Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్‌జికె చిత్రసమీక్ష

ngk movie review

చిత్రం: ఎన్‌జికె 
నటీనటులు: సూర్య, సాయి పల్లవి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, దేవరాజ్‌, బాలా సింగ్‌ తదితరులు 
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ 
సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌ 
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా 
నిర్మాణం: డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ 
దర్శకత్వం: సెల్వ రాఘవన్‌ 
విడుదల తేదీ: 31 మే 2019

క్లుప్తంగా చెప్పాలంటే

నంద గోపాల కృష్ణ అలియాస్‌ ఎన్‌జికె (సూర్య) ఉన్నత విద్యనభ్యసించిన యువకుడు. కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి, ఆర్గానిక్‌ వ్యవసాయం ఎంచుకుంటాడు. ఈ క్రమంలో కొంతమంది యువకులతో కలిసి ఆ వ్యవసాయాన్ని గొప్పగా నిర్వహిస్తుంటాడు. అయితే, అనుకోని కారణాలతో స్థానిక ఎమ్మెల్యే వద్ద వ్యక్తిగత సహాయకుడిగా చేరాల్సి వస్తుంది. ఉన్నత విద్యావంతుడు అయినా, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ అనేక అవమానాల్ని ఎదుర్కొంటాడు. ఇంతకీ, ఎమ్మెల్యే దగ్గర సహాయకుడిగా ఎన్‌జికె ఎందుకు చేరాల్సి వచ్చింది? ఉన్నత విద్యావంతుడు రాజకీయ తెరపై ఎలాంటి సంచలనాలకు కారణమయ్యాడు? ఈ ప్రయాణంలో గీత కుమారి (సాయి పల్లవి), వనిత (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌)ల పాత్రల సంగతేంటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే

సినిమా మొత్తాన్నీ తన భుజాలపైన మోసేందుకు ప్రయత్నించాడు సూర్య. నటుడిగా తన సత్తా ఏంటో ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన సూర్య, ఈ సినిమాలోనూ అద్భుతమైన అభినయంతో ఆకట్టుకుంటాడు. అయితే, సూర్య పాత్రని దర్శకుడు తీర్చిదిద్దిన తీరు ఈ సినిమాకి పెద్ద మైనస్‌. తనవంతు ఎంత కష్టపడ్డా, సినిమాలో మేటర్‌ లేకపోవడంతో సూర్య కూడా ఏమీ చేయలేకపోయాడు.

హీరోయిన్లలో సాయి పల్లవికి కాస్త ఎక్కువ నిడివి దక్కితే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి చాలా తక్కువ నిడివి వున్న పాత్ర దక్కింది. సాయి పల్లవి, హీరో భార్య పాత్రలో కన్పించింది. కానీ, ఆమె పాత్రని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం కూడా బాగాలేదు. సాయి పల్లవి లాంటి అద్భుతమైన నటి సైతం, దర్శకుడి పేలవమైన చిత్రీకరణతో తేలిపోతుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి మాట్లాడుకోవడమేమీ లేదు. మిగిలిన పాత్రలూ అంతే. 
కథ పరంగా చూస్తే, కాస్త విషయం వున్నదే. కథనం విషయంలోనూ దర్శకుడు చాలా తప్పటడుగులు వేసేశాడు. మాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బావుంది. సంగీతం బాగా లేదు. పాటలు వినడానికి ఏమంత వినసొంపుగా లేవు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతంతమాత్రమే. నిర్మాణపు విలువలు బాగానే వున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరు ఓకే.

కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చేయకుండా ఓ పద్ధతి ప్రకారం దర్శకుడు వెళ్ళి వుంటే, సూర్య తన ఇమేజ్‌తో ఈ సినిమాని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళేవాడే. కానీ, దర్శకుడు ఆద్యంతం తడబడ్డాడు. సినిమాని ఎక్కడ లేపుతాడో, ఎక్కడ పడేస్తాడో దర్శకుడికే తెలియని పరిస్థితి. సాయి పల్లవి పాత్రని దర్శకుడు మలచిన తీరు చూస్తే, అసలు దర్శకుడు ఏం చెప్పి ఆమెని ఒప్పించాడో అర్థం కాక మనం జుట్టు పీక్కోవాల్సి వస్తుంది. ఓవరాల్‌గా ఎన్‌జికె పూర్తిగా నిరాశపరుస్తాడు. తెలుగులో అనూహ్యంగా మార్కెట్‌ దక్కించుకున్న సూర్య ఈ సినిమాతో మరో ఫ్లాప్‌ని తన ఖాతాలో వేసుకున్నట్లయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే..

ఎన్‌జికె - చాలా కష్టం నంద గోపాలా!   

అంకెల్లో చెప్పాలంటే
1.75/5

మరిన్ని సినిమా కబుర్లు
churaka