'బాబాయ్ కథలు వింటున్నాడు..' అని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చరణ్ చెప్పడంతో, ఊహాగానాలు మొదలయ్యాయి. రాజకీయాలతో విసిగిపోయిన పవన్ కళ్యాణ్, ఇక రాజకీయాలకు బైబై చెప్పేసి, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ వార్తల మీద వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఇదిగో ఈ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా అట. అదిగో ఆ నిర్మాతతో పవన్ సినిమా అట.. అంటూ గాసిప్స్ పుట్టించేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'సత్యాగ్రహి' సినిమాని పట్టాలెక్కిస్తాడట.. అంటూ వార్త తెరపైకి వచ్చింది. ఎ.ఎమ్.రత్నం నిర్మాతగా ఈ సినిమా అప్పట్లో మొదలవ్వాల్సి ఉంది. కానీ కుదరలేదు. ఆ తర్వాత దాసరి నారాయణరావు కూడా ఈ సినిమాని నిర్మించే ప్రయత్నాలు చేశారు. అదీ కుదరలేదు.
చివరికి పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్‌లోనే ఈ సినిమాని రూపొందించాలనుకున్నాడు కానీ, అది కూడా కలిసి రాలేదు. దాంతో ఆ ప్రాజెక్టును అలా హోల్డ్‌లో పెట్టేశాడు. తాజాగా క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా ఇప్పుడు పట్టాలెక్కబోతోందంటూ ఫిలిం వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది. ఈ టాక్‌లో నిజమెంతో తెలీదు కానీ, ఇంకో పక్క చరణ్ సొంత బ్యానర్‌లో 'లూసిఫర్' మలయాళ రీమేక్‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇది కూడా బాబాయ్ కోసమే అంటూ ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కోసం ఇటు ఫ్యాన్స్, అటు సినీ ప్రముఖులు కూడా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే, పవన్ రావడంలో నిజమెంతో తెలియాల్సి ఉంది.
|