పుస్తకం: నవ్వుటద్దాలు
రచన: ఆచార్య తిరుమల
వెల: 60/-
ప్రతులకు: http://kinige.com/book/Navvutaddalu
తెలుగు వాళ్లను తరాల తరబడి కాకుండా కొన్నేళ్ల పాటు మురిపించి, మరిపించి, మైమరపింపచేసిన పత్రికలు కొన్నున్నాయి. అలాంటి అరుదైన పత్రికల్లో "హాసం" ఒకటి. హాస్యం, సంగీతం మేళవింపుతో పక్షపత్రికగా వెలువడే ఈ పత్రిక కోసం సాహిత్యాభిమానులు, సీనీ సంగీతాభిమానులు ఎందరో వేచి చూసేవారు. గతంలో ఎప్పుడూ చదవని, ఎక్కడా వినని తెలుసుకోదగ్గ అంశాలు, అబ్బుర పరిచే సాహితీ విశేషాలు ఎన్నో అందులో ఉండేవి. 2001 లో మొదలయ్యి అంతర్గత కారణాల వల్ల 2004 ప్రాంతంలో ఆ పత్రిక ఆగిపోయింది. అయితేనేం? ఆ పత్రికలో కొందరు సీరియళ్లుగా వ్రాసిన కొన్ని అపురూపమైన రచనలను పుస్తక రూపంలో తీసుకొచ్చి పుణ్యం కట్టుకుంది "హాసం ప్రచురణలు" సంస్థ. లేకపోతే రేడియోలో ప్రసారమైన నాటకంలాగ, టీవీలో వచ్చి వెళ్లిపోయిన సీరియల్ లాగ అనంతంలో కలిసిపోయి ఉండేవి "హాసం" పత్రికలో అచ్చైన మంచి విషయాలన్నీ. ఆసక్తిగా ఏ కొందరో పత్రికలోంచి పేపర్ కటింగులు దాచుకోవచ్చేమో గాని పుస్తకంగా తీసుకొస్తే తప్ప జనబాహుళ్యంలోకి శాశ్వతంగా చేరదు కదా!
సరే..ఇక ఈ పుస్తకం విషయానికి వద్దాం. ఆచార్య తిరుమల గారు మంచి పద్య కవి. అనేక పద్యకావ్యాలు, గేయ కావ్యాలు, నాటికలు, నృత్యనాటికలు, వ్యాసాలు ఇలా ఎన్నో వ్రాసారు. పద్యం మీద మమకారం, సాహిత్యం మీద మక్కువ, సంస్కృతం మీద ఇష్టం ..వెరసి ఈయన అనేక విషయాలు సేకరించారు. సేకరించిన ఆ మధువునంతా "హాసం" పత్రికలో తేనెపట్టు కట్టారు. ఆ తేనెను పిండి "హాసం ప్రచురణలు" వారు మనకిలా ఈ పుస్తక రూపంలో అందించారు.
సాహిత్య వ్యాసాల రూపంలో ఉండే ఈ పుస్తకంలో ఒక్కో పేజీలో ఒక్కో వజ్రం దాగి ఉంది. అంటే వజ్రంలాంటి చెక్కుచెదరని, కాలదోషం పట్టని పద్యరాజం అన్నమాట. అన్నీ చెప్పను కానీ ఉదాహరణకి కొన్ని చెప్పి ఊరుకుంటా.
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఏ ఐ ఓ ఔ అం అః అక్షరాలన్నీ పొదిగి బసవేస్వరుడి మీద పాల్కురికి సోమన వ్రాసిన పద్యం మీకు తెలుసా? నేనైతే ఈ పుస్తకంలోనే తొలిసారి చూసాను.
అమిత యశస్క ఆద్యయన ఇద్రుచి ఈశ్వర ఉగ్ర ఊర్జిత
క్రమ ఋషభాంక ౠజిహర స్థిత స్మిత ఏకరుద్ర ఐం
ద్రమహిత రూప ఓమితి పదద్యుతి ఔర్వలలాట అంబికా
సమరసభావ అఃకలిత వర్ణనుతం బసవేశ పాహిమాం
ఇంతటి అరుదైన పద్యం సాహిత్యంలో మరో చోట ఎక్కడా లేదని ఈ పుస్తక రచయిత చెప్పారు.
అలాగే అల్లసాని పెద్దన ఉర్దూ పదాలతో చెప్పిన చాటు పద్యం విన్నారా? ఈ పుస్తకంలో 27 వ పేజీలో ఉంది. ఒక్క క్షణం అల్లసాని పెద్దనేవిటి? ఉర్దూ ఏమిటి? అని అనిపించడం సహజం. అయితే అప్పటికే ముస్లిం రాజులు పాలిస్తున్న దేశం మనది. అప్పటికి ఎందరో తెలుగువారు ముస్లిం పాలకుల నీడలో ఉన్నవారే. కనుక భాషా పరిచయం వల్ల నేడు జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు తమిళంలోనూ, హిందీలోనూ, ఇంగ్లీషులోనూ పద్యాలు వ్రాసినట్టు సరదాగా పెద్దన కూడా వ్రాసాడన్నమాట!
చిన్న పిల్లలు సరదాగా ఆడుకునే "కాళా గజ్జి కంకాళమ్మా..." అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? 20 వ పేజీలో ఉంది.
అలాగే ఒక చమత్కార పద్యం-
కిం వాససైవం న విచరణీయం
వాసః ప్రధానం ఖలు యోగ్యతాయాః
పీతంబరం వీక్ష్య దదౌ తనూజాం
దిగంబరం వీక్ష్య విషం సముద్రః
వస్త్రధారణ అనేది ఈ లోకంలో చాలా ప్రధానమైనది. పీతాంబరం కట్టుకుంటాడు కాబట్టి విష్ణువుకి తన కుమార్తె లక్ష్మినిచ్చాడట సముద్రుడు. మరి అదే సముద్రుడు దిగంబరుడైన శివుడికి మాత్రం విషం ఇచ్చాడట.
అందుకే ఇంగ్లీషులో కూడా అంటుంటారు. "ఈట్ ఫర్ యువర్సెల్ఫ్, బట్ డ్రెస్ ఫర్ అదర్స్" అని.
ఇక ఈ పద్యం సంగతి తెలుసుకుని విద్యుద్ఘాతానికి సిధ్ధం కండి-
"రాధా నాధా తరళిత
సాధక రధ తా వరసుత సరస నిధానా
నాధాని సరసత సురవ
తాధర కధ సా తళిరత ధానా ధారా"!
ఈ పద్యం ముందునుంచి వెనక్కి, వెనకి నుంచి ముందుకి..ఎలా చదివినా ఒకలాగే ఉంటుంది!! మరో పద్యం ముందునుంచి చదివితే ఒక కథ, వెనుక నుంచి చదివితే మరో కథ చెప్పినట్టుంటుంది. అదేమిటో ఇక్కడ చెప్పను..పుస్తకంలో చదువుకోండి.
అలాగే మహాకావి శ్రీ శ్రీ వ్రాసిన త్ర్యక్షరి (మ, న, స అనే మూడే అక్షరాలతో) కందం ఇలా ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో.
ఇలా ఉదహరిస్తూ పోతే మొత్తం పుస్తకాన్ని ఇక్కడ వ్రాసేసే ప్రమాదం ఉంది. కనుక ఇక ఆపేస్తున్నా.
అనేకమంది సాహితీ పిపాసులను ఊరిస్తూ ఈ పుస్తకం ఇప్పటికి మూడు ప్రచురణలు పూర్తి చేసుకుంది. ఆలశ్యం చేయకుండా ఈ పుస్తకాన్ని కొని పెట్టుకోండి. ఈ పుస్తకాన్ని ముందు చదివి ఆశ్వాదించండి, తర్వాత చదివి గుర్తుపెట్టుకోండి, ఆపైన మీ తర్వాతి తరాల వారికి అందించండి. ఆచార్య తిరుమల గారి కృషికి, హాసం ప్రచురణల వారి బాధ్యతకి నమస్కరిస్తూ..
|