కొడవటిగంటి కుటుంబరావు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కొడవటిగంటి కుటుంబరావు.

కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28 - 1980 ఆగష్టు 17), ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. కొకు గా చిరపరిచితుడైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు.
కొకు గుంటూరు జిల్లా, తెనాలి లోని ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. చిన్నవయసులోనే 1914లో తండ్రీ, 1920లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేత వయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసాడు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసాడు. 1925లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన పెళ్ళి జరిగింది.1925 నుండి 1927 వరకు గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో మహారాజా కళాశాల, విజయనగరంలో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన నాస్తికునిగా మారిపోయాడు.
1929లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. 1930లో కొకు తొలిరచన సినిమా ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటి కథ ప్రాణాధికం గృహలక్ష్మి మాసపత్రికలో అగ్రస్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. 1931లో కొంతకాలం పాటు వరంగల్లులో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. చక్రపాణి, పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి యువ పత్రికను ప్రారంభించాడు.
1939లో భార్య పద్మావతి మరణించింది. 1940 - 42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేసాడు. ఆ కాలంలో జరుక్‌శాస్త్రి (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలోపనిచేసాడు. 1942 జూలై నుండి 1943 జనవరి వరకు సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. 1944లో ఒడిషా జయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.
మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగిన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో 1945లో వరూధినిని మూడవ పెళ్ళిచేసుకున్నాడు. 1948లో మూణ్ణెల్లపాటు బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలోఎకౌంట్సుక్లర్కుగాపనిచేసాడు. 1948లో ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. 1952, జనవర1 నుండిచనిపోయేవరకూ చందమామలో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితికి రావటానికి ఎంతో కృషి సలిపాడు.