జానపద గేయాల రాజు కొసరాజు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

జానపద గేయాల రాజు  కొసరాజు .
జానపద గేయాల రాజు కొసరాజు. 1905లో బాపట్ల తాలూకా కర్లపాలెం మండలం
చింతాయపాలెంలో లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారుకొసరాజు. మద్రాసు చేరిన వీరు యక్షగానాలు,వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించారు.
తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేకపీఠం. ఆ రోజుల్లోని చాలా చిత్రాలు కొసరాజు ముద్రని బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మిళాయించిన పాట ఒకటి చిత్రంలో వుండాలి, అది రాఘవయ్య చౌదరిగారు రాయాలి - అని అప్పట్లో సినిమా జనాలకు ఒక సూత్రం ఉండేది. ఆ సూత్రానికి తగ్గట్టుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళభరితం చేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది కొసరాజు రాఘవయ్య చౌదరి. ఏరువాక సాగాలోరన్నో… అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ… అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం కొసరాజు ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. పనిగట్టుకుని హాస్యాన్ని పాటల్లోకి ప్రవేశపెట్టినవాడు కొసరాజు.అంతే కాకుండా ఆయన హాస్యాన్ని సాంఘిక విమర్శకు కూడా బాగా వాడుకున్నాడు.
"మా సొంత వూరు అప్పికట్ల. అక్కడ ఒకే వీధిబడి వుండేది. ఆ బడిలో నాలుగోతరగతి తర్వాత ఇంక పై క్లాసులేదు. అంచేత, నేను నాలుగు చదివేసినా, ఊరికే కూచోక, మళ్ళీ నాలుగు చదివాను అని చెప్పాడు కొసరాజు ఒక ఇంటర్వ్యూలో . నాలుగోతరగతి తప్పితే మళ్లీ చదవడం వేరు, పాసై మళ్లీ చదవడం వేరు. అలా, ‘డబల్‌ ఎమ్‌.ఏ.’లాగా, ఆయన చిన్నతనంలోనే ‘డబల్‌ నాలుగు’ డిగ్రీ పొందారు. ఐతే, ఆయన ఊరుకోలేదు. తనతల్లి మేనమామ వెంకటప్పయ్యగారు గొప్ప పండితులు. వంశంలో వున్న ఆ సాహితీరక్తం - రాఘవయ్య లోనూ ప్రవహించి, ఉత్తేజపరిచింది. ఆ ఉత్సాహంతో వీధిబడిలో వుండగానే ఆయన బాలరామాయణం, ఆంధ్రనామసంగ్రహం వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి నుండి అచ్చ తెలుగు నుడికారము, తర్కవితర్కాలు, తెలుగు భాషా సౌందర్యము తెలుసుకున్నాడు.
కొడముది నరసింహం పంతులుగారని, పండితుడూ, విమర్శకుడూ ఆ గ్రామంలోనే వుండేవారు. కొసరాజుకు కొండముది వారి ప్రోత్సాహం లభించింది. నరసింహంగారు భజనపద్ధతిలో రామాయణం రాసి, ప్రదర్శనలు ఇప్పించేవారు. ఆ బాల ప్రదర్శనలో పాల్గొన్న రాఘవయ్య రాముడి పాత్రధారి. అప్పటికే ఆయన కంఠం లౌడ్‌ స్పీకర్లా వుండేది. పాటా మాటా నేర్పిన నరసింహంగారే, పొలాల గట్లమీద కొసరాజును కూచోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పేవారు, సాహిత్య సభలకు తిప్పారు. అది ఎంత దూరం వెళ్లిందంటే, పన్నెండో ఏటికే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించాడు! బాలకవి అని బిరుదు పొందాడు. సినిమాలకి వచ్చిన తర్వాత ‘కొసరాజు’ ఎంత పాప్యులరో, బాల్యదశలో ‘బాలకవి’ అంత పాప్యులర్‌. పత్రికల్లో కవితలు రాయడానికీ, ‘రైతుపత్రిక’లో సహాయ సంపాదకుడుగా పనిచెయ్యడానికీ స్కూలు, కాలేజీ చదువులు చదవకపోవడం - ఏ మాత్రం అడ్డురాలేదు.
నరసింహం పంతులు వ్రాసిన రామాయణము నాటకములో పాత్రలు ధరించి నాటక రంగానికి పరిచయమయ్యాడు. పిదప కొంత కాలము 'రైతు పత్రిక' కు జర్నలిష్టుగా ఉన్నాడు. ఆ సమయములోనే ప్రముఖ సంగీత దర్శకుడు సముద్రాల రాఘవాచార్యులు, నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం గార్లతో పరిచయం ఏర్పడింది. జమీన్‌రైతు ఉద్యమం లేచిన తర్వాత, ఆయన రైతుని సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలూ రాసి సభల్లో పాడేవాడు. అప్పుడే ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి పీఠిక రాయమని కొసరాజు ఎందరో సాహితీ వేత్తలనూ, రాజకీయవేత్తలనూ అర్థించాడట.
ఆ పుస్తకం చదివి, అందరూ 'మనకెందుకులే' అని వెనుకంజ వేశారుట - భయపడి. ఐతే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు మాత్రం 'నేను రాస్తాను' అని, ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశాడట. అది అచ్చయింది. రైతు మహాసభల్లో ఆయన పాల్గొని, పద్యాలు గొంతెత్తి చదువుతూ వుంటే 'ఆహా' అనే వారందరు. అప్పుడే ఆయనకు కవిరత్న అన్న బిరుదుకూడా ఇచ్చారు. సాహితీపోషకులైన జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా రాఘవయ్య చౌదరికి గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్య లతో ఏర్పడిన పరిచయం ఆయన సినిమాల్లో ప్రవేశించడానికి కారణమైంది.
అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఒక ఊపు ఊపుతున్న కొసరాజుచేత, రామబ్రహ్మం సినిమాలకు రాయించడం మొదలుపెట్టాడు. తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్‌ మాటలు రాస్తే విశ్వనాథ కవిరాజు హాస్య సన్నివేశాలు రాశారు. సముద్రాల, తాపీ, కొసరాజు పాటలు రాశారు. ‘రైతుబిడ్డ’ తర్వాత నేను స్వస్థలం వెళ్లిపోయి వ్యసాయంతోపాటు సాహితీ వ్యవసాయం కూడా చేస్తూ కూచున్నాను. మళ్లీ పదమూడేళ్ల తర్వాత డి.వి. నరసరాజుగారి సూచనతో కె.వి. రెడ్డిగారు ‘పెద్దమనుషులు’ సినిమాకి పిలిచారు. అప్పటుంచి ‘సినిమాకవి’నే అయిపోయాను’ అని గట్టిగా నవ్వుతూ చెప్పేవారాయన.
రాఘవయ్య తొలుత కథానాయకునిగా రైతుబిడ్డ (1939) అనే చిత్రములో నటించాడు. కవిగా రాఘవయ్య ప్రతిభ గుర్తించిన బి. ఎ. సుబ్బారావు, కె. వి. రెడ్డి వారి చిత్రాలకు పాటలు వ్రాయించారు. 1954లో విడుదలైన 'పెద్ద మనుషులు' చిత్రానికి రాఘవయ్య వ్రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రెక్షకులను ఉర్రూతలూగించాయి. సుబ్బారావు గారి 'రాజు పేద' చిత్రములోని 'జేబులో బొమ్మ జే జేలబొమ్మ' బహుళ ప్రాచుర్యం చెందింది. రోజులు మారాయి (వహీదా రెహ్మాన్ నాట్యముతో)లో 'ఏరువాక సాగారో', 'ఇల్లరికములో ఉన్న మజా' (), 'అయయో జేబులో డబ్బులు పోయెనే' (), 'ముద్దబంతి పూలు బెట్టి' () మొదలగు పాటలు కోట్లాది తెలుగు ప్రేక్షకుల మనసులలో చిరస్మరణీయముగా మిగిలిపోయాయి. అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టున ఉండే వారి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారతాయి.
మొత్తం మీద ఇలాంటి పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తిచూపటం జరిగింది.
రాఘవయ్య 'గండికోట యుద్ధము' అను ద్విపద కావ్యము, 'కడగండ్లు' అను పద్యసంకలనం వ్రాశాడు. 'కొసరాజు విసుర్లు','కొండవీటి చూపు', 'నవభారతం', 'భానుగీత' ఇతని ఇతర రచనలు.
 
'పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు అని స్వయంగా ప్రకటించుకున్నాడు.
1938లో గూడవల్లి రామబ్రహ్మం రైతుబిడ్డ సినిమా లో కొసరాజు కొన్ని పాటలు రాయడమేకాక నటించారు
యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము రాఘవయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డు (1984) ఇచ్చింది.
తెలుగు ప్రజానీకం 'కవి రత్న' 'జానపద కవి సార్వభౌమ' మున్నగు బిరుదులు ఇచ్చింది.
కొసరాజు రాఘవయ్య 1986 అక్టోబరు 27 రాత్రి పది గంటలకు మరణించాడు

చచచచ