Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వేంకట వరప్రసాదరావు

saahiteevanam
అల్లసాని పెద్దన విరచిత స్వారోచిష మనుసంభవము

(గత సంచిక తరువాయి)


ఆ స్త్రీ తన గాథను స్వరోచికి వివరించడం మొదలుబెట్టింది. 'తలపాగాలాగా ప్రేవులు చుట్టుకుని, నల్లని శరీరంనిండా మాంసపంకిలమును పూసుకుని, పుర్రెలో నెత్తురు తాగుతూ, మూడుపంగల ఈటెను పట్టుకుని, నిలువునా పెరిగిన తాటిచెట్టులాంటి శరీరముతో, మిడిగుడ్లేసుకుని మూడురోజులనుండీ నా ఉసురు తీయడానికి అసురుడొకడు వెంటబడి నన్ను తరుముతున్నాడు. ఆపద సంభవించినపుడు 'దుర్బలస్య బలం రాజా' అన్నట్టు ధరణీ నాయకులకు ఆర్తరక్షణం విధి కదా, అందుకని నిన్ను శరణు వేడుకుంటున్నాను మహారాజా!

మరుదశ్వ పుత్త్రి కిందీ
వరాక్ష గంధర్వరాజువలనఁ బొడమితిన్ 
నరవర! వెలసితిఁ గళలం
దు రమించుటఁ జేసి భువి మనోరమ యనఁగన్

మరుదశ్వుని కుమార్తెకు ఇందీవరాక్షుడనే గంధర్వరాజువలన జన్మించాను నేను. కళలయందు రమించుటవలన 
మనోరమ యని పేరు కలిగింది నాకు. రాపిడివలన భుజములకున్న ఆభరణముల మణులు రాలేట్లు విద్యాధరులు 
గారాముగా నన్నెత్తుకుని లాలించేవారు.

దేవ! పారర్షి పట్టి కళావతియును
నల్ల మందార విద్యాధ రాత్మజన్మ
యగు విభావసియును నాకుఁ బ్రాణసఖులు 
వారు నేనును నొకనాఁడు గారవమున

దేవా! పారర్షి కుమార్తె  కళావతి, మందారుడు అనే విద్యాధరుని కుమార్తె విభావసి నాకు ప్రాణ స్నేహితురాళ్ళు. ఒకనాడు 
వారూ, నేనూ..

నెత్తమ్ము లేకొండ నెత్తమ్ములం దాడు / విద్యాధరీకోటి విటులతోడ
నెచటిగాడ్పులఁ బుట్టు విచికిలామోదంబు / శబరకాంతల గుట్టు సళ్ళఁబెట్టు
నెన్నగేంద్రపుఁ జఱుల్ మిన్నంది పెన్నంది / కోరాడుఁ దనగుబ్బ కొమ్ము లొడ్డి
యెం దుండు గురివెంద పందిళ్ళ పూఁదేనె / జడి యిందు శిలలందు జాలువాఱు

నట్టి కలధౌతశిఖరిఁ బుష్పాపచయము
సేయువేడుకఁ బొదరిండ్ల చాయలందుఁ 
దిరుగుచుండి  యొకానొక దెసఁ దృణంబు
దళముగా వాత మొలచిన బిలమునందు

ఏ కొండ పూపొదరిండ్లలో విద్యాధరస్త్రీలు విటులతో ఆటలాడుకుంటారో, ఎచటి వాయువులు శబరకాంతల 
చాటుమాటు చన్నులపై చక్కిలిగింతలు పెడతాయో, ఆకాశాన్ని అంటే ఏ కొండ చరులను మహానంది తన 
కొమ్ములతో కోరాడుతుందో (కైలాస పర్వతశిఖరమన్నమాట!) ఎక్కడి గురివెంద పందిళ్ళనుండి ధారలుగా 
పూల తేనె ఇందుకాంత శిలలపై కారుతూ ఉంటుందో, అటువంటి మంచుకొండ శిఖరం మీదనున్న పూలవనంలో 
పూలు కోసుకొనడానికి వెళ్లి ఆ పొదరిళ్ళలో నేనూ, నా చెలికత్తెలైన కళావతి, విభావసి విహరిస్తూ గడ్డితో 
మూయబడిఉన్న ఒక బిలాన్నిచూశాము.

ఆ బిలంలో ఊసరవెల్లిలాగా నరాలు తేలి, మీసాలు, గడ్డము, జడలు, శరీరము, కన్నులు ధూళితో కప్పబడి,
వార్ధక్యం అలుముకుని, రోమములతో అల్లుకుపోయిన ఒక దూదికుప్ప లాంటి జీర్ణమైపోయిన శరీరంకల 
ఒక మునిని చూశాము. ఇతని ముఖం ఎక్కడుంది? కన్నులేవి? చెవులెక్కడ? అని పరిహాసంగా పలుకుతూ 
బాల్యచాపల్యంతో ఆతనిని పట్టుకున్నాను నేను.

ధ్యాన స్తిమితుం డగు న
మ్మౌని మదీయాంగుళీ విమర్శనములచే 
మే నెఱిఁగి తొంటి యనుసం
ధానము చెడి కన్ను దెఱచి దారుణ ఫణితిన్

ఆతని ముఖాన్ని నేను పట్టుకుని తడమగానే నా వ్రేళ్ళు తగిలి, ఆతనికి స్పర్శ తెలిసి, తన ధ్యానము చెడిపోయి,
కనులు తెరిచి, దారుణమైన కోపాన్ని పొందాడు!

(కొనసాగింపు వచ్చే సంచికలో) 
 
మరిన్ని శీర్షికలు
gunde ootalu(naaneelu)