Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

సీత చిత్రసమీక్ష

seeta movie review

చిత్రం: సీత 
నటీనటులు: కాజల్‌ అగర్వాల్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, సోనూ సూద్‌, మన్నారా చోప్రా, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, అభిమన్యు సింగ్‌, చేవెళ్ళ రవి, అభినవ్‌ తదితరులు. 
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 
సినిమాటోగ్రఫీ: శీర్షా రే 
సంగీతం: అనూప్‌ రుబెన్స్‌ 
రచన: పరుచూరి బ్రదర్స్‌ 
మాటలు: లక్ష్మీభూపాల్‌ 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర 
కథ, కథనం, దర్శకత్వం: తేజ 
నిర్మాణం: ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌

క్లుప్తంగా చెప్పాలంటే

సీత (కాజల్‌) డబ్బు మనిషి. అవసరం కోసం అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే టైపు మనిషి. రియల్‌ ఎస్టేట్‌ దందాలో కోట్లు పోతాయనే భయంతో ఎమ్మెల్యే బసవరాజు (సోనూసూద్‌)తో నెల రోజులు సహజీవనం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ పని పూర్తయ్యాక, బసవరాజుకి అందకుండాపోతుంది సీత. తన కోరిక తీర్చుకోవాలనుకునే బసవరాజు, సీతని నానా ఇబ్బందులూ పెడతాడు. ఈ క్రమంలో సీత అప్పుల్లో కూరుకుపోతుంది. ఆ ఇబ్బందులనుంచి గట్టెక్కడానికి ఎక్కడో భూటాన్‌లో వున్న తన అత్త కొడుకు రామ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) దగ్గరకు వెళుతుంది సీత. రామ్‌కి సీతే లోకం. సీతకు డబ్బంటేనే ఇష్టం. సీత తన అవసరాల కోసం రామ్‌ని వాడుకోవాలని చూడటం మామూలే. మరి సీత మనసులో రామ్‌ చోటు సంపాదించుకోగలిగాడా? సీత ప్రవర్తనలో రామ్‌ మార్పు తీసుకురాగలిగాడా? బసవరాజు నుంచి సీత ఎలా తప్పించుకుంది? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

సీత పాత్రలో కాజల్‌ చెలరేగిపోయింది. డబ్బు మీద వ్యామోహన్‌తో మనుషులు, వారి మధ్య అనుబంధాలు వంటివాటిని లెక్కచేయని కథానాయిక పాత్రలో కాజల్‌ చాలా బాగా చేసింది. నటిగా కాజల్‌ తనకు దక్కిన మంచి పాత్రని సద్వినియోగం చేసుకుంది. 
బెల్లంకొండ శ్రీనివాస్‌ తనవరకూ బాగా చేయడానికి ప్రయత్నించాడు. అయితే ఇన్నోసెంట్‌ క్యారెక్టర్‌లో పెర్ఫామెన్స్‌ పరంగా చాలా మెట్లెక్కాలి బెల్లంకొండ. సోనూ సూద్‌ విలనిజం ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ.

తనికెళ్ళ భరణి బాగా చేశాడు. కోట శ్రీనివాసరావుని పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. బిత్తిరి సత్తి కాసిన్ని నవ్వులు పూయించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదన్పిస్తాయి.

ఇలాంటి కథల్ని చాలా పాత సినిమాల్లో చూసేసినా, ఇందులో పాత్రల చిత్రీకరణ పరంగా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. కథనం ఓకే. మాటలు కొన్ని చోట్ల బాగా పేలాయి. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుండాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి తమవంతు సహకారాన్ని అందించాయి.

దీన్ని లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంగా తేజ భావించినట్టున్నాడు. మొత్తంగా కథంతా ఆమె చుట్టూనే అల్లుకున్నాడు. ఈ క్రమంలో మిగతా పాత్రలపై పెద్దగా దృష్టిపెట్టలేకపోయాడు. మాస్‌ హీరోగా పలు సినిమాల్లో నటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పాత్రని పూర్తిగా తేల్చేశాడు. అతని అతి మంచితనం బోర్‌ కొట్టించేస్తుంది. ముఖ్య పాత్రలు దాటి కథ ఇంకో వైపుకు వెళితే, పూర్తిగా తేలిపోవడం కనిపిస్తుంటుంది. టాలెంటెడ్‌ నటీనటులు వున్నా, వారిని తేజ పూర్తిగా వాడుకోలేకపోయాడు. తేజ మార్కు రక్తపాతం, హింస మామూలే. ఒకటికి రెండు క్లయిమాక్స్‌లు అన్నట్లు సాగుతుంది సినిమా. ఈ సాగతీత ప్రేక్షకుడి సహనానికి కొంత పరీక్ష పెడుతుంది. మొత్తంగా చూస్తే 'సీత' అంచనాల్ని అందుకోవడం కష్టమేననిపిస్తుంది.

అంకెల్లో చెప్పాలంటే
2.25/5

ఒక్క మాటలో చెప్పాలంటే
సీత - సక్సెస్‌ గీత దాటడం కష్టమే

మరిన్ని సినిమా కబుర్లు
Balayya hit