నగ్న సత్యాల కథా మాలిక - సాగర్ రెడ్డి, చెన్నయ్

నగ్న సత్యాల కథా మాలిక నగ్నసత్యాల కథామాలిక " గొంతువిప్పినగువ్వ " జాన్సీ కొప్పిశెట్టి మేడమ్ గారి ఇంతకమునుపు రచన *విరోధాభాస* చదివిన తరువాత దానిపై చిన్న పరిశీలన అనే పేరుతో ఒకవ్యాసం వ్రాశా. ఇప్పుడు *గొంతువిప్పిన గువ్వ* చదివిన తరువాత నాలో ఒక ప్రశ్నవేసుకున్నా. ఈ పుస్తకాన్ని పరిశీలించే అర్హత నాకుందా అని? అందుకే పరిశీలన స్ధానంలో అభిప్రాయంగ మొదలుపెడుతున్నా. పుస్తకం చదివేటప్పుడే కొన్ని పాత్రలు, కొన్ని సంఘటనలలో పాఠకులను లీనంచేయడం అనేది చిన్న విషయం కాదని, ఆ ప్రతిభ జాన్సీ మేడమ్ స్వంతమని, వారి పూర్వ రచన చదివేటప్పుడే తెలుసుకున్నా. పుస్తకం తెరిచిన తరువాత ఈరోజు ఇన్ని పేజీలు చదవాలి అని నిశ్చయించుకుని తీరా మద్యలో పాత్రల గురించి ఆలోచిస్తూ పుస్తకాన్ని ప్రక్కనబెట్టి ఆలోచనలో మునిగిపోయిన సందర్భాలెన్నో. అంతలా పాత్రలను మలచే శక్తి వారిదని నిస్సంకోచంగా చెప్పగలను. ఇక ప్రస్తుత పుస్తకం విషయానికొస్తే మొదట చెప్పాల్సింది ఒక పుస్తకం వ్రాయాలంటే ఙ్ఞానంమాత్రమే సరిపోదు. తెగింపు, నిక్కచ్చితనం, అన్నీ కావాలి అని. ఎన్ని నగ్న సత్యాలు ఉన్నాయి ఇందులో? ప్రతి విషయానికి వాగ్ధానాలు చేసే నేటి నాయకులకు ద్వారక చేసిన శపదం చెప్పుదెబ్బలా అని పించదూ? బాల్యంలో ఊహించే కలలకు కళ్ళు అద్దం పట్టవూ? కెమో ధెరపీలో ఉన్న భర్త ఇచ్చే కంప్లీషన్ చార్ట్ గురించి మురెపంగ వర్ణించడం, తన ముఖం చూసుకుని భర్త ఎక్కడ బాధపడతాడో అని ఇంటిలో అద్దాలన్నింటినీ తీసివేయించడం లాంటి విషయాలు, సహచరుడిపై ఉన్న ప్రేమను ఎంత అధ్బుతంగ వ్యక్తపరుస్తున్నాయి? సహచరుడి వియోగాన్ని అంతలా అక్షరీకరించాలంటే ఎంతటి వేదనను అదిమి పెట్టాలో అర్ధమవుతుందికదా? కుమార్తె అడ్మిషన్ కు వెళుతుంటే బేలగా ప్రశ్నిస్తున్న సోదరుడి మాటలు కంటనీరు తెప్పించవూ? అడగగానే నేనున్నా అంటూ గోపి గారిని తన ఇంటికి తెచ్చుకున్న సుధగారి స్నేహాన్ని వర్ణింపను ఎన్ని పేజీలు వ్రాయాలి? తెల్లనివన్నీ పాలు కావు అని ఒక మదనుడు, ఒక కట్టుడు పళ్ళ హేమంత్ గారు నిరూపించలేదూ? అన్నయ్య ముసుగులో చాదస్తం ఒక బెంగాళీ చూపించలేదూ?సానబెడితే కానీ వజ్రం విలువ తెలియదని సీత ఉదంతం తెలియచేస్తోంది కదా? తెలిసీ తెలియని వయస్సులో రైలు పట్టాలెంబడి అన్వేషణ నవ్వు తెప్పించడంలేదూ? మన ప్రయాణాలుకూడ మన చేతిలో లేవని మంచినీళ్ళ సీసా కోసం వస్తూ కాలు విరిగి మంచంపాలైన రచయిత్రి గారి విషయం లోనే తేటతెల్లమవుతుంది కదా? ఇలా శోదిస్తు పోతే ఈ సంవత్సరానికి ఈ పుస్తకం పూర్తిచేయలేనేమో? ఇక మా పెద్దాయన నాకు కవిత్వంలో ఓనమాలు నేర్పిన *డా!!* *కెఎల్వీ ప్రసాద్ సర్* గురించి ప్రస్తావించడం చాలా ఆనందంగ ఉంది. నిజమే ఎదుటివారిని ప్రోత్సహించడం వారికున్న జబ్బు అని వారే ఒక సందర్భంలో వివరించారు.అందుకు నా విషయమే ఒక ఉదాహరణ. ఇప్పటికీ నన్ను ఆశ్చర్యపరచే విషయం ఏమిటంటే వారితో పరిచయం కలగిన తరువాత Please share whats app no if you have interested అని వారు అడిగేంతవరకు నా బుర్రకు తట్టకపోవడం. ఇక రచయిత జాన్సి మేడమ్ గారి పరిచయ భాగ్యమూ వారి పుణ్యమే. కళ్యాణమొచ్చినా,కక్కువచ్చినా ఆగదనే సామెత వారి పుత్రిక వివాహ విషయంలో ఋజువయ్యిందికూడ.లేకుంటే ముగ్గురు మతస్తులు సాయంచేయడం ఏమిటి? ఊహించని విదంగ శుభకార్యం నిర్విఘ్నంగ జరగడం ఏమిటీ? పెళ్ళి ఖర్చులను ముఖపరిచయం కూడ లేని వారణాసి గారు ఇప్పటికీ తీసుకోకపోవడం ఏమిటీ? ఇదిసామెత మాత్రమే కాక రచయిత్రి మంచితనం, వారి వ్యవహారశైలి వలనే అని నా అభిప్రాయం. ఇక సుధ గారు మరియు విజయ్ గారు లాంటి స్నేహితులను కలిగిఉన్న రచయిత్రిగారిని చూస్తుంటే ఒకింత ఈర్ష్యగా కూడ ఉంది. చేసిన తప్పు ఒప్పుకోలేని లోకం ఇది. అలాంటిది బెల్లా విషయంలో ఒప్పుకోవడం వారి నిస్సంకోచాన్ని వెల్లడిస్తుంది. ఇక నాకు చెంపదెబ్బకూడ తగిలింది. ఊరిలో ఉన్న మా పొలం అమ్మి నగరంలో మంచి గృహం కొనుగోలుచేయాలనే నా కోరికకు మా నాన్న తాను ఉన్నంతవరకు అమ్మేందుకు వీలులేదని చెప్పడం వారి చాదస్తమనుకున్న నేను ఇప్పుడు జాన్సీగారి రచన కళ్ళు తెరిపిస్తుంది.ఇక షార్ట్ హ్యాండ్ విషయంలో వారు మొదట టెన్షన్ పడ్డారేమో కానీ చదివేటప్పుడు నాకు మాత్రం వారి సమస్య దూదిపింజలా తేలిపోతుందనే అనిపించింది. అలాగె జరిగింది. మాతృప్రేమను నాకు తెలిసి నేటీ రచయితలలో జాన్సిగారిలాగ ఎవరూ వర్ణించలేరేమో అనిపిస్తుంది. ముగింపుగ ఒక విషయం. జాన్సీగారి పుస్తకాన్ని చదవడమే ఒక అదృష్టంగ భావిస్తున్నా. ఎందుకంటే వ్రాయడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో విద్వేష అనే పదాన్ని విధ్వేషగ వ్రాస్తే సున్నితంగ సరిదిద్దిన పెద్దమనస్సువారిది. ఇకవారి మరో రచన అనాఛ్ఛాదిత కధ కూడ చదవాలి. నేను అడగగానే వారు విదేశంలో ఉన్నా ఇక్కడికి రాగానే నాకు రెండుపుస్తకాలు పంపిన సహృదయత వారి స్వంతం. నాకు ఉన్న వినికిడి సమస్యమూలంగ వారితో నేరుగ చర్చించలేకున్నా ఇలా అక్షరాలతో కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే అక్షర తప్పులకు క్షంతవ్యుడిని. మేడమ్ గారికి ధన్యవాదములు. **సాగర్ రెడ్డి** **చెన్నై**