Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇస్మార్ట్ శంకర్ చిత్రసమీక్ష

ismart shakar movie review
చిత్రం: ఇస్మార్ట్‌ శంకర్‌ 
నటీనటులు: రామ్‌ పోతినేని, నిధి అగర్వాల్‌, నభా నటేష్‌, సత్యదేవ్‌, గెటప్‌ శ్రీను, షయాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి, పునీత్‌ ఇస్సార్‌, తులసి తదితరులు 
ఎడిటింగ్‌: జునైద్‌ సిద్దికీ 
సినిమాటోగ్రఫీ: రాజ్‌ తోట 
సంగీతం: మణిశర్మ 
నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, ఛార్మి 
నిర్మాణం: పూరి కనెక్ట్స్‌, పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ 
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ 
విడుదల తేదీ: 18 జులై 2019

క్లుప్తంగా చెప్పాలంటే.. 
శంకర్‌ (రామ్‌ పోతినేని) హైద్రాబాద్‌ పాత బస్తీకి చెందిన ఓ కిరాయి రౌడీ. భయం అంటే అస్సలు తెలియనోడు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. ఈ క్రమంలోనే కిరాయి హంతకుడిగా మారి ఓ హత్య చేస్తాడు శంకర్‌. పోలీసులు అతన్ని వెంబడిస్తారు. దాంతో, పోలీసులకు చిక్కకుండా దూరంగా పారిపోతాడు. కానీ, ఈ క్రమంలో తన ప్రాణంతో సమానమైన ప్రేయసి చాందిని (నభా నటేష్‌)ని కోల్పోతాడు శంకర్‌. ఆ తర్వాత అనూహ్యంగా పోలీసులకు చిక్కిన శంకర్‌ని, పోలీసులు ఇస్మార్ట్‌గా మార్చేస్తారు ఓ చిప్‌ సాయంతో. ఆ చిప్‌లో ఏముంది? చిప్‌ అమర్చాక శంకర్‌ పరిస్థితేంటి? అలా ఎందుకు పోలీసులు, శంకర్‌ని మార్చేశారు? తదితర ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే.. 
రామ్‌ పోతినేని అంటే, ఎనర్జీకి మారు పేరు. డాన్సులు, ఫైట్లు ఇరగదీసేస్తాడు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసెయ్యడం రామ్‌కి వెన్నతో పెట్టిన విద్య. అయితే, ఇప్పటిదాకా చేసిన పాత్రలకంటే చాలా భిన్నమైనది ఈ ఇస్మార్ట్‌ పాత్ర. అయినాగానీ, రామ్‌ తన శక్తినంతా కూడదీసుకుని, అదరగొట్టేశాడు. రామ్‌ని ఇంతకు ముందెన్నడూ మనం ఇలా చూసి వుండలేదు. ఆన్‌ స్క్రీన్‌ రామ్‌ ప్రదర్శించిన ఎనర్జీనే ఈ సినిమాకి వున్న మేజర్‌ హైలైట్స్‌లో అతి ముఖ్యమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే, రామ్‌ ప్రదర్శించిన ఆ ఎనర్జీనే సినిమాలోని చిన్న చిన్న లోపాల్నీ కవర్‌ చేసేసిందనడం అతిశయోక్తి కాదు.

హీరోయిన్లు ఇద్దరూ గ్లామర్‌కే పరిమితమయ్యారు. నభా నటేష్‌, తెలంగాణ యాసలో బాగానే సూట్‌ అయ్యింది. ఎక్స్‌పోజింగ్‌లో మాత్రం భళా అన్పించుకుంది. నిధి అగర్వాల్‌, న్యూరో సర్జన్‌ పాత్రలో కన్పించింది. నభాతో పోల్చితే ఎక్స్‌పోజింగ్‌లో నిధి కూడా ఎక్కువ మార్కులే స్కోర్‌ చేసింది. ఓవరాల్‌గా, హీరోయిన్లు ఇద్దరూ సినిమాకి సరిపడేంత.. ఇంకాస్త ఎక్కువే గ్లామర్‌ అందించారు.

సత్యదేవ్‌, పోలీస్‌ అధికారి పాత్రలో బావున్నాడు. జబర్దస్త్‌ శీను నవ్వించాడు. షయాజీ షిండే, ఆశిష్‌ విద్యార్థి తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.

కథ పరంగా చెప్పుకోవాలంటే 'మెమరీ చిప్‌' అన్న ఐడియా తప్ప, కథ మనం చాలా సినిమాల్లో చూసిందే. ప్రత్యేకించి పూరి సినిమాల్లో షరా మామూలుగా కన్పించే కథే ఇది. కథనం పరంగా పరుగులు పెట్టింది సినిమా. అలా పరుగులు పెట్టడానికి హీరో రామ్‌ ఎనర్జీనే కారణం అని నిస్సందేహంగా చెప్పొచ్చు. డైలాగ్స్‌తో పూరి తనదైన మార్క్‌ వేశాడు. పక్కా హైద్రాబాదీ యాసలో చెప్పించిన డైలాగ్స్‌ సూపర్బ్‌. సంగీతం బావుంది.. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా బాగా బలం చేకూర్చింది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఎడిటింగ్‌ పరంగా అక్కడక్కడా కొన్ని లోపాలు కన్పిస్తాయి. ఓవరాల్‌గా ఓకే. 
పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల తాలూకు ఛాయలు ఇందులో కన్పిస్తాయి. ముందే చెప్పుకున్నట్లు, చాలా సన్నివేశాల్లో డల్‌నెస్‌ని, రామ్‌ తన ఎనర్జీతో కవర్‌ చేసేశాడు. పాటలు.. ముఖ్యంగా అందులో హీరో హీరోయిన్ల డాన్సులు.. అందాల విందు.. వెరసి, ఇస్మార్ట్‌ని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళిపోయాయి. మెమరీ చిప్‌ ఐడియా కొత్తగానే వుంటుందిగానీ.. దాన్ని సరిగ్గా వాడుకోలేదు పూరి అన్పిస్తుంది. ఆ పాయింట్‌ కంటే మాస్‌ ఎలిమెంట్స్‌ మీదనే ఎక్కువగా బేస్‌ అయిపోయాడు దర్శకుడు. లాజిక్‌ గురించి అస్సలేమాత్రం ఆశించకూడదు ఈ సినిమాలో. ఓవరాల్‌గా చాన్నాళ్ళ తర్వాత ఓ మాంఛి కిక్‌ ఇచ్చే మాస్‌ మూవీ వచ్చిందన్న భావన అయితే మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. రామ్‌ ఎనర్జీ, హీరోయిన్ల గ్లామర్‌ ఎలాగూ అదుర్స్‌ గనుక, సినిమాకి రిపీట్‌ ఆడియన్స్‌ కూడా మాస్‌ సెంటర్స్‌లో గట్టిగానే వుంటారు.

అంకెల్లో చెప్పాలంటే.. 
2.75/5

ఒక్క మాటలో చెప్పాలంటే.. 
ఇస్టార్ట్‌ మహా మహా ఊర మాస్‌ శంకర్‌ 
మరిన్ని సినిమా కబుర్లు
churaka