చిత్రం: మీకు మాత్రమే చెప్తా
నటీనటులు: తరుణ్ భాస్కర్, అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతికా మిశ్రా, వినయ్ వర్మ తదితరులు
సంగీతం: శివకుమార్
సినిమాటోగ్రఫీ: మదన్ గుణదేవా
నిర్మాణం: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: విజయ్ దేవరకొండ, వర్ధన్ దేవరకొండ
దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
విడుదల తేదీ: 01 నవంబర్ 2019
క్లుప్తంగా చెప్పాలంటే..
ఇద్దరు స్నేహితులు రాకేష్ (తరుణ్ భాస్కర్), కామేష్ (అభినవ్ గోమటం) వీడియో జాకీలుగా పనిచేస్తూ, తమ ఛానల్ రేటింగ్స్ పెంచడం కోసం చిత్ర విచిత్రమైన కాన్సెప్ట్‌లు ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే రాకేష్ ఓ దర్శకుడి ఆలోచనతో హనీమూన్ బ్యాక్‌డ్రాప్‌లో 'మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా' టైటిల్‌తో ఓ వీడియో చేస్తారు. మరోపక్క, డాక్టర్ స్టెపీ (వాణీ భోజన్)తో ప్రేమలో పడ్డ రాకేష్, ఆమెతో పెళ్ళికీ సిద్ధపడతాడు. ఇక్కడే అతనికి 'మత్తు వదలరా' వీడియో సమస్యను తెచ్చిపెడుతుంది. ఇంతకీ, ఆ వీడియోలో ఏముంది.? రాకేష్ - స్టెఫీల పెళ్ళి జరిగిందా? లేదా? సంయుక్త (అనసూయ) పాత్ర ఏంటి.? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
మొత్తంగా చెప్పాలంటే..
హీరోగా తొలి సినిమానే అయినా తరుణ్ భాస్కర్ పెద్దగా ఎక్కడా తడబడలేదు. గతంలో దర్శకుడిగా విజయ్ దేవరకొండకి ఎలా నటించాలో చేసి చూపించిన తరుణ్ భాస్కర్, ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మాణంలో ఇంకో దర్శకుడి సూచనల మేరకు నటించడం విశేషమే. నటన పరంగా పెద్దగా వంకలు పెట్టడానికేమీ లేవు.
మరో పక్క కామేష్ పాత్రలో అభినవ్ గోమటం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షనగా నిలిచాడు. స్టెఫీ పాత్రలో వాణీ భోజన్ బాగా చేసింది. కామేష్ లవర్‌గా పావని గంగిరెడ్డి పాత్ర కూఆ ఆకట్టుకుంటుంది. అనసూయ తనకు దక్కిన పాత్రలో ఓకే అన్పిస్తుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
కథ పరంగా చాలా చిన్న లైన్. దాని చుట్టూ ట్విస్ట్‌లు కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌తో కథనం రాసుకున్నారు. డైలాగ్స్ బాగానే వున్నాయి. ఎడిటింగ్ మాత్రం ఇంకాస్త మనసుపెట్టి వుంటే బావుండేదన్పిస్తుంది. మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగానే వుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఆర్ట్ మరియు కాస్ట్యూమ్స్ పరంగా కూడా ఓకే. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్.. అని ప్రచారంలో చెప్పినా, ఆ కామెడీ మరీ అంతలా కడుపుబ్బా నవ్వించలేకపోయింది. ఒక్కడక్కడా నవ్వులు పుట్టినా ఓవరాల్‌గా స్లో ప్లేస్ సినిమాని ఇంకో లెవల్‌కి వెళ్ళకుండా ఆపేసింది. స్టోరీ లైన్ చిన్నది కావడం, సన్నివేశాల్ని గ్రిప్పింగ్‌గా చూపించడంలో దర్శకుడు ఆశించిన మేర విజయం సాధించలేకపోవడం.. ఇవన్నీ సినిమాకి మైనస్‌గా మారాయి. అయితే, కొన్ని సన్నివేశాలు నేటి తరం యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా కాకపోయినా, ఆయన అభిమానులు ఈ సినిమాని తమ హీరో సినిమాగా భావిస్తున్నారు. అదొక్కటీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. సెకెండాఫ్‌లో సినిమా మరీ స్లో అయిపోవడం మైనస్‌గా చెప్పుకోవాలి. ఓవరాల్‌గా సినిమా జస్ట్ ఫర్ పన్ అనుకోవచ్చు.
అంకెల్లో చెప్పాలంటే..
2.75/5
ఒక్క మాటలో చెప్పాలంటే..
మీకు మాత్రమే చెప్తా.. ఫన్ డోస్ సరిపోలేదు
|