చిత్రం: తిప్పరా మీసం
నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి, బెనర్జీ, శ్రీకాంత్ అయ్యర్ తదితరులు.
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: సిధ్
నిర్మాణం: రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా
నిర్మాత: రిజ్వాన్
దర్శకత్వం: ఎల్. కృష్ణ విజయ్
విడుదల తేదీ: 08 నవంబర్ 2019
క్లుప్తంగా చెప్పాలంటే
మణిశంకర్ (శ్రీవిష్ణు) డీజేగా పనిచేస్తుంటాడు. మత్తు మందుకి బానిసగా చిన్నప్పుడే మారిపోతాడు. దాంతో అతడ్ని పునరావాస కేంద్రంలో చేరుతాడు. ఈ క్రమంలో తల్లి (రోహిణి)పై కక్ష పెంచుకుంటాడు. చికిత్స పూర్తయ్యాక బయటకొచ్చి, తల్లికి దూరంగా వుండడమే కాదు, జూదం ఆడతాడు, మత్తుకి మళ్ళీ బానిసవుతాడు. ఓ క్రికెట్ బుకీకి 30 లక్షలకు బాకీ పడ్డ శ్రీవిష్ణు, తన వాటా ఆస్తి కోసం తల్లి వద్దకు వెళతాడు. కానీ, అంత మొత్తం తన దగ్గర లేదని చెప్పి 5 లక్షల రూపాయలకు చెక్ ఇస్తుంది. దాన్ని ఫోర్జరీ చేసి, చెక్‌బౌన్స్ కేసుని తన తల్లి మీదనే పెడతాడు. మరి, ఈ కేసులో తల్లి మీద మణికంఠ గెలుస్తాడా? తల్లి బాధని అర్థం చేసుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే..
శ్రీవిష్ణు చాలామంచి నటుడు ఆ విషయం ఇప్పటికే అతను చేసిన సినిమాలతో ప్రూవ్ అయ్యింది. ఇందులో నెగెటివ్ షేడ్స్ వున్న రోల్‌లో కన్పించి మెప్పించాడు. నటుడిగా అతన్ని ఈ సినిమా మరో మెట్టు ఎక్కిస్తుంది. హీరోయిన్ నిక్కీ తంబోలీకి పెద్దగా నటించే అవకాశం లభించలేదు. శ్రీవిష్ణు తల్లిగా రోహిణి చాలా బాగా చేసింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.
కథ పరంగా చూస్తే ఇంట్రెస్టింగ్ పాయింట్‌నే టచ్ చేశాడు దర్శకుడు. అయితే, కథనం మాత్రం గందరగోళంగా తయారైంది. సాగతీతకు గురైంది. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగానే పేలాయి. మ్యూజిక్ ఓకే. బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ బాగానే వుంది. సినిమాటోగ్రఫీ బావుంది. నైట్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ విషయంలో చాలా జాగ్రత్తపడి వుండాల్సింది. నిర్మాణపు విలువలు బావున్నాయి.
ఇలాంటి సినిమాలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. శ్రీవిష్ణు లాంటి నటుడు దొరికినప్పుడు, కథని ఇంకా వేగంగా పరుగులు పెట్టించాల్సి వుంది. కానీ, కథ ముందుకు కదలడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివర్లోనే అసలు కథలో వేగం వస్తుంది. ఈలోగా, విసిగించే సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. అద్భుతమైన నటన పండించే నటీనటులు దొరికినా, ఆయా పాత్రల్ని బలంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఓవరాల్‌గా సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష లాంటిదేనని అనుకోవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే..
మీసం.. నీరసం.!
అంకెల్లో చెప్పాలంటే..
2/5
|