జాతీయ యువజన దినోత్సవం - కొమ్మలూరు హరి మదుసూధన రావు

జాతీయ యువజన దినోత్సవం

“మీరు భారత దేశం గురించి తెలుసుకోవాలంటే ముందు స్వామి వివేకానందుని గురించి తెలుసుకోండి” అంటారు విశ్వకవి రవీంద్ర నాథ్ టాగోర్. బ్రిటిష్ వారు భారత దేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో భారతీయులంతా నిరాశా నిస్పృహలకు లోనయ్యి చీకటి బ్రతుకులు గడుపుతున్న సమయంలో సూర్యుడు ఉదయించి ఆ చీకట్లను తరిమికొట్టినట్లు ఒక మహానుభావుడు కలకత్తాలో ఉదయించాడు. భయమంటే ఏంటో తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్ఠమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం, మాటలతో మంత్రముగ్ధులను చేయగల గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు.

దత్ వంశ చరిత్ర :

కలకత్తాలో సిమ్లా అనే వీధిలో క్షత్రియ వంశానికి చెందిన ఒక కుటుంబం ఉండేది. వీరిని ‘దత్ వంశం’ వారు అని పిలిచేవారు. దుర్గాచరణ దత్ ఈ వంశంలో గొప్ప సంస్కృత పండితుడుగా న్యాయవాదిగా సిరిసంపదలతో వర్ధిల్లుతూ ఉండేవాడు. రఘుమణిదేవికి దుర్గాచరణ దత్ కు విశ్వనాథ దత్ అనే పుత్రుడు కలిగాడు. దుర్గాచరణ దత్ ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు రాగానే సన్యాసం స్వీకరించి కాశీలో ఉండసాగెను. తన కుమారునితో కలిసి రఘుమణిదేవి కాశీని దర్శించటానికి పడవలో బయలుదేరింది. గంగానదీ ప్రవాహవేగానికి విశ్వనాధుడు నీటిలో పడిపోయాడు. పుత్రప్రేమతో ఆ తల్లి ధైర్యంగా నీటిలోకి దుంకి పిల్లవాడిని రక్షించుకుంది. కాశీలో ఒక దేవాలయం వద్ద ఆమె కాలు జారి క్రింద పడి స్పృహ కోల్పోయింది. అక్కడే ఉన్న ఒక సన్యాసి వచ్చి ఆమె ముఖంపై నీళ్ళు చల్లి లేపెను. ఆ సన్యాసి ఎవరో కాదు తన భర్త దుర్గా చరణ దత్తే అని కనుగొని ఆమె ఆశ్చర్య చకితురాలైంది. దుర్గా చరణ దత్ తన కుమారుడైన విశ్వనాథుని ఆశీర్వదించి పంపించాడు. విశ్వనాథ్ విద్యాభ్యాసమును పూర్తి చేసి మంచి న్యాయవాదిగా పేరెన్నిక గన్నాడు. ఇతడు మంచి దాతృత్వము కలవాడు. పంక్తి లో కనీసం పదిమందితో కలిసి భోజనం చేసేవాడు. ఇతని భార్య భువనేశ్వరీ దేవి తగిన సహధర్మచారిణి. వీరికి 1863 వ సంవత్సరం జనవరి 12 మకర సంక్రాతి రోజున ఈశ్వరాంశ సంభూతుడైన ఒక కుమారుడు పుట్టెను. అతనికి ‘నరేంద్రనాధ్ దత్’ అని పేరు పెట్టిరి. ఇతనిని ముద్దుగా ‘నరేన్’ అని ‘బీలే’ అని పిలుచుకునేవారు.

బాల్యము :

నరేన్ చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లవాడుగా ఉండేవాడు. వాళ్ళ అమ్మ అల్లరి భరించలేక శివ శివా అంటూ చల్లని నీళ్ళు నెత్తిమీద పోసేది. దాంతో శాంతించెడివాడు. సన్యాసులంటే చాలా ఇష్టం. ఒకరోజు ఒక సన్యాసికి కొత్త కోటును ఇచ్చివేశాడు. ఇంటిలో పెట్టి బంధించినా కూడా సన్యాసులను చూసి సంతోషంతో కిటికీలో నుంచి వస్తువులను దానం చేసేవాడు. చిన్నతనంలో భువనేశ్వరీ దేవి రామాయణ, మహాభారత కథలను చెప్పేది. రాముడంటే ప్రీతి ఎక్కువ. ఒక గాయకుడు రామాయణాన్ని తప్పు పాడుతుండగా దానిని సరిచేశాడు. ఆంజనేయుడు అరటి తోటలలో ఉంటాడని వెదుకుతూ ఉండేవాడు. చిన్నతనంలో ఎక్కువ సేపు ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఒకసారి ధ్యానం చేస్తుండగా ఒక పాము గదిలోకి వచ్చింది. అది గమనించిన స్నేహితులు ‘పాము పాము’ అని కేకలు పెట్టినా, నరేన్ కళ్ళు కూడా తెరవలేదు. గోళీలతో ఆట, కుస్తీ పట్టే ఆట అంటే ఇష్టం. నరేన్ రాజుగా, తన స్నేహితులు మంత్రులు, సామంతులుగా ఆట ఆడేవాడు. నరేంద్రునికి కుల, మత భేదం లేదు. ఒక ముస్లింతో చనువుగా ఉండేవాడు. ఆ ముస్లిం తన ఆఫ్ఘన్ యాత్రను చెప్పేవాడు. అతను ప్రేమతో యిచ్చే మిఠాయిలను నరేన్ తినేవాడు. అతనిని ‘మామా’ అని ప్రేమగా పిలిచేవాడు. నరేంద్రుడికి ధైర్యం ఎక్కువ. ఒక రోజు ఒక గుర్రపు బండి వేగంగా పోతోంది. అందులో ఉండే ఒక మహిళ ‘రక్షించండి రక్షించండి’ అంటూ కేకలు పెడుతోంది. నరేంద్రుడు వేగంగా ఆ బండిలోకి ఎక్కి గుఱ్ఱం కళ్ళెం గట్టిగా లాగి ఆ మహిళ ప్రాణాలను కాపాడాడు.

విద్యాభ్యాసం :

నరేన్ మొదట తన ఇంటిలోనే విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. కొంతకాలం తరువాత 1871 లో తన ఎనిమిదవ ఏట ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. పాఠశాలలో ఎక్కువ సేపు కళ్ళు మూసుకొని ఉండటం చూసి నిద్రపోతున్నాడని పొరబడిన ఉపాధ్యాయులు ప్రశ్నించగా అప్పటివరకూ చెప్పిన పాఠాన్ని తు.చ. తప్పకుండా చెప్పటం చూసి అవాక్కయ్యారు. సంస్కృతం, ఇంగ్లీష్, చరిత్ర బాగా చదివేవాడు. వర్డ్స్ వర్త్ గీతాలను కంఠతా పట్టేవాడు. కానీ గణితం అంటే ఇష్టం ఉండేది కాదు. అహ్మద్ ఖాన్, వేణీ గుప్త వంటి ప్రసిద్ధ గాయకుల వద్ద సంగీతం నేర్చుకొని చక్కగా పాటలు పాడే వాడు. స్నేహితుని ద్వారా హార్మోనియం, వయోలిన్ నేర్చుకొన్నాడు. విశ్వనాథునికి తన కుటుంబంతో కలిసి రాయపురానికి వెళ్ళవలసి వచ్చింది. నరేన్ చదువుకు మూడు సంవత్సరాలు అంతరాయం కలిగింది. 1879లో కలకత్తాకు వచ్చి ఆ మూడు సంవత్సరాల పాఠశాల విద్యను ఒక సంవత్సరంలోనే పూర్తి చేశాడు. దీనికి సంతోషించి విశ్వనాథుడు నరేన్ కు గడియారాన్ని బహుకరించాడు. నరేన్ మంచి వక్త. పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సురేంద్ర నాథ్ బెనర్జీ అధ్యక్షునిగా వచ్చాడు. ఎవరైనా విద్యార్థి మాట్లాడవలసిందిగా చెప్పగా ధైర్యంగా ముందుకు వచ్చి అరగంటకు పైగా ఉపన్యసించి బెనర్జీ మెప్పును పొందాడు.

భగవంతుని దర్శించాలనే ఆరాటం :

స్కాటిష్ చర్చి కాలేజీలో చదువు తున్నప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడు ? భగవంతుడు సాకారుడా ? నిరాకారుడా ? అనే సందేహం కలిగింది. తన సందేహ నివృత్తి కోసం బ్రహ్మ సమాజంలో చేరాడు. దేవేంద్ర నాథ్ ఠాగూర్ వంటి ఎందరో మహానుభావులను కలుసుకొన్నాడు. కానీ తన ప్రశ్నకు సరియైన సమాధానం దొరక నందుకు చింతించే వాడు. ఇది గమనించిన కాలేజి ప్రిన్సిపల్ హేస్టి దీనికి సరియైన సమాధానం దక్షిణేశ్వరాలయంలో ఉన్న బ్రాహ్మణ పూజారి మాత్రమే చెప్పగలడు అని చెప్పాడు.

శ్రీ రామకృష్ణ పరమహంసతో కలయిక :

ఒక రోజు సురేంద్ర నాధ బెనర్జీ మిత్రుని ఇంటికి శ్రీ రామకృష్ణ పరమహంస విచ్చేశాడు. అక్కడ నరేంద్రుడు తన గాన మాధుర్యంతో శ్రీ రామకృష్ణుడిని ఆకర్షించాడు. నరేంద్రుని పిలిచి మెచ్చుకొని తనవద్దకు రావలసిందిగా చెప్పాడు. తన బంధువు అయిన రామచంద్ర దత్ సహాయంతో నరేంద్రుడు దక్షిణేశ్వరాలయంలో శ్రీ రామకృష్ణుని కలుసుకున్నాడు. నరేంద్రుని చూడగానే శ్రీ రామకృష్ణుడు ఆనందభరితుడై ‘ఎన్నాళ్ళకు వచ్చితివి తండ్రీ’ అని ఆదరంగా ఆహ్వానించి మిఠాయిలను ఇచ్చాడు. నరేంద్రుడు కొంత ఆశ్చర్యానికి లోనై ఇతడు నిజంగా మహానుభావుడా ? పిచ్చివాడా ? అని మనసులో అనుకొని, ‘మీరు భగవంతుని చూశారా ?’ అని అడిగాడు. ‘ఔను, నేను నిన్ను చూసినట్లే భగవంతుని చూశాను. నీతో మాట్లాడినట్లే మాట్లాడాను’ అని శ్రీ రామకృష్ణుడు అన్నాడు. ‘నాకు కూడా కనబడతాడా ?’ అని నరేంద్రుడు అడిగాడు. శ్రీ రామకృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘నాకు డబ్బు కావాలి, కుమారుడు కలగాలి స్వామీ! అని కోరేవారే తప్ప భగవంతుని కోసం ఆరాటపడే వారు ఎవరు ? నిజంగా పరితపించితే భగవంతుని సాక్షాత్కారం తప్పక లభిస్తుంది.’ అని చెప్పాడు. ఆ సమాధానం విన్న నరేంద్రుడు సంభ్రమాశ్ఛర్యానికి లోనయ్యాడు. వీలుచూసుకొని నీవు ఒక్కడివే రమ్మని శ్రీ రామకృష్ణుడు చెప్పాడు. మరోసారి కలవాలని నరేంద్రుడు నిశ్చయించుకున్నాడు. మరొక రోజు రామకృష్ణునికి వద్దకు వచ్చాడు. పరమహంస ప్రేమతో తన పాన్పు వద్దకు నరేంద్రుని తీసుకువచ్చి, తన పాదాన్ని నరేంద్రుని శరీరంపై ఉంచాడు. ఆ స్పర్శకు నరేంద్రుడు అపూర్వ అనుభూతికి లోనయ్యాడు. భయంతో ‘నన్ను మీరేం చేస్తున్నారు ? నాకు అమ్మా నాన్న ఉన్నారు’ అని అన్నాడు. ‘నరేంద్రుని హృదయమును మెల్లగా నిమురుతూ ‘మంచిది, ఇప్పటికిది చాలు’ అని అన్నాడు. ఆశ్చర్యంగా ఆ విచిత్ర అనుభవం అదృశ్యమయ్యింది. అప్పటినుండీ ప్రతి రోజూ అక్కడికి వచ్చేవాడు. ఎప్పుడైనా నరేంద్రుడు రాక పోతే కాళీమాత కనబడనప్పుడు ఎలా ఆరాటపడేవాడో అలా శ్రీ రామకృష్ణుడు తల్లడిల్లే వాడు. ‘ప్రతి నిమిషం నా గురించి తపన ఎందుకు ? పూర్వం జడభరతుడు లేడి కోసం పరితపించి మరుజన్మలో ఆ లేడిగా పుట్టటం మీకు తెలుసుగదా!’ అని నరేంద్రుడు అన్నాడు. ‘నీ అంతరాత్ముడైన నారాయణునికై తపిస్తున్నాను’ అని అన్న శ్రీ రామకృష్ణుని మాటలకు నరేంద్రుడు సమ్మోహితుడయ్యాడు. ఒక రోజు శ్రీ రామకృష్ణుని పరీక్షించుటకు నరేంద్రుడు ఒక వెండి నాణెమును పరుపు క్రింద ఉంచాడు. పరుపుపై పడుకొన్న శ్రీ రామకృష్ణుడికి వంటి నిండా మంటలు పుట్టాయి. పురుగు ఏదైనా ఉందేమోనని దులపగా వెండి నాణెము క్రింద పడింది. ఇది ఇక్కడ ఎవరు పెట్టారు అని ప్రశ్నించగా అక్కడి నుండి నరేంద్రుడు మెల్లగా బయటకు వెళ్ళిపోవడం గమనించిన శ్రీ రామకృష్ణుడు తనను పరీక్షించేందుకే నరేంద్రుడే ఇలా చేశాడని గ్రహించాడు. దిన దిన ప్రవర్ధమానంగా గురు శిష్య సంబంధం పెరిగింది. నరేంద్రుడు పరమహంసకు ప్రియ శిష్యునిగా అయ్యాడు.

నరేంద్రుని కష్టాలు :

1884లో బి.ఎ. పరీక్షలు వ్రాయడానికి నరేంద్రుడు బారానగరానికి వచ్చాడు. ఆ సమయంలో గుండెపోటుతో తండ్రి విశ్వనాథుడు మరణించాడనే దుర్వార్త విన్నాడు. ఎంతో రోదించాడు. విశ్వనాథుడు అప్పులు చేసి దాన ధర్మాలు చేయడం వలన అవి తీర్చే బాధ్యత నరేంద్రునిపై పడింది. నరేంద్రుడు న్యాయ కళాశాలలో చేరాడు. నిరాహారిగా చాలా సార్లు కళాశాలకు వెళ్ళేవాడు. కుటుంబ భారమంతా నరేంద్రునిపై పడటంతో విద్యాసాగరుని పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరాడు. గురుదేవుల వద్దకు వచ్చి ‘మహాశయా! కాళికా దేవితో నన్ను ఈ దుర్భర పరిస్థితి నుంచి కాపాడమని చెప్పండి’ అని అన్నాడు. ‘నేను ఇటువంటి ప్రార్థనలు చేయను నీవే వెళ్లి ఆ కాళీమాతతో మొరపెట్టుకో’ అని శ్రీ రామకృష్ణుడు అన్నాడు. ఆలయంలోకి వెళ్లిన నరేంద్రుడు అమ్మవారిని చూడగానే తన బాధలన్నీ మర్చిపోయి ‘తల్లీ నాకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను’ ప్రసాదించమని ప్రార్థించాడు. ‘నీ కుటుంబ పరిస్థితి మెరుగు కోసం కోరిక కోరితివా’ అని గురుదేవులు అడగగా లేదని నరేంద్రుడు అన్నాడు. తిరిగి మూడు సార్లు పంపినా నరేంద్రుడు ఏ కోరికా కోరలేదు. తన శిష్యునిలో కలిగిన ఈ మార్పుకు అమితానంద భరితుడై మీ కుటుంబానికి ఇకపై అన్న వస్త్రాలకు లోటు ఉండదని వరమిచ్చాడు. కొంత కాలం తరువాత గురుదేవులకు గొంతులో ఒక పుండు పుట్టింది. దాని బాధ నుండీ ఉపశమనానికి గురుదేవులను కాశీ పురమునకు తీసుకొచ్చారు. 1886 ఆగష్టు 16న శ్రీ రామకృష్ణ పరమహంస బ్రహ్మైక్యం పొందెను. దిక్కు లేని వాని వలే, తండ్రిని కోల్పోయిన బిడ్డ వలే నరేంద్రుడు విలపించాడు.

భారతదేశ యాత్ర :

గురుదేవుల ద్వారా అద్వైతానుభూతిని పొందిన నరేంద్రుడు జగద్గురువు ఆది శంకరాచార్యులవలే ఆసేతు హిమాచలం నుంచీ కన్యాకుమారి అగ్రం వరకు భారతదేశ పర్యటన చేయాలని నిశ్చయించాడు. మొదటగా ఉత్తర దేశ యాత్రలలో భాగంగా కాశీ, అయోధ్య, ఆగ్రా, మధుర, హరిద్వార్ లతో పాటూ హిమాలయాలకు వెళ్ళాడు. కాశీలో ఒక రోజు గంగా స్నానం చేసి వస్తుండగా కోతుల గుంపు నరేంద్రుని వెంటబడింది. నరేంద్రుడు పరిగెత్తుతుంటే అది గమనించిన ఒక సన్యాసి ‘పారిపోకు, నిలబడు, వాటిని ఎదుర్కొ’ అని చెప్పగా అలానే చేసి అడుగు ముందుకు వేశాడు. కోతులు పారిపోయాయి. దీనిని తన ఉపన్యాసాలలో అనేక మార్లు గుర్తు చేసుకుంటూ ‘కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనండి వెనుకంజ వేయకండి’ అని చెప్పేవాడు. దక్షిణ దేశ యాత్రలలో భాగంగా మైసూరు, మద్రాసు, కొచ్చిన్, రామేశ్వరం, కన్యాకుమారి మొదలగు ప్రాంతాలకు వచ్చాడు. ఒక రోజు ఆళ్వారు మహారాజు మంగళ్ సింగ్ వద్దకు నరేంద్రుడు వచ్చాడు. పాశ్చాత్య ప్రభావంతో ఆ రాజు విగ్రహారాధనను ఖండించాడు. రాజుకు గుణపాఠం చెప్పడానికి రామచంద్ర అనే దివానును పిలిచి రాజుగారి చిత్ర పటాన్ని తెప్పించి దానిమీద ఉమ్మమన్నాడు. ఆ మాట విన్న దివాను నిశ్చేష్టుడై ‘అది మా రాజుగారి పటము అలా చేయలేను’ అన్నాడు. ‘రాజా అది కాగితమే కానీ అందులో ఉన్నది మీరు కాబట్టి దివాన్ కు మీపై గౌరవం ఉండటం వలన అలా చేయలేక పోయాడు. విగ్రహం కూడా అంతే అది రాయి కాదు అందులో భగవంతుని దర్శిస్తున్నారు.’ అని అనగా రాజు తన అజ్ఞానానికి క్షమాపణ చెప్పాడు. దరిద్ర నారాయణుల సేవ చేయడమే మనిషి యొక్క లక్ష్యం కావాలని, ‘మానవ సేవే మాధవ సేవ’ అని నరేంద్రుడు చెప్పాడు. కన్యాకుమారి అగ్రం చేరి సముద్రాన్ని ఈది ఒక శిలపై కూర్చొని మూడురోజులు తపస్సు చేశాడు.

చికాగోకు ప్రయాణం :

ఖేత్రీ మహారాజగు అజిత్ సింగ్ కోరిక మేరకు ‘వివేకానందుడు’ అనే నామధేయాన్ని స్వీకరించి చికాగో లో జరుగు ప్రపంచ సర్వ మత సమ్మేళనంలో పాల్గొనుటకై 1893 మే 31న బొంబాయి నుండి పెనిన్సులర్ అనే ఓడలో బయలుదేరాడు. హాంకాంగ్, టోక్యో నగరాల గుండా కెనడాలోని వాంకోవర్ కు చేరాడు. అక్కడి నుండి చికాగో నగరానికి రైలు ప్రయాణంలో సాన్ బోర్న్ అనే మహిళ పరిచయం అయింది. వివేకానంద యొక్క పాండిత్యాన్ని గ్రహించి బోస్టన్ నగరంకు వచ్చినప్పుడు తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది. చికాగో చేరిన వివేకానందకు ప్రపంచ సర్వ మత సమ్మేళనం మూడునెలల పాటు వాయిదా పడినాయని తెలిసింది. చికాగో నగరం అత్యంత ఖరీదైన నగరం.

బోస్టన్ నగరానికి ప్రయాణం :

బోస్టన్ నగరం కొంత నివాసయోగ్యమైన నగరమని గ్రహించి సాన్ బోర్న్ ఆహ్వానం మేరకు వివేకానందుడు ఆమె ఇంటికి వచ్చాడు. అక్కడ ప్రతి రోజూ గ్రంధాలయంకు వెళ్లి ఒక పుస్తకం తెచ్చుకొని మరుసటి రోజు తిరిగి ఇచ్చేసేవాడు. అక్కడి లైబ్రేరియన్ చదవని దానికి ఎందుకు తీసుకెళతారని అవహేళన చేసింది. వివేకానందుడు నేను తీసుకెళ్ళిన పుస్తకంలోని ఏ విషయాన్నయినా అడగండి అనగానే ఆమె ఒక పుస్తకం తీసి అడగ్గా పేజీ నెంబర్ తో సహా ఆ పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అంత గొప్ప ఏక సంధాగ్రాహి వివేకానందుడు. సాన్ బోర్న్ ఇంటి వద్ద స్వామి ఉపన్యాసం విన్న హార్వర్డ్ ప్రొఫెసర్ జె.హెచ్. రైట్ ప్రపంచ సర్వ మత సమ్మేళనంలో స్వామిని పాల్గొనమని అభ్యర్థించాడు. తాను భారతదేశం నుండి అందుకే వచ్చానని కానీ ఆ సభలో పాల్గొనుటకు అనుమతి పత్రము తన వద్ద లేదని వివేకానందుడు చెప్పాడు. ‘మిమ్మల్ని అనుమతి పత్రం అడగటం సూర్యుని ప్రకాశించే సహజ స్వభావాన్ని ప్రశ్నిచడం వంటిది. ప్రపంచ సర్వ మత సమ్మేళన అధ్యక్షుడు నా మిత్రుడు. అతనికి ఈ లేఖను ఇవ్వండి’ అని రైట్ చెప్పాడు. ఆ లేఖలో ‘మహా పండితులకు వేయి రెట్లు ఎక్కువ ఈ విద్వాంసుడు ఇతనికి సభలో ఉపన్యసించే అవకాశం తప్పక ఇవ్వండి’ అని వ్రాశాడు. స్వామి చికాగో నగరం చేరి చిరునామా పోగొట్టుకున్నాడు. మహాసభల ముందురోజు రాత్రి ఒక గూడ్స్ లో ఖాళీ కడువుతో నిద్రించాడు.

ప్రపంచ సర్వ మత సమ్మేళనం లో :

1893 సెప్టెంబర్ 13 మహాసభలు జరిగే కొలంబస్ అనే భవనానికి చేరుకున్నాడు. తన అవకాశం రాగానే సరస్వతీదేవి మనసులో ప్రార్థించి ‘అమెరికా సోదర సోదరీమణులారా’ అని తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. ఆ ఆత్మీయ సంబోధన మొదటి సారిగా విన్న సభ్యులు ఆనందపరవశులై లేచి నిలబడి రెండు నిమిషాలపాటూ కరతాళధ్వనులు చేశారు. ఈ ఉపన్యాసంతో హిందూ మతంపై పాశ్చాత్యులకు గల అనుమానాలు పటాపంచలు చేశాడు. మరుసటి రోజు చికాగో నగర వీధులలో ఎక్కడ చూసినా వివేకానందుని పటాలే. పత్రికలన్నీ స్వామి ఉపన్యాసాన్ని పతాక శీర్షికలో ప్రచురించాయి. దీంతో స్వామి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. స్వామిని అనేక దేశాల వారు తమ దేశానికి రమ్మని ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానం మేరకు స్వామి వివేకానంద న్యూయార్క్, ప్యారిస్, లండన్ లలో పర్యటించాడు. లండన్ లో మార్గరెట్ ఇ. నోబెల్ అనే మహిళ స్వామి శిష్యురాలిగా మారింది. ఆమెకు సిస్టర్ నివేదితగా పేరు మార్చాడు. ఆమె స్వామితో పాటుగా భారతదేశానికి వచ్చి ఎంతో సామాజిక సేవ చేసింది.

భారతదేశ ఆగమనం :

కొలంబో, జాఫ్నాల మీదుగా వివేకానందుడు భారతదేశంలోని పాంబన్ ప్రాంతానికి చేరాడు. రామనాడు రాజగు భాస్కర సేతుపతి తన తలపై కాలును మోపి మొదటి అడుగు వేసి తనను పునీతుడిని చేయమని స్వామిని ప్రార్థించెను. రాజు అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించి ‘నా మొదటి అడుగు ఈ పుణ్యభూమిపై పెట్టాలని తన మనసు ఉవ్విళ్ళూరుతోంది’ అని చెప్పి అడుగు పెట్టి మట్టిని ముద్దాడాడు. భాస్కర సేతుపతి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామిని తన రథం లో కూర్చోబెట్టి, రథానికి ఉన్న గుఱ్ఱాన్ని తప్పించి స్వయంగా రథాన్ని లాగాడు. అక్కడి నుంచి రామేశ్వరం, మధురై, తిరుచిరాపల్లి, కుంభకోణం పర్యటించాడు. మద్రాసు నగరానికి స్వామి రైలులో తమ గ్రామం నుండి వెళుతున్నాడన్న విషయం తెలుసుకున్న ఆ గ్రామస్థులు స్టేషన్ మాస్టార్ ని రైలు ఆపమని అడిగారు. కానీ అందుకు ఈ గ్రామంలో రైలు ఆపడం కుదరదని చెప్పాడు. గ్రామస్థులు రైలు పట్టాలపై పడుకోవడంతో స్టేషన్ మాస్టర్ కు భయం వేసి రైలును ఆపాడు. వారి అభిమానానికి ముగ్ధుడై స్వామి వారికి ఆశీస్సులు ఇచ్చాడు. ప్రత్యేక రైలు ద్వారా కలకత్తా పట్టణానికి స్వామి చేరుకున్నాడు. దర్భంగ మహారాజు అధ్యక్షతన స్వాగత సభలో పాల్గొన్నాడు. 1898 డిశెంబర్ 9న శ్రీ రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. సిస్టర్ నివేదితతో కలిసి మరొక మారు పాశ్చాత్య దేశాల పర్యటనకై 1899 జూన్ 20న మద్రాస్ నుండి గోల్కొండ అనే ఓడలో బయలు దేరి వెళ్ళాడు. కొలంబో, లండన్ ల మీదుగా న్యూయార్క్ చేరాడు. అక్కడ కొంత కాలం ఉన్న తరువాత ప్యారిస్, వియన్నా, కాన్ స్టాంటినోపిల్, ఏథెన్స్, ఈజిప్ట్ లలో పర్యటించి భారతదేశానికి తిరిగి వచ్చాడు.

అవతార సమాప్తి :

తాను నెరవేర్చ వలసిన కార్యక్రమం పూర్తి అయ్యింది అని భావించి, శిష్యుడైన శుద్ధానందుని పిలిచి పంచాంగం తెప్పించి అందులో జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి శుక్రవారం నాడు ఒక గుర్తును ఉంచాడు. స్వామి పరమపదించాడానికి మూడు రోజులు ముందు ప్రేమానందుని పిలిచి ‘నేను తనువు చాలించిన తరువాత ఈ గంగా తీరంలో దహన కార్యక్రమం జరిపించండి’ అని ఆదేశించాడు. 1902 జూలై 4న కాళీ మాతపై కీర్తనను ఆలపించి కొంతసేపు ధ్యానం చేశాడు. రాత్రి పడుకొనే ముందు తల నొప్పిగా ఉందని కొంచెం విసరమని శిష్యునికి చెప్పాడు. వివేకానంద స్వామి బ్రహ్మ రంధ్రం నుండి ప్రాణోత్ర్కమణ గావించి బ్రహ్మైక్యం పొందాడు. స్వామి వివేకానంద శారీరకంగా తనువు చాలించినా “లేవండి! మేల్కొనండి! గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అనే సందేశంతో యువకులలో నింపిన స్పూర్తి ఇప్పటికీ చిరస్థాయిగా నిలచిఉంది.