Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka!

ఈ సంచికలో >> సినిమా >>

హేమచంద్ర , శ్రావణ భార్గవి తో జుగల్ బందీ ఇంటర్వ్యూ

Interview with Hemachandra & Sravana Bhargavi

కాపురం సూపరెహే - మిగిలినవన్నీ పిచ్చ లైట్ లే

జూన్ 2 ఇళయరాజా పుట్టిన రోజు మాత్రమే కాదు. హేమచంద్ర బర్త్ డే కూడా...

కూల్ కూల్ హేమచంద్ర కి బబ్లీ బబ్లీ శ్రావణ భార్గవి తో పెళ్ళయ్యాక వస్తున్న మొట్ట మొదటి బర్త్ డే ఇది.

ఆ సందర్భంగా వారిద్దరితోనూ విడివిడి గానూ, కలివిడి గానూ, హడావుడి గానూ సరదా సరదాగా జరిపిన స్పెషల్ ఇంటర్ వ్యూ ఇది :

"పెళ్ళయ్యాక వస్తున్న మొదటి బర్త్ డే్ ఇది. ఈ విషయం మీ ఇద్దరిలో ఎవరు ఎవరికి ఫస్ట్ చెప్పారు? "
" ఇద్దరమూ కాదు. మా అమ్మ ఫస్ట్ చెప్పింది. అప్పుడనుకున్నాం - 'అవును కదా' అని "

" సో ... మంచి గిప్ట్ మీ ఆవిడ దగ్గిర్నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తున్నావా ?"
" కచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే  గిప్ట్ లివ్వడంలో తను టాప్.  భలేగా ప్లాన్ చేస్తుంది కూడా. అందుకే నేనెంత ఎక్స్ పెక్ట్ చేస్తున్నానో తను అంతకు మించి డబుల్ సర్ ప్రైజ్ ఇస్తుంది."

" మీ ప్రేమాయణం నడిచే రోజుల్లో తను ఫస్ట్ గిప్ట్ ఏమిచ్చింది ?"
"కూలింగ్ గ్లాసెస్ "

" ఇప్పుడు నువ్వు చెప్పమ్మా .. కూలింగ్ గ్లాసెసే ఎందుకిచ్చావ్ ? మాటిమాటికీ కూల్ అంటుంటాడనా ?"
"జోక్ బావుంది గానీ అసలు విషయం అది కాదు. తనకి కూలింగ్ గ్లాసెస్ అంటే ఇష్టం. ఎక్కువగా కొంటుంటాడు.  తనకిష్టమైనది ఇస్తేనే ఆనందిస్తాడు కదాని .. "


" మరి ఫస్ట్ బర్త్ డే కి ఏం ఇచ్చింది ?"
" అదొక వండ్రఫుల్ సర్ ప్రైజ్ . నా ఫ్రెండ్స్ అందరి దగ్గరా నా గురించి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని, నా ఫొటోలతో జతపరిచి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయించి, అదంతా ఓ డీవీడీ లో కాపీ చేసి,  హొటల్లో స్క్రీన్ అదీ అరేంజ్ చేయించి చూపించింది. థ్రిల్లయిపోయాను."

" మరి నీ నుంచి ఏ గిఫ్ట్ అయినా తనకి ఏదైనా ఓ అకేషన్ లో  ...? "
" ఉంది. ఓ చిన్న పర్స్ ఒకటి కొనిచ్చాను. అప్పుడు థాంక్స్ చెప్పింది కానీ - మళ్ళీ ఇంతవరకూ ఆ పర్స్ ని తన చేతిలో చూడలేదు. అర్ధమైపోయింది - తనకు నచ్చలేదని. అప్పట్నించి ఓ ఎగ్రిమెంట్ కి వచ్చేశాం. తనకు నచ్చింది తను కొనుక్కుంటుంది - నేను ఆ ఎమౌంట్ పే చేసేస్తాను."

"పెళ్ళయ్యే దాకా ఎన్ని గిఫ్ట్లు నడిచుంటాయి మీ మధ్య ... ?"
"లెక్క లేదు . తనకి ల్యాప్ టాప్ లంటే చాలా ఇష్టం. మంచి ల్యాప్ టాప్ కొనిచ్చాను. తనకి షాపింగ్ అంటే ఇష్టం ... అల్ప సంతోషి... "

"ఏంటీ  ... షాపింగ్ చెయ్యడం అల్ప సంతోషమా ?"
 "నిజమే అంకుల్ ... తనకున్న ఇంట్రస్ట్ అదొక్కటే. పైగా తీరిక దొరికినప్పుడేగా వెళుతుంది..  ఆ రకం గా అల్ప సంతోషేగా ? "

"బావుంది సపోర్ట్ ...అందుకే ఈ మధ్య హైదరాబాద్ లో షాపింగ్ మాల్స్ తెగ పెరిగిపోతున్నాయి "

" ఇది వినండి. తను షాపింగ్  చేస్తున్నప్పుడు నాకేదైనా  ఫోన్ వచ్చి  ఓ పది నిముషాలు మాట్లాడి ఇటు తిరిగి చూస్తే తనుండదు.  వెతగ్గా వెతగ్గా వెతగ్గా ఎక్కడో దొరుకుతుంది - షాపింగ్ చేస్తూ.  అంత ఇష్టం షాపింగ్ అంటే ... "

" అదన్న మాట తన అభిరుచి ... ఇక రుచుల విషయంలో మీ టేస్ట్ లు కలిశాయా ?"
"అస్సలు కలవ్వు ... తనకు సౌతిండియన్ ఫుడ్ అంటే ఇష్టం.  నాకు నార్తిండియన్ ఫుడ్ ". తను పులిహోర తిందాం అంటుంది  నేను రోటీ, పాలక్ పనీర్ అంటాను. "


" ఆ టాపిక్ మీద యుద్ధాలు జరిగిపోతుంటాయా ? "
"లేదు ... ఇద్దరం భలేగా కాంప్రమైజ్ అయిపోతూ వుంటాం. సరే నీక్కావలిసింది నువ్వు తెప్పించుకో నాక్కావలసిన పిజ్జాలు నేను తెప్పించుకుంటా అంటాను. ఆలా మా మధ్య వార్ లు చాలా పీస్ ఫుల్ గా వుంటాయి "

" పెళ్ళి అయ్యాక చాలా మందికి ... ముఖ్యం గా ఆడవాళ్ళకి అవకాశాలు తగ్గిపోతూ వుంటాయి. శ్రావణభార్గవి కెరీర్ మీద పెళ్ళి ఎఫెక్ట్ ఎంత వరకు పడింది ?"
" నిజానికి పెళ్ళి అయిన తర్వాతే తనకి అవకాశాలు ఇంకా ఎక్కువయ్యాయి"

" ఓకే .. చందూ .. తను పాటలు కూడా రాస్తుంది కదా నీ మ్యూజిక్ డైరెక్షన్ లో తనతో పాటలు రాయించే ఉద్దేశం ఏదైనా వుందా ? .."
" అసలిప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ అవసరమా అంటుంది. పాడాల్సిన పాటల ఆఫర్లే బోలెడున్నాయి కదా అంటుంది."

" తను అనడం సరే ... ఉద్దేశం వుందా లేదా ?"
" ఎందుకుండదూ ? తను ఓ పది నిముషాలు కుదురుగా వుంటే కదా ... ఎప్పుడూ ఏదో సర్దుతూ వుంటుంది. అసలు లేవగానే రూమ్ అంతా సర్దాక గాని బైటికి రాదు. వచ్చాక బైట కూడా ఏదో సర్దుతూ వుంటుంది. సడన్ గా ' అర్రే ...  రికార్డింగ్ ... ' అంటూ పరుగెడుతుంది "

" ఏమ్మా నీ సంగతేంటి ... నీకు పాటలు రాసే అలవాటుంది కదా ... ఇప్పుడు రాయట్లేదా ?"
" నాకు రాయాలనిపిస్తే , తన్నుకు వస్తే , రాయడమే తప్ప ఎవరైనా అడిగితే రాసే అలవాటు రాలేదు బాబాయ్ గారూ ..   బద్రినాద్ లో ఇంగ్లీష్ పాటైనా, ఈగ హిందీ వెర్షన్ మక్కీ లో లవ లవ సీనేమే లావా పాటైనా, మరో హిందీ సినిమా  పేరు గుర్తులేదు ... మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ ... అందులో రాసిన పాటైనా అన్నీ అలాటివే ... ఈ హిందీ పాట నేనే పాడాను "

" చందూ .. పవన్ కళ్యాణ్ ని, జూనియర్ ఎన్టీయార్ ని ఇలా అందర్నీ ఇమిటేట్ చేస్తుంటావు కదా ...అలా శ్రావణ భార్గవి ని ఎప్పుడైనా ఇమిటేట్ చేశావా ? "
" చాలా సార్లు చేశా .. ఒకే విషయం తిప్పి తిప్పి మూడు నాలుగు సార్లు చెప్పడం తనకి అలవాటు. ఆ హ్యాబిట్ నే  ఇమిటేట్ చేస్తుంటా ... "
" ఫర్ ఎగ్జాంపుల్ ... "
" (ఇమిటేషన్ స్టార్ట్స్ ) 'కాదూ .. ఇంటర్ వ్యూ కోసం రాజా గారు ఫోన్ చేశారు కదా .. మనం వుండే టైమేదో క్లియర్ గా చెప్పొచ్చు కదా .. లేదా ఒక టైమ్ అనుకుని ఆ టైమ్ కి మనమే ఫోన్ చేసి ఇంటర్ వ్యూ ఇవ్వొచ్చు  కదా ... ఆయన  మనకెప్పట్నించో తెలుసు కదా ... ఇంటర్ వ్యూ ఇవ్వక పోతే బాధ పడతారు కదా ... టైమిచ్చి రెస్పాండ్ కాకపోవడం కరెక్ట్ కాదు కదా ... ఇంటర్ వ్యూ ఇవ్వొచ్చు కదా' ..(ఇమిటేషన్ ఎండ్స్) ఇదిగో ఇలా వుంటుంది "

" మీ ఇద్దరి పద్ధతులు, అలవాట్లు, అల్లర్లు వీటి మీద మీ అమ్మ రియాక్షన్ ఏంటి ? "
" అమ్మకి నా అల్లర్లు అలవాటై పోయాయి.  ఇఫ్పుడు తను కూడా అలవాటై పోయింది "

"ఏమ్మా .. మీ అత్తగారి సంగతేంటి ? "
"మా అత్తగారు ఫుల్ టూష్ హ్యాపీ ... 'ఎంజాయ్ చెయ్యండ్రా ... అలాగే అవకాశాలు వస్తే ఒదులుకోవద్దు ... ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఎంజాయ్ చేస్తారు ... ఇంకెప్పుడు గడిస్తారు ... ? ఇవన్నీ లేకపోతే అవకాశాల్లేనప్పుడు  ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ' అంటూ ఎంకరేజ్ చేస్తారు "

"మరి మీ పేరెంట్స్ ఏవంటున్నారు చందు గురించి.. "
"వాళ్ళకైతే ఇప్పుడు నా కన్నా చందూ యే ఎక్కువ . సూపర్ సింగర్స్ ఫైనల్ లో తను విన్ అవ్వాలని  మొక్కుకున్నారట కూడా "

 "ఏంటి చందూ ... అంతా పాజిటివే చెబ్తోంది. నీలో నెగిటివ్ పాయింట్సే లేవా ? "
 "ఎందుకు లేవూ ... నాకు త్వరగా కోపం వచ్చేస్తూ వుంటుంది. "

 "అప్పుడు తనెలా మ్యానేజ్ చేస్తుంది ? "
 "పిచ్చ లైట్ లే అంటుంది. ఇంకేం అంటాం.. దెబ్బతో కూల్ "

 "ఇది వరకు తనకు ఏదైనా నచ్చితే 'సూపరెహే' అనేది. ఇప్పుడిలా అంటోందన్నమాట .. సరే ... ఏమ్మా చందూలో నెగిటివ్ పాయింట్సే లేవా? "
 "  ఎందుకు లేవు . తనకి ఒకసారి నచ్చేది ఇంకోసారి నచ్చదు. 'మొన్న బాగుందన్నావుగా' అంటే  'అవును అప్పుడు బావుంది ఇప్పుడు బాగులేదు' అంటాడు."

" మరి నా గురించి కూడా రేపు ఇలాగే అంటావా అని అడగలేక పోయావా ? "
 " అదీ అయింది . ' ఏమో అంటానేమో ... అలా అనే చాన్స్ వుంటుందేమో' అని అంటాడు దీనంగా ఫేస్ పెట్టి "

 " అప్పుడు నీ రియాక్షనేంటి ? "
 " ఏముంది ' పిచ్చ లైట్ లే' అని నవ్వేసుకుంటాను "

" బావుందీ సెల్ఫ్ హిప్నాటిజం ... మన అనుకునే వాళ్ళ దగ్గర మనం చేసుకునే ఈ రకం సెల్ఫ్ హిప్నాటిజం ని అప్నాటిజం అని అనుకుంటారట. అద్సరే .. మీ ఇద్దరికీ ముద్దు పేర్లు లేవా ? "
" లేకేం ... తనని ఇంట్లో చంటి అంటారు. నన్ను మా ఇంట్లో శ్రావూ అంటారు "

" అది కాదు . మీ ఇద్దరూ ఒకరినొకరు పిలిచుకునే ముద్దు పేర్లు ? "
" అమ్మా ... అవెందుకు చెప్తాం .. చెప్పం గాక చెఫ్పం "

" అదేంటి ... జమున గారు ఇంత పెద్ద అయినా చక్కగా సిగ్గు పడుతూ మొన్నో ఇంటర్ వ్యూ లో  'మా ఆయన నన్ను డాలీ అంటారు' అని చెప్పారు.
" ఆవిడ చెప్పినా సరే మేం చెప్పం "

" పోనీ చందూ బర్త్ డే కి ఏం గిఫ్ట్ ప్లాన్ చేశావో అదైనా చెప్తావా ? "
" అది కూడా చెప్పను "

" ఓకే .. ఆ రోజు ఇద్దరూ ఏం ప్లాన్ చేసుకుంటున్నారో చెప్తారా ? "
" చెప్పం గాక చెప్పం "

" కనీసం ఫోన్ లోనైనా దొరుకుతారా ? "
" అది కూడా చెప్పం గాక చెప్పం "

" సరే ... ఇంకేం చెప్తారు ? "
" ఇంకేం చెప్పం గాక చెప్పం "

" ఓకే దెన్ బై ... బెస్టాఫ్ లక్ టు బెటరాఫ్స్"

రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam