జోహార్! సుభాష్ చంద్ర బోస్ - కొమ్మలూరు హరి మదుసూధన రావు

జోహార్! సుభాష్ చంద్ర బోస్

జోహార్! సుభాష్ చంద్ర బోస్

సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 సందర్భంగా

“నాకు మీ రక్తాన్ని ఇవ్వండి - మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను”. అని అన్న మహా ధీశాలి. జయంతులే తప్ప వర్ధంతులు లేనటువంటి మహా నాయకుడు. ‘స్వాతంత్ర్యం బ్రిటీష్ వారిచ్చే భిక్ష కాదు - అది మన హక్కు’ అన్న అత్యంత ప్రజాదరణ కలిగిన స్వాతంత్ర సమరయోధుడు. ఎవరి పేరు చెబితే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయో అతడే అజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ. సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23వ తేదీని భారతీయులు ‘పరాక్రమ దివస్’ గా జరుపుకొంటున్న సందర్భంగా సాహసమే తన ఊపిరిగా పోరాడిన కారణ జన్ముడి గురించి తెలుసుకుందాం.

బాల్యం :

ఒరిస్సా రాష్ట్రంలో కటక్ లో కాయస్థులు అంటే క్షత్రియ కుటుంబానికి చెందిన హరినాధ్ అనే అతను ఉండేవాడు. ఇతడు ధనవంతుడు. ఇతనికి జడినాధ్, కేదారినాధ్, దేవేంద్రనాధ్, జానకీనాధ్ అనే నలుగురు కుమారులు. జానకీనాధ్ న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. కలకత్తాకు వచ్చి మంచి న్యాయవాదిగా పేరుగాంచాడు. దేశభక్తి గలిగిన జాతీయతా వాది. జానకీనాధ్ కి ప్రభావతి దేవితో వివాహం అయ్యింది. వీరికి పద్నాలుగు మంది సంతానం. 1897 జనవరి 23వ తేదీన తొమ్మిదవ సంతానంగా సుభాష్ చంద్రబోస్ జన్మించాడు. రెండవ అన్న శరత్ చంద్ర అంటే సుభాష్ చంద్రబోస్ కి ఎంతో ఇష్టం. తన మీద శరత్ చంద్ర ప్రభావం ఎంతో ఉందని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. ఈయనకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు బాప్టిస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేర్పించారు. ఇందులో చాలా మంది ఆంగ్లేయులు చదువుకునే వారు. ఇంగ్లీష్ బాగా వచ్చినా తెల్లవారిని ఒక ప్రక్క భారతీయులను మరో ప్రక్క కూర్చోబెట్టి పాఠాలను చెప్పేవారు. ఇది బోస్ కు నచ్చేది కాదు. తరువాత రేవెన్ షా హైస్కూల్ అండ్ కాలేజ్ లో చేరారు. మొదట్లో బోస్ ముభావంగా ఉండేవాడు. ఇది గమనించిన పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీ వేణి మాధవ దాస్ బోస్ ను దగ్గరికి తీసుకొని బోస్ లోని ఆత్మన్యూనతను దూరం చేశాడు. దీనితో హెడ్ మాస్టర్ కి దగ్గరయ్యాడు. దాసు బోస్ పై ఎంతో ప్రేమ అభిమానం చూపేవారు. ఆయన బదిలీ అయినప్పుడు బోస్ చాలా బాధ పడ్డాడు. అప్పుడు అయన ‘బాధపడకు బోస్, నేను నీకు తరచుగా ఉత్తరాలు వ్రాస్తూ ఉంటాను. నీకు కష్టం ఎదురైనప్పుడు ఎప్పుడైనా ప్రకృతిలో వచ్చి కూర్చో నీకు ఓదార్పు లభిస్తుంది’ అని ఓదార్చారు.

బోస్ తన దగ్గరి బంధువు దగ్గర స్వామి వివేకానంద పుస్తకం చూసి తీసుకొని చదివాడు. వివేకానంద వ్యక్తిత్వం బోస్ కు చాలా బాగా నచ్చింది. రామకృష్ణ పరమహంస పుస్తకాలను కూడా చదివాడు. పదిహేను సంవత్సరాల వయస్సు లోనే పేద విద్యార్థులకు పాఠాలను చెప్పేవాడు. 1913 లో మెట్రిక్యులేషన్ లో యూనివర్సిటీ లో రెండవ ర్యాంకు సాధించాడు. కలకత్తా లోని ప్రెసిడెన్సీ కాలేజి లో ఇంటర్ పూర్తి చేశాడు. డిగ్రీ లో సైకాలజీ, ఫిలాసఫీ కోర్సులను చదివాడు. కళాశాల లో లీడర్ గా ఉండేవాడు. 1916 లో ఇ.ఎఫ్.ఓటెన్ అనే ఇంగ్లీష్ ప్రొఫెసర్ భారతీయ విద్యార్థులను చిన్న చూపు చూసేవాడు. కొంతమంది విద్యార్థులు అతనిని బాగా కొట్టి కాలువ లో పడేసారు. దీనికి కారణం లీడర్ అయిన సుభాష్ చంద్ర బోసే నని భావించి కళాశాల నుండి బర్తరఫ్ చేశారు. కటక్ వచ్చి అంటువ్యాధులకు గురైన వారికి సేవ చేశాడు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ తండ్రి గారైన అశుతోష్ ముఖర్జీ గారు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉండేవారు. ఈయన స్కాటిష్ చర్చి కళాశాలలో బోస్ కు ప్రవేశం పొందటానికి కృషి చేశారు. బోస్ కళాశాలలో మిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. 1919 లో బి.ఎ. తత్వశాస్త్రం లో ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణుడయ్యాడు.

1919లో ‘ది సిటీ అఫ్ కలకత్తా’ అనే ఓడలో లండన్ వెళ్ళాడు. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో చేరాడు. 1920 లో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ‘భారత దేశపు అలజడి పిత’ గా పేరొందిన లోకమాన్య బాలగంగాధర తిలక్ కేంబ్రిడ్జ్ లో ఉపన్యాసమిస్తూ ‘మీరంతా బ్రిటిష్ పాలకుల సేవకు కాకుండా భారత జాతి సేవకు అంకితం కావాలి’ అని చెప్పాడు. ఇది బోస్ ను ఎంతగానో ప్రభావితం చేసింది. దేశ సేవ కోసం ఐ.సి.యస్. కు రాజీనామా చేసిన ప్రధమ భారతీయుడు బోస్. 1921 లో మణి భవన్ లో మహాత్మా గాంధీని కలిసాడు. ఈ సమావేశం బోస్ కు సంతృప్తి నివ్వలేదు. గాంధీ ఎంచుకున్న విధానం సరైనది కాదని బోస్ భావించాడు. చిత్తరంజన్ దాస్ తో కలిసిన తర్వాత బోస్ కు సంతృప్తి కలిగింది. తనమీద చిత్తరంజన్ దాస్ ప్రభావం ఎంతో ఉందని ‘ఇండియన్ స్ట్రగుల్’ పుస్తకం లో బోస్ రాసుకున్నాడు. కొద్ది కాలంలోనే చిత్తరంజన్ బోస్ కు గురువు, స్నేహితుడు, దైవము, సర్వస్వంగా మారాడు.

కాంగ్రేస్ కార్యకర్త గా :

సుభాష్ చంద్ర బోస్ ‘జాతీయ స్వచ్చంద సేవా దళం’ అనే దానికి నాయకత్వం వహించాడు. మహాత్మా గాంధీ ప్రభావం చేత కాంగ్రేస్ లో చేరాడు. బ్రిటిష్ రాకుమారుని భారత దేశ యాత్రను బహిష్కరించినందుకు బోస్ కు ఆరు నెలల జైలుశిక్ష విధించారు. తర్వాత చిత్తరంజన్ దాస్ కాంగ్రేస్ కు అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. కేంద్ర రాష్ట్ర శాసన సభలకు పోటీ చేయాలని నిర్ణయించారు. కాంగ్రేస్ లోని పెద్ద నాయకులు దీనిని ఆమోదించలేదు. దీనితో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి చిత్తరంజన్ స్వరాజ్య పార్టీని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూను ప్రధాన కార్యదర్శిగా, స్వచ్ఛంద దళపతిగా బోస్ ను నియమించారు. చిత్తరంజన్ దాస్ స్థాపించిన ఫార్వర్డ్ అనే ఆంగ్ల పత్రికకు బోస్ ప్రధాన సంపాదకుడుగా పనిచేసాడు. కేంద్ర రాష్ట్ర ఎన్నికలలో స్వరాజ్య పార్టీ అధిక స్థానాలను గెలుచుకున్నది.

1924 లో చిత్తరంజన్ దాస్ కలకత్తా కార్పోరేషన్ కు మేయర్ గా ఎన్నిక అయ్యారు. బోస్ ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించాడు. ఒకసారి జె.ఆర్.కోట్స్ అనే ఆంగ్లేయుడు సిగార్ పొగ వదులుతూ బోస్ దగ్గరికి వచ్చాడు. బోస్ కు ఇది నచ్చలేదు. ‘నీ క్రింది ఉద్యోగి ఇలాగే అమర్యాదగా ప్రవర్తిస్తే నీకు ఎలా ఉంటుంది ?’ అని అడిగాడు. దీంతో కోట్స్ క్షమాపణ చెప్పాడు. బెంగాల్ ఆర్డినెన్సు తర్వాత బోస్ ను అరెస్ట్ చేసి మాండలే జైలు లో ఉంచారు. తర్వాత కొంత కాలానికి చిత్తరంజన్ దాస్ మరణించారు. బోస్ బాధ వర్ణనాతీతం. రెండు సంవత్సారాలు జైలులో గడిపాడు. ఆరోగ్యం క్షీణించింది. బ్రాంకో న్యుమోనియా వ్యాధితో బాధ పడ్డాడు. బోస్ ను విడుదల చేయాలని కలకత్తా లో ఉద్యమాలు జరిగాయి. జైలులో నుండే పోటీ చేసి బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. అయినా జైలు నుండి బ్రిటీష్ ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తినడంతో చేసేది లేక 1927 మే 15న జైలు నుంచి విడుదల చేశారు.

బోస్ తను నమ్మిన సిద్దాంతాన్ని పాటించటంలో రాజీ లేని మనస్తత్వం కలవాడు. వాటిని అమలు పరచటంలో ఎదురయ్యే కష్టాలకు భయపడే వాడు కాదు. బొంబాయిలో వస్త్ర పరిశ్రమ, కలకత్తాలో జౌళి పరిశ్రమ, జెంషెడ్ పూర్ లో ఉక్కు పరిశ్రమలలో పని చేసే కార్మికుల సమస్యలపై పోరాడి విజయం సాధించాడు. దీనితో ఆయనను ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రేస్ కు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆరోగ్య చికిత్స కోసం ఐరోపా వెళ్ళినప్పుడు ఎమిలీ శాంకల్ ను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నాడు. ఈమె సహాయంతో ‘ది ఇండియన్ స్ట్రగుల్ 1920-34’ అనే పుస్తకం వ్రాశాడు. కొంతకాలం తర్వాత ఎమిలీ శాంకల్ ను భారతీయ పద్ధతి లో వివాహం చేసుకున్నాడు. వియెన్నాలో ఉండగా వారికి పుట్టిన బిడ్డకు అనిత అని పేరు పెట్టుకున్నారు. ఇటలీలో ముస్సోలినీని కలుసుకొని భారత దేశానికి విప్లవం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని చెప్పాడు. ఐరోపాలో ఉండగానే గాంధీజీ చేపట్టిన దండి సత్యాగ్రహం గురించి విని భారతదేశానికి వచ్చి సత్యాగ్రహం లో పాల్గొన్నాడు. ఈ ఉద్యమంలో గాంధీజీ నాయకత్వం ప్రశంసాత్మకం అని పొగిడాడు. ఆరోగ్య సమస్యల వల్ల చికిత్స కోసం మళ్ళీ ఐరోపా వెళ్ళాడు. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ సోదరుడైన విఠల్ భాయ్ పటేల్ ను కలుసుకున్నాడు. విదేశాలలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సేకరించిన లక్ష రూపాయలను విఠల్ భాయ్ బోస్ కు అందించాడు. తాను తలపెట్టిన కార్యభారాన్ని బోస్ చేపట్టటం వల్ల విఠల్ భాయ్ 1933 లో ప్రశాంతంగా కన్నుమూసాడు.

భారతదేశానికి తిరిగి వచ్చిన బోస్ ను బార్డోలీ కి సమీపంలో గల హరిపుర లో జరిగిన కాంగ్రేస్ సమావేశంలో అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశ ప్రాంగణానికి విఠల్ భాయ్ పేరు పెట్టారు. బోస్ ఆకర్షణ వల్ల ఎందరో యువకులు కాంగ్రేస్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండవ సారి కాంగ్రేస్ అధ్యక్ష పదవికి బోస్ పోటీ చేయాలనుకున్నప్పుడు, రెండు సార్లు పోటీ చేయకూడదని మితవాద వర్గం అడ్డుకున్నారు. కానీ బోస్ ఇంతకు ముందు లేని నిబంధన ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించాడు. బోస్ ఎన్నిక కావటం ఇష్టం లేని గాంధీజీ పట్టాభి ని నిలబెట్టాడు. బోస్ పట్టాభిపై పోటీ చేసి గెలుపొందాడు. ‘పట్టాభి ఓటమి నా ఓటమి’ అని గాంధీజీ స్వయంగా ప్రకటించాడు. మొదటినుండి కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పటం బోస్ నైజం. ‘మహాత్ముని గౌరవించటం అంటే ఆయనను గ్రుడ్డిగా అనుసరించటం కాదు’ అని స్పష్టంగా ప్రకటించాడు. బోస్ విధానాలు గాంధీజీకి నచ్చలేదు. గాంధీజీ సూచన మేరకు 12 మంది నాయకులు కాంగ్రేస్ వర్కింగ్ కమిటీకి రాజీనామా చేశారు. అయినా వెనుకంజ వేయకుండా త్రిపురలో జరిగిన కాంగ్రేస్ సభలలో 102 డిగ్రీల జ్వరంలో కూడా స్వయంగా పాల్గొని సభలను బోస్ విజయవంతం చేశాడు. ఇక గాంధీజీ ఇమడలేక, కాంగ్రేస్ ను చీల్చటం ఇష్టం లేక కాంగ్రేస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, 1939 మే నెల లో ‘ఫార్వార్డ్ బ్లాక్’ ను స్థాపించాడు. కాకినాడ లో జరిగిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థి మహా సభలకు 1939 సెప్టెంబర్ లో బోస్ హాజరయ్యాడు. 1940 జనవరిలో మరోసారి రాజమండ్రి, ఏలూరులో పర్యటించి ఉపన్యసించాడు.

మారువేషం లో :

బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులను రెచ్చగొట్టే ఉపన్యాసాలను ఇస్తున్నాడని భావించి బోస్ ను గృహ నిర్భంధం లో ఉంచి పోలీస్ నిఘాను పెట్టారు. భారత దేశం లో ఉన్నంత కాలం జైళ్ళలోనే గడపవలసి వస్తోందని, సమయం వృధా అవుతోందని బాధ పడ్డాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారి తరపున పాల్గొన్న భారతీయులు బందీలుగా జర్మనీ, జపాన్ లకు పట్టుబడ్డారు. వీరిని విడిపించి, బ్రిటీష్ వారిపై యుద్దం చేయడానికి సన్నద్ధం చేయాలనుకున్నాడు. సోదరుడు శరత్ చంద్ర కుమారుడు శశాంక్ తో కలిసి విదేశాలకు వెళ్ళాలనే పన్నాగం పన్నాడు. ఆరోగ్యం బాగోలేదని రాజకీయాలకు దూరంగా ఉంటూ సన్యాసాశ్రమం స్వీకరించాలని అనుకుంటున్నట్టు అందరికీ తెలిపాడు. తన ప్రియ శిష్యుడు అరవింద్ ను తనకు బదులుగా ఇంటిలో ఉంచాడు. బ్రిటిష్ వారు తన మీద పెట్టిన నిఘా నుండి తప్పించుకోవటానికి పొడవైన గడ్డం తో పైజామా షేర్వాణీ , టర్కీ టోపీ ధరించి జనవరి 15వ తేదీ న 1941 సంవత్సరం లో మౌల్వీ వేషంలో బర్ద్వాన్ కు బయలుదేరాడు. పంజాబ్ మీదుగా పెషావర్ చేరుకున్నాడు. అక్కడ పఠాన్ లాగా వేషం వేసి మహమ్మద్ జియాఉద్దీన్ గా పేరు మార్చుకుని చెవిటి, మూగవాడిగా నటిస్తూ కాబూల్ కు కాలినడకన చేరుకున్నాడు. దీనికి తన మిత్రుడు రహమత్ అలీ ఖాన్ సహాయం చేశాడు. రహమత్ అలీ ఖాన్ అసలు పేరు భగత్ రాం తల్వార్. కాబూల్ నుండి సమర్ఖండ్ మీదుగా ‘ఆర్లేండో మేజొట్ట’ అనే పేరు తో రష్యా చేరుకున్నాడు. అక్కడ నుండి బెర్లిన్ చేరుకున్నాడు. అక్కడ ఇంటి దగ్గర బోస్ ఇన్ని రోజులైనా గదిలో నుండి రాలేదని ఇంటి సభ్యులు ఆందోళన పడి గది తలుపులు తెరచి చూడగా అక్కడ అరవింద్ ఉన్నాడు. బోస్ తప్పించుకున్నాడనే విషయం బ్రిటిష్ వారికి తెలిసి, అరెస్ట్ వారెంట్ జారీ చేసే సమయానికే బోస్ బెర్లిన్ చేరుకున్నాడు.

నేతాజీ గా :

బెర్లిన్ లో ‘స్వేచ్ఛా భారత్ కేంద్రం’ అనే దానిని స్థాపించాడు. తమ నినాదంగా అబీద్ హుస్సేన్ అనే కార్యకర్త సూచించిన ‘జై హింద్’ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో బోస్ ను అందరూ ‘హమారా నేతా’ అని పిలిచారు. నేతా అనే పదానికి ‘జీ’ అనే గౌరవాన్ని చేరిస్తే బాగుంటుంది అని భావించి ‘నేతాజీ’ అని పిలవటం మొదలుపెట్టారు.

హిట్లర్ తో సమావేశం :

1942 మే 29న హిట్లర్ ను కలిసి, భారత దేశానికి వచ్చి స్వాతంత్ర్యోద్యమానికి మద్దతు ఇవ్వమని కోరాడు. కానీ హిట్లర్ సమాధానమివ్వలేదు. ‘మీ మద్దతు కోసం నేను ఎంతో కష్టపడి ఆంగ్లేయుల కన్నుగప్పి ఇక్కడకు వచ్చాను. మీరు మద్దతు ఇవ్వనంటే చెప్పండి ఇంతదూరం వచ్చిన వాణ్ని వేరే దేశం పోలేనా’ అని ఆవేశంగా అన్నాడు. నేతాజీ ధైర్యాన్ని చూసి హిట్లర్ మెచ్చుకొని ‘ఆవేశపడకు మిత్రమా! రెండవ ప్రపంచ యుద్ధంలో పూర్తిగా మునిగి ఉన్నాను. నేను ఈ పరిస్థితుల్లో భారతదేశానికి రాలేను. బందీలుగా ఉన్న భారతీయ సైనికులను విడిపిస్తాను’ అన్నాడు. ఆ సైనికులతో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ను జర్మనీ లో ఏర్పాటు చేశాడు. అదే పేరు తో మాస పత్రిక ను, రేడియోను నడిపాడు. బోస్ ఉపన్యాసాలను కిషోర్ చంద్ర తెలుగులోకి అనువదించేవారు. హేంబర్గ్ లో ఇండో - జర్మన్ కల్చరల్ సొసైటీ ఉత్సవంలో ‘జనగణమన’ను జాతీయగీతంగా ప్రకటించి ఆలపించారు. పులి గుర్తుతో త్రివర్ణ భారత పతాకాన్ని ఎగరేశాడు. ఒక స్వతంత్ర దేశాధినేతకు ఇచ్చే గౌరవాన్ని పొందాడు.

సింగపూర్ లో:

రెండవ ప్రపంచ యుద్ధం లో జపాన్ సింగపూర్ ను ఆక్రమించుకుంది. అక్కడ కెప్టెన్ మోహన్ సింగ్ లొంగిపోయిన భారతీయ సైనికులతో ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ అనే సంస్థను ఏర్పాటు చేసాడు. ఇందులో రాస్ బిహారీ బోస్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇతను ఈ సంస్థను ఆజాద్ హింద్ ఫౌజ్ లో విలీనం చేయటానికి జర్మనీ లో ఉన్న బోస్ ను సింగపూర్ కు ఆహ్వానించాడు. బ్రిటిష్ వారు అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానంతో సబ్ మెరైన్ ద్వారా జర్మనీ దక్షిణాఫ్రికా వరకూ పంపించింది. అక్కడ నుండి జపాన్ సబ్ మెరైన్ ను చేరటానికి ఒక రబ్బర్ బోటు సహాయంతో ఈదుకుంటూ వచ్చాడు. దీన్ని చరిత్రకారులు అత్యంత సాహసోపేతమైన చర్య గా వర్ణించారు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ లను కలిపి ఇండియన్ నేషనల్ ఆర్మీ (భారత జాతీయ సైన్యం) గా ఏర్పాటు చేశారు. మహిళలకు కూడా సైన్యం లో స్థానం కల్పించి ఝాన్సీ దళం ను ఏర్పరచి లక్ష్మి సెహగల్ ను కెప్టెన్ గా చేశారు. 1943 అక్టోబర్ 21న స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని సింగపూర్ లో ప్రకటించాడు.

ఛలో ఢిల్లీ :

జపాన్ ప్రధాని టోజో తో సమావేశమయ్యాడు. బుద్ధుడు పుట్టిన దేశంలో శాంతిని నెలకొల్పడానికి మిలటరీ సహాయం అందిస్తామని టోజో అభయహస్తం ఇచ్చాడు. టోజో నేతాజీని ఇండియన్ సమురాయ్ గా కీర్తించాడు. జపాన్ ప్రభుత్వం ఇండియన్ నేషనల్ ఆర్మీకి అధికారిక గుర్తింపు నిచ్చింది. పరిపాలించుకోవడానికి తమ ఆధీనంలోని అండమాన్ నికోబార్ దీవులను ఇచ్చింది. 1943 డిసెంబర్ 29న ముప్పై వేల మంది సైన్యంతో పోర్ట్ బ్లయర్ వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ఇక భారతదేశంలోని బ్రిటీష్ వారితో యుద్ధం చేయడానికి నిశ్చయించి ‘ఛలో ఢిల్లీ’ నినాదం ఇచ్చాడు. 1944 మార్చి 14 వ తేదీన బర్మాలోని చింద్విన్ నదిని దాటి భారతదేశంలోని కోహిమాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంఫాల్ ను ఆక్రమించు కోవాలని నిశ్చయించాడు. కానీ భయంకరమైన తుఫాను సంభవించింది. తినడానికి తిండి లేదు. త్రాగడానికి నీళ్ళు లేవు. అప్పటికే చాలా దూరం ప్రయాణించడం సైన్యంలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితులలో యుద్ధాన్ని కొనగించడం కష్టమని తలచి తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపి వేశాడు. నేతాజీ సింగపూర్ కు వెళ్లి పోయాడు.

అమరజీవి :

రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పరాజితుడై ఆత్మహత్య చేసుకున్నాడు. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి లపై అణుబాంబులను అమెరికా ప్రయోగించడం ద్వారా జపాన్ లొంగి పోయింది. యుద్ధం లో గాయపడిన జపనీయులకు సహాయం చేయడానికి నేతాజీ తైవాన్ నుంచి టోక్యో కు వెళ్ళడానికి ఆగష్టు 17, 1945లో సైగాన్ విమానాశ్రయం నుండి బయలుదేరాడు. కొంతసేపటికి విమానం ప్రమాదానికి గురయ్యింది. నేతాజీ జాడ తెలియలేదు. ప్రమాదంలో నేతాజీ మరణించ లేదని విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయం గురించి వివరాలు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖర్జీ కమీషన్ ని నియమించింది. కానీ ఈ కమీషన్ కు కూడా నేతాజీ మరణంపై స్పష్టమైన సమాచారాన్ని అందించలేక పోయింది. అయినా ప్రతి భారతీయుడి గుండెలలో నేటికీ అమరజీవి గా నిలిచాడు నేతాజీ.

జై హింద్