు ఆరున్నరకల్లా మూసేస్తారు , ఆ తరువాత తినడానికేమీ దొరకదు , లోకలు పళ్లదుకాణాలలో పళ్లు చాలా బాగుంటాయి , అక్కడ దొరికే పళ్లు చాలా మటుకు యెప్పుడూ చూడని రకాలు వుంటాయి , కాబట్టి పేర్లు తెలీవు .

         పళని కొండలపైన అడవి చాలా దట్టంగా వుండడంతో పగలు సూర్యకిరణాలు చొరబడవు , దానివల్ల ఈ అడవులలో పచ్చిక మీద యెంతదూరమైనా అలా నడుస్తూ పోవాలని అనిపిస్తుంది , పిల్లలకి ఆటపాటలతో కాలమే తెలీదు .

          కొడైకెనాల్ చుట్టుపక్కల చిన్నచిన్న పల్లెలలో చాలా కొండజాతులవారు నివశిస్తున్నారు . కొండవాలులలో పంటలు పండించడం కనిపిస్తూ వుంటుంది . ఇక్కడ కాఫీతోటలు బాగా కనిపిస్తాయి .

           కొడైకెనాలు కి ఆ పేరు యెందుకొచ్చిందో దాని వెనుక వున్న కథ స్థానికులు యిలా చెప్తారు . కొడై అంటే లత , లేక వల్లి అని కూడా అంటారు . ఈ అడవి అంతా లతలతో కూడుకొని వుండేదట , యిప్పటకీ అలాగే వుంటుందనుకోండి . ఈ అడవిని పరిపాలించే రాజు సంతానంకొరకు ఈశ్వరునికి పూజలు చేసేవాడట , అతని తపస్సు ఫలించి ఓరోజు అడవిలో పసిపాప దొరికిందట , ఆ పాపకు వల్లి అనే పేరు పెట్టుకొని పెంచిపెద్ద చేసేడట , ఆమె పెరిగి పెద్దయిన తరువాత కుమారస్వామిని పెళ్లాడిందట , అంటే వారి కథనం ప్రకారం వల్లి పుట్టిన ప్రదేశమే కొడైకెనాల్ ట .

          కొడైకెనాల్ కి దగ్గరగా వున్న చిన్న గ్రామాన్ని ‘ లిటిల్ ఇజ్రాయిల్ ‘ అని అంటారు , కారణం ప్రతీ సంవత్సరం అక్టోబరులో ఇజ్రాయిల దేశం నుంచి పర్యాటకులు యెక్కువ సంఖ్యలో వచ్చి యీ గ్రామంలో వుంటారట , వారికి కావలసిన ఆహారం అక్కడ దొరుకుతుంది .

          అన్ని పర్యాటక ప్రదేశాలలో వున్నట్లే యిక్కడకూడా గోల్ఫ్ మైదానం వుంది .

          కొడైకెనాల్ చుట్టుపక్కల గ్రామాలలో దుర్గ , కురింజి ఆండవన్ కోవెల , మురుగన్ కోవెల , మారియమ్మన్ కోవెల , వినాయక కోవెల వున్నాయి .

       కొడైకెనాల్ చుట్టుపక్కల వున్న ముఖ్య పర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాం .

బ్రెయింట్ పార్కు —

             ఈ పార్కులో సుమారు 740 రకాల గులాబీ జాతులున్నాయి , ప్రతీసంవత్సరం జరిగే ఫ్లవర్ షో దేశవిదేశాలలో ప్రాముఖ్యతని సంపాదించుకుంది .

          గ్రీన్ వేలీ వ్యూ , షెంబగనూరు మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ తప్పక చూడవలసినవి , ఈ మ్యూజియంని 1895 లో జాతికి సమర్పించేరు , యిందులో  సుమారు 500 రకలైన జంతువులు , పక్షి , కీటకాలను భద్ర పరిచేరు . ఇవికాక  సోలార్ అబ్జర్వేటరి , పిల్లర్స్ రాక్ , సిల్వర్ కాస్కేడు , డాల్ఫిన్ నోస్ , బెరిజామ్ లేక్ , గుణ గుహలు వున్నాయి . గుణ గుహలు పర్యాటకులకోసం మూసివేసేరు , తమిళసినిమా గుణ సినిమా షూటింగు యిక్కడ జరిగిందట అప్పటినుంచి వీటిని గుణగుహలని పిలువ సాగేరు .

           కొడైకెనాల్ కి దగ్గరగా అంటే సుమారు 180 కిలోమీటర్ల దూరంలో కోయంబత్తూరు జిల్లాలో పోలాచి పట్టణానికి దగ్గరగా వున్న ‘ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ‘ చూడదగ్గది , దీనిని ‘ అన్నామలై టైగర్ రిజర్వ్ ‘ అని కూడా అంటారు . సుమారు 1000 చదరపు కిలోమీటర్లలో వ్యాపించ వుంది . 1961 లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధి యీ అభయారణ్యాన్ని వీక్షించడంతో యీ అభయారణ్యానికి ఆమె పేరు పెట్టడం జరిగింది .

 

         ఈ అభయారణ్యంలో ఒకటిరెండురోజులు ఉండడానికి అన్ని వర్గాలవారికీ అందుబాటులో వుండే విధంగా రకరకాలైన వసతులు వున్నాయి . అలాగే అడవిలో తిరగడానికి జీపు సఫారీ చెయ్యొచ్చు . ఇవన్నీ ముందుగా ఆన్ లైనులో బుక్ చేసుకుంటే మంచిది . అడవి జంతువుల అరుపులు వింటూ రాత్రి గడపడం ఓఅనుభూతి .

         జీపు సఫారీ తప్పక చెయ్యాలి , సాధారణంగా యీ జీపుల వాళ్లకి జంతువులు యెక్కడ యెక్కడ తిరుగుతున్నాయో తెలుస్తుంది , జీపులో అయితే అడవిలో చాలా లోపల వరకు ప్రయాణించవచ్చు . జంతువులు నీళ్లుతాగే ప్రదేశం , ఒక్కోసారి సగం తిని దాచుకున్న మాంసం లాంటివి కనిపిస్తాయి .

        టైగర్ రిజర్వ్ కాబట్టి మనం పులులని చూడొచ్చని  అనుకుంటే మాత్రం పొరపాటే , సాధారణంగా పులులు జనసంచారానికి దూరంగా వుండడానిక యిష్టపడతాయి , వెయ్యి చదరపు కిలోమీటర్లలో ఓ పది వరకు వున్న పులులను గుర్తించడం కష్టమే , అయితే అడుగడుగున కనిపించే కొండముచ్చులను చూస్తూ దట్టమైన అడవులలో ప్రయాణించడం ఓ సాహసమే . ఈ అడవిలో యెక్కువగ అడవి యేనుగుల సంచారం వుంటుంది , ఒక్కోసారి మందనుంచి తప్పిపోయిన యేనుగు తిరిగి మందను చేరడానికి చేసే ప్రయత్నం మధ్యలో అడ్డువచ్చిన వాహనాలను , చెట్లను తోసేస్తూ పరుగులు తీయడం చూడ్డం ఓ వింతే , దూరం నుంచి యేనుగుల గుంపును చూడడం కూడా ఓ మంచి అనుభూతి .

          అభయారణ్యాలలో గడపడం మంచి ఆటవిడుపుగా వుంటుంది .

      నాకెందుకో కొడైకెనాల్ లో వుండడం కన్నా ఈ అభయారణ్యంలో వుండడం నచ్చింది . చీకటి పడడం తోనే బయటి ప్రపంచంతో సంబంధాలు వుండవు , ఒకోసారి కరెంట్ పోవడంకూడా జరుగుతుంది . హోటల్ వాళ్లు రాత్రి గది బయటకి రావొద్దని చేసే హెచ్చరికలు మనసులో యెక్కడో భయాన్ని కలుగజేస్తాయి . అప్రమత్తంగా లేకపోతే పులి యేపక్కనుంచో మన మీద దూకుతుందేమో అనిపిస్తుంది . 

         కొడైకెనాల్ కి దగ్గరగా వున్న మరో అభయారణ్యం గురించి కూడా యీ వారం తెలుసుకుందాం .

       కొడైకెనాల్ కి 130 కిలోమీటర్ల దూరంలో వున్న ‘ తేక్కడి ‘ . కొడైకెనాల్ నుంచి మేం పొద్దున్నే ఆరుకి బయలుదేరి వెళ్లి సాయంత్రానికి వచ్చేసేం . ఇది ఓ ముప్పై యేళ్ల కిందటి మాట , అప్పట్లో యిక్కడ ఒకేవొక్క మూడునక్షత్రాల హోటలు వుండేది . పెరియార్ సరస్సు ఒడ్డున వున్న హోటలు , పెరియార్ సరస్సు బోటులో తిరుగుతూ సరస్సు లో నీళ్లు తాగడానిక వచ్చే జంతువులను చూడ్డం అన్నమాట . ఆ హోటల్ లో బస చేస్తే ఆ రోజంతా హోటలు బాల్కనీలోంచి పెరియార్ సరస్సు దగ్గరకి వచ్చే రకరకాల పక్షులు , నీటి జంతువులు , అడవి జంతువులను చూడ్డం చాలా బాగుంటుందని , చీకటి పడ్డ తరువాత నీటికోసం చాలా అడవిజంతువలు వస్తాయని , రాత్రంతా అడవిలో యధేఛ్చగా తిరిగే అడవి జంతువుల అరుపులు వినిపిస్తాయని చెప్పేరు . 

            ఈ అభయారణ్యం కేరళా రాష్ట్రం లోకి వస్తుంది , కేరళాలోని మున్నారు వైపునుంచి కూడా ప్రవేశ ద్వారం వుంది , ఆ వైపునుంచి కూడా వెళ్లేం , ఆ వైపున జంతువులేవీ కనిపించలేదు . కొడైకెనాల్ వైపు నయితే పెరియార్ సరస్సు వుండడం వల్ల యెక్కువ జంతువులను చూసే అవకాశం వుంటుంది .

      మరిన్ని విశేషాలు వచ్చేవారం చదువుదాం .

 

 

 

కర్రా నాగలక్ష్మి

మరిన్ని శీర్షికలు
chamatkaaram