ఆదర్శమూర్తి రాజేశ్వరి మూర్తి . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ఆదర్శమూర్తి రాజేశ్వరి మూర్తి .

ఆదర్శమూర్తి రాజేశ్వరి మూర్తి .
ఆశయం మనిషిని మహాన్నతుడిని చేస్తుంది సేవాభావం ,పట్టుదల , విషేషమైన కృషిచేసి లక్ష్యదిశగా ప్రయాణించి సఫలమైనప్పటికి లోకానికి తెలియని తెలుగు జాతి రత్నాలు ఎన్నో అటువంటి వారిలో ఫ్రోఫెసర్ శ్రీమతి రాజేశ్వరి మూర్తి గారు ఒకరు . ఆంధ్రాలో మొట్టమొదటి మహిళా కళాశాల...శ్రీ పద్మావతీ మహిళా కళాశాల, తిరుపతి...
అదెలా వచ్చిందంటే.....ఆ కాలేజీ అంత గొప్ప గా ఎలా అయిందంటే....
అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో...
అబ్బాయిల కళాశాలలో అమ్మాయిలను చేర్చుకోరాదని మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ 1951లో తీర్మానించింది.
స్వాతంత్ర్యం వచ్చి నాలుగేళ్ళు. స్త్రీ విద్యకు ఆదిలోనే గండిపడింది. తిరుపతిలో అప్పటికే డిగ్రీ కాలేజీ ఉన్నా, అమ్మాయిలు చేరడానికి వీలులేకుండా పోయింది.
ఈ గండిని పూడ్చడానికి, 1952లో టీటీడీ ' శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల'ను స్థాపించింది. ఆంధ్ర రాష్ట్రంలో అదే తొలి మహిళా కళాశాల.
రంగనాయకమ్మ మొదటి ప్రిన్సిపాల్ గా కాలేజీని నెట్టుకొచ్చి, రెండేళ్ళ తరువాత నిష్క్రమించారు.

స్త్రీల కళాశాల వచ్చిన రెండేళ్ళకు తిరుపతిలో ఎస్వీయూనివర్సిటీ వచ్చింది.
అక్కడ రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గా చేరిన కే.సూర్యనారాయణ మూర్తి సతీమణే రెండో ప్రిన్సిపాల్ రాజేశ్వరి మూర్తి 1954 లో మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పగ్గాలు చేపట్టారు.
అంతే.. ఆ కళాశాల శరవేగంతో అభివృధ్ధి పధంలో నడచింది.
శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల కాస్తా 'శ్రీపద్మావతి మహిళా కళాశాల' (ఎస్పీడబ్ల్యూ) గా మారింది. మరో రెండేళ్ళకు 1956లో డిగ్రీ కళాశాలయ్యింది.
అప్పటికింకా కళాశాలకు సొంత భవనాలులేవు. ప్రాక్టి కల్స్ కోసం అబ్బాయిల కళాశాలకు వెళ్ళాల్సి వచ్చేది. మహిళా కళాశాలకు భవనం ఎలా ఉండాలి? తరగతి గదులు ఎలా ఉండాలి? లెబోరేటరీలు ఎలా ఉండాలి? హాస్టళ్ళు ఎలా ఉండాలి? ప్రహరీ గోడ ఎంతెత్తుండాలి? చివరికి టాయిలెట్లు ఎక్కడుండాలి? అన్నీ రాజేశ్వరి మూర్తి ఆలోచనలకు ఇదిగో ఎస్పీడబ్ల్యు కళాశాల ఇలా రూపుదాల్చింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వంద ఎకరాలను ఆమె సేకరించారు. కాకినాడకు సమీపంలోని పెద్దాపురానికి చెందిన ఒక సంప్రదాయ కుటుంబంలో 1921 డిసెంబర్ 10వ తేదీన రాజేశ్వరి జన్మించారు. పెళ్ళి అయ్యాక భర్త ప్రోత్సాహంతో చదువు మొదలు పెట్టారు. గణిత శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వారికి పిల్లలు లేరు.
రాత్రి, పగలు అనకుండా కళాశాలే ఆమెకు ఇల్లు అయిపోయింది. అదే ఆమెకు జీవితం అయిపోయింది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు; ఒకటేమిటి వారి వికాసానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో, వాటి కోసం ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ వినియోగించారు.
విదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో విద్యాపర సంబంధాలను నెలకొల్పారు. కేరళ, కర్ణాటక, మద్రాసు రాష్ట్రాల నుంచి ఏరికోరి అధ్యాపకులను ఎంపిక చేశారు. రాష్ట్రంలోనేఒక అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. ఆ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థినులు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తే, అధ్యాపకులుగా చేరడానికి వారికే అవకాశం ఇచ్చారు.
టీటీడీ హాస్టళ్ళలో మాంసాహారం నిషేధం .రాజేశ్వరి మూర్తి శాఖాహారి. మాంసాహారాన్ని బైట ఒండించి విద్యార్థినులకు పెట్టించారు.
ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి వచ్చినప్పుడు, “మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మనకు అవమానం కదండి” అని సున్నితంగా చెప్పారు. అంతే , ఆయన వెంటనే డైనింగ్ హాలులో బెంచీలు, కుర్చీలు వేయించారు.
తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, తొల ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహాహహులను కళాశాలకు రప్పించారు. ఒక ఆడ బిడ్డను, తల్లి తీర్చిదిద్దినట్టు ఎస్పీడబ్ల్యూ కళాశాలను ఆమె అలా తీర్చిదిద్దారు.
కళాశాల కోసం నిత్యం పోరాడే వారు. ఎస్పీడబ్ల్యూ కళాశాల ఎదురుగా, రైలు పట్టాల పక్కన ఉన్న రెండు భవనాలు ఈ కళాశాలవే. టీటీడీ అధికారుల నివాసాల కోసం ఈవో ఆ భవనాలను స్వాధీనం చేసుకున్నారు. “కనీసం ప్రిన్సిపాల్ గా ఉన్న నన్ను అడగకుండా మా కాలేజీ భవనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు?” అంటూ టీటీడీ ఈవోపై విరుచుకుపడ్డారు. ఈవో ఆమె పై అధికారి.
మరొక ఈవో తో ఆమెకు భిన్నాభిప్రాయాలు పొడచూపాయి. ఆమె రాజీనామా చేసి 1975లో అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. అయినా తన మానస పుత్రికను ఒదులుకోలేదు. తరచూ తిరుపతి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఎస్పీ డబ్ల్యూ కళాశాలకే కాదు, ఎస్వీయూనివర్సిటీకి కూడా లక్షల రూపాలు ఇస్తూనే ఉన్నారు.

కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాలనాధికారిగా పనిచేశారు. అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే అత్యుత్తమ పాలనాధికారి అవార్డు రాజేశ్వరి మూర్తికి లభించింది. తనకొచ్చిన ఆ అవార్డును ఎస్పీడబ్ల్యూ కాలేజికి ఇస్తున్నట్టు ప్రకటించారు.
ఆమె దగ్గర చదువుకున్న అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఏడేళ్ళ క్రితం 93 ఏళ్ళ వయసులో చివరి సారిగా తిరుపతి వచ్చారు.
ఇప్పటికీ ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థినులను తన పిల్లలనే అంటారు. ఆమె తొలి బ్యాచ్ విద్యార్థులు అప్పటికే ఎనభై ఏళ్ళకు చేరుకున్నారు.
న్యూయార్కులో ఉంటూ, నూరేళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆమె తన వంట తానే చేసుకుంటారు!
PROF. RAJESWARI MURTHY గారు
శత వసంతాలు. తొలి మహిళా కళాశాల రూపుశిల్పి.. డిసెంబర్ 10 వ తేదీన శత జన్మదినం.
ఆ కాలపు అమ్మాయిలకు నడక నేర్పారు, నడత నేర్పారు, మాట నేర్పారు, జీవిత పాఠాలు నేర్పారు. జ్ఞాన తృష్ణ తీర్చి, భవిష్యత్తుకు బాటలు వేశారు.
న్యూయార్క్ లో ఇప్పటికీ సంతృప్తి కర జీవితాన్ని గడుపుతున్నారు. తిరుపతిలో గడిపిన జీవితాన్ని నెమరేసుకుంటూ . వందలాదిమంది ఈ ఏస్పీడబ్ల్యూ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినోళ్లే....
ఈ రోజు మనం గొప్పగా చూసే ప్రతి గొప్ప వ్యవస్ధ వెనకాల ఒక తెలియని వ్యక్తి యొక్క శ్రమ, త్యాగం ఉంటుంది అనేది అక్షర సత్యం...! ఆ గొప్ప వ్యక్తుల్లో ఆంధ్ర వరకు అయినా, రాజేశ్వరి మూర్తి గారు వుంటారు....!!

మరిన్ని వ్యాసాలు

ప్రభల సంస్కృతి .
ప్రభల సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బుడబుక్కలవారు.
బుడబుక్కలవారు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పూరి జగన్నాధ రథ యాత్ర .
పూరి జగన్నాధ రథ యాత్ర .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
వీధి నాటకం .
వీధి నాటకం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
దేవదాసిల నృత్యం .
దేవదాసిల నృత్యం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
జముకులకథ .
జముకులకథ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
గొరవయ్యల నృత్యం.
గొరవయ్యల నృత్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.