మహబలిపురం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మహబలిపురం.

గుహాలయిల మహాబలిపురం.
7 వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహాబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
ఇదే భారతదేశపు తొలి లైట్ హౌస్ అంటారు.1200 సంవత్సరాలకుపూర్వం పల్లవరరాజైన మహేంద్రవర్మ మహాబలపురం,దళవానూరు,మామండూరు, తిరుచునాపల్లి మొదలగు ప్రాంతాలలో కొండసానువులు తొలిపించి ఆలయాలునిర్మించాడు.600-750 మధ్యకాలంలో పల్లవులు ఈప్రాంతిన్ని అభివృధ్ధిపరచారు.పాండవుల ఏకశిలారధాలు అద్బుతంగా మలచారు. ఇక్కడ నిర్మించిన తొమ్మిది గుహాలయాలు ఉన్నాయి.మహిషాసురుని కాళి సంహారించే దృశ్యం,వరిహామంటపం,గోవర్ధనమటపం,వంటి అతిసుందరమైన శిల్పాలు ఉన్నాయి అద్భుతమైన శిల్పకళా స్థావరం అయిన మామల్లాపురం లేదా మహాబలిపురంలో చూడవలిసిన ప్రదేశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు.
మొదటివి మండపాలు, గోపురాలు, లైట్ హౌస్, బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం. వీటిని చూడటానికి, ఫొటోలకి రుసుము లేదు పూర్తిగా ఉచితం. రెండవది అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు. ఇవి చూడటానికి, ఫొటోలకి టికట్ తీసుకోవాలి. మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి. సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది. ఇది కూడా చాలా దగ్గరే. బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.
ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే ఉంది. ఇది ఒక విచిత్రం. ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కాసే కాయలు అరచేయ్యంత పరిమాణం కలిగి వుంటాయి.
మహాబలిపురం బీచ్ అందమైనది. సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు. ఈ బీచ్ లోని అలలు చాల భయంకరంగా వుంటాయి. బీచ్ లో సముద్రపు లోతు ఎక్కువ. గవ్వలతో చేసిన అందమైన వస్తువులు ఇక్కడలభిస్తాయి. బీచ్ తీరం వెంబడి దొరికే రకరకాల వేడి వేడి సీఫుడ్ అత్యంత రుచికరంగా ఉంటుంది. ఇక్కడ భొజనం హోటళ్ళకి, లాడ్జిలకి కొరతే లేదు. కాని రాత్రి సమయాలలో ఉండేటందుకు అనువైన సౌకర్యాలు కలిగిన ప్రాంతంకాదు. భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు.
ఇది పూదత్తాళ్వార్ జన్మించిన స్థలము. ఆళ్వార్లు మంగళాశాసనము చేసిన సన్నిధి శిథిలమై సముద్రతీరమున ఉంది. ఇది శిథిలము అయినందున కొంత దూరములో మరియొక సన్నిధిని నిర్మించారు. స్వామి స్థలశయనముగా సేవ సాయించు క్షేత్రము ఇదియొక్కటియే. పుండరీకమహర్షి తామర పుష్పములతో స్వామిని అర్చించాలని వెళ్ళిన సమయంలో స్వామి ఒక వృద్ద బ్రాహ్మణుని రూపముతో వచ్చి ఆకలిగానున్నది, ఆహారం కావాలని అడిగాడు. అంతట పుండరీకుడు ఆహారమును తీసికొని వచ్చుటకు వెళ్ళాడు. ఇంతలో స్వామి ఆ తామరపుష్పములను అలంకరించుకొని పుండరీకమహర్షి తలచిన రూపముతో శయనించాడు. మహర్షి తిరిగివచ్చి స్వామిని సేవించి ఆశ్చర్యపడి వారిని స్థలశయనర్ పిలిచాడు. తరువాత స్వామికి స్థలశయనర్ అని పేరు వచ్చింది. ఈక్షేత్రమునగల జ్ఞానపిరాన్ (వరాహస్వామి) సన్నిధి ఉంది. ఇచ్చట స్వామి మేనిలో తాయార్లు కుడివైపున ఉండుటచే ఈసన్నిధికి వలనెంజై (కుడి హృదయం) అనిపేరు. ఇది అతిమనోహరమైన శిల్పసంపదతో అలరారుతున్న క్షేత్రము. తిరుమంగై ఆళ్వారు ఈక్షేత్రస్వామిని కీర్తించుచుండ తిన్ఱనూర్ భక్తవత్సలస్వామి ప్రత్యక్షం అయినందున భక్తవత్సలస్వామి ఇక్కడి నుండి మంగళాశాసనము చేసారని కథనాలు వివరిస్తున్నాయి.సముద్రతీరంలో ఉండటంవలన తీరదేవాలయాలుగా ప్రసిధ్ధిచెందాయి.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 

మరిన్ని వ్యాసాలు